ఊళ్లకు వస్తున్నోళ్ల ఓట్లు ఎవరికి?

ఒక్క హైదరాబాద్ నుంచి మాత్రమే కాదు బెంగళూరు.. చెన్నై మొదలు కొని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారితో పాటు.. విదేశాల్లో ఉన్న వారిలో వందలాది మంది ప్లైట్ ఛార్జీలు పెట్టుకొని మరీ ఏపీకి వస్తున్నారు ఓటేసేందుకు.

Update: 2024-05-12 04:32 GMT

ఓట్ల పండుగ రోజున ఇంటికి కాస్త దూరాన ఉన్న పోలింగ్ స్టేషన్ కు వెళ్లి ఓటేయటానికి ఇష్టపడని ఎంతోమంది నగర జీవుల్ని చూస్తుంటాం. ఈ కారణంగానే హైదరాబాద్ మహానగరంలో ఓటింగ్ శాతం అంతంతమాత్రంగా నమోదవుతూ ఉంటుంది. యావత్ తెలంగాణలో పోల్ పర్సంటేజీ భారీగా ఉన్నా.. హైదరాబాద్ పుణ్యమా అని అది కాస్తా తక్కువగా నమోదవుతూ ఉంటుంది.

అలాంటి హైదరాబాద్ లో ఉంటున్న వేలాది మంది ఇప్పుడు ఏపీ బాట పట్టారు. అది కూడా ఓటేయటం కోసం. వివిధ రాజకీయ పార్టీలు.. నేతలు పోటాపోటీగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లోనే కాదు.. సొంత వాహనాలు.. రైళ్లు.. ప్రైవేటు బస్సులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఓటు వేయటానికి ఊరికి వెళ్లే ఎలాంటి అవకాశం ఉన్నా వదలకుండా వెళుతున్న వారి సంఖ్య వేల సంఖ్యను దాటేసి లక్షలుగా మారటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఒక్క హైదరాబాద్ నుంచి మాత్రమే కాదు బెంగళూరు.. చెన్నై మొదలు కొని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారితో పాటు.. విదేశాల్లో ఉన్న వారిలో వందలాది మంది ప్లైట్ ఛార్జీలు పెట్టుకొని మరీ ఏపీకి వస్తున్నారు ఓటేసేందుకు. మరి.. ఇన్ని వ్యయప్రయాసలతో ఊరికి వస్తున్న వారు ఎవరికి ఓటు వేయనున్నారు? అన్నదిప్పుడు ప్రశ్న. అదే రాజకీయ పార్టీల మెదళ్లను తొలిచేస్తోంది.

బయట నుంచి ఊళ్లకు వస్తున్నోళ్ల ఓట్లు మొత్తం తమవేనంటూ ఒక పార్టీ వినిపిస్తున్న వాదనలో ఎలాంటి పస లేదంటున్నారు. బయట ప్రాంతాల్లో ఉన్న వారంతా ఒకే పార్టీకి చెందిన వారంటూ ఎలా ముద్ర వేస్తారన్నది ప్రశ్న. నిజమే.. లాజిక్ ఉన్న ఈ ప్రశ్నకు సరైన సమాధానం వెతికితే ఆసక్తికరంగా ఉంటోంది. గతానికి భిన్నంగా ఈసారి వివిధ ప్రాంతాల నుంచి ఏపీకి వస్తున్న ఓటర్లలో రెండు ప్రధాన పార్టీలకు చెందిన వారున్నారని చెప్పక తప్పదు. ఒకరిని చూసి మరొకరు పోటాపోటీగా తమ మద్దతుదారులను ఊళ్లకు వచ్చేలా చేయటం కోసం భారీగా ఫోకస్ చేశారు.

ఈ కారణంగానే గత ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి ఎన్నికలకు ఊళ్లకు ఓటేయటానికి వచ్చే వారి సంఖ్య పెరిగినట్లుగా చెబుతున్నారు. ఏపీలో జరుగుతున్న ఎన్నికలు ఎంత హోరాహోరీగా సాగుతున్నాయన్న దానికి నిదర్శనం బయట నుంచి ఊళ్లకు వస్తున్న వారేనని చెబుతున్నారు. ఈసారి ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం కావటంతో తమ ఓటును తప్పనిసరిగా వేయాలని తపిస్తున్నారు. ఈ కారణంగానే.. ఏపీకి వచ్చే రహదారులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇలా వచ్చే వారి ఓట్లు గంపగుత్తగా కాకుండా.. సగం సగం పడే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News