బై బై కేసీఆర్....మరి మీ సంగతేంటి షర్మిలమ్మా..
ఒక సూట్ కేస్ మీద బై బై కేసీయార్ అంటూ ఆమె రాసి ఉంచిన దాన్ని ఫోటో ద్వారా ప్రదర్శించారు.
తెలంగాణాలో బీయారెస్ ఓడిపోతోందని ఆనందం వ్యక్తం చేస్తూ వైఎస్సార్టీపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల బై బై కేసీయార్ అంటున్నారు. అంతే కాదు ఆయనకు ఒక గిఫ్ట్ కూడా రెడీ చేయించారు. ఒక సూట్ కేస్ మీద బై బై కేసీయార్ అంటూ ఆమె రాసి ఉంచిన దాన్ని ఫోటో ద్వారా ప్రదర్శించారు. దాన్ని కేసీయార్ కి ఆమె పంపించారు.
కేసీయార్ ని ఓడించడం కోసమే తాము కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నామని ఆమె చెప్పుకొచ్చారు. కేసీయార్ పాలన నుంచి తెలంగాణాను విడిపించేందుకే తాము అతి పెద్ద త్యాగం చేశామని కూడా ఆమె అన్నారు. తమ పార్టీ నేతలు ఎందరు కోరినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తాము కాంగ్రెస్ విజయం కోసం పాటుపడ్డామని ఆమె చెప్పారు.
ప్రజలు కూడా కేసీయార్ పాలన వద్దు అనుకున్నారని అందుకే తాము కాంగ్రెస్ ని గెలిపించాలని పిలుపు ఇచ్చామని అన్నారు. కేసీయార్ ఇక సూట్ కేసు సర్దుకునే టైం వచ్చిందని చెప్పేందుకే సింబాలిక్ గా సూట్ కేస్ ని రెడీ చేసి మరీ షర్మిల పంపించారు. ఇక కర్నాటక ఎన్నికల్లో 71 మంది కేవలం పది వేల ఓట్ల తేడాతో గెలిచారని ఆమె గుర్తు చేశారు.
తాము పోటీ చేస్తే కనీసం అయిదు వేల ఓట్లు అయినా చీలిక వస్తుందని అలా కాంగ్రెస్ ఓడిపోవడం ఇష్టం లేకనే తాము తప్పుకున్నామ్ని అన్నారు. కేసీయార్ ని మించిన అవినీతి రాజకీయ నేత లేరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా చెప్పారని అయినా ఆయన మీద చర్యలు లేవని అందువల్లనే బీయారెస్ బీజేపీ ఒక్కటని ప్రజలు నమ్మారని ఆమె అన్నారు.
మొత్తానికి కేసీయార్ ఓటమి ఖాయమైనదని ఒక రోజు ముందే షర్మిల డిక్లేర్ చేసి ఆయనకు సూట్ కేసు కూడా పంపించేశారు. సరే కేసీయార్ ఆయన పార్టీ గెలుస్తుందా ఓడుతుందా అన్నది పక్కన పెడితే వైఎస్ షర్మిల పార్టీ సంగతేంటి అని అంతా ప్రశ్నిస్తున్నారు. వైఎస్ షర్మిల పార్టీలో ఆమె తప్ప మరో లీడర్ కనిపించరు. ఇక ఆమె కూడా ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుపు కష్టమే అని సర్వే నివేదికలు కూడా వచ్చాయని గుర్తు చేస్తున్నారు.
ఇపుడు కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడం ద్వారా గాలికి పోయిన పేలపిండి రామార్పణం అంటూ ఆమె అంటున్నట్లుగా ఉందని అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే అనేక ఫ్యాక్టర్స్ కారణం అవుతాయని, గెలుపునకు అందరూ హక్కుదారులే అన్నట్లుగా ఎవరైనా చెప్పుకోవచ్చు కానీ పక్క పార్టీ గెలుపులో ఆనందించడమే లేక తన పార్టీని ఇక మీదట ఏమైనా చక్కదిద్దుకుంటారా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
ఇక షర్మిల మూడున్నరేళ్ళుగా పార్టీ పెట్టి తెలంగాణా అంతా వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా తీరా ఎన్నికల వేళకు పోటీ చేయలేక చేతులెత్తేశారు అన్న విమర్శలు ఉన్నాయి. ఇపుడే ఇలా ఉంటే మరో అయిదేళ్ళు పార్టీని నడిపగలరా. 2028 నాటికి అయినా ఆమె పోటీ చేయగలరా అన్న ప్రశ్నలూ ఉన్నాయి.
కాంగ్రెస్ బీయారెస్ ల గెలుపు ఓటముల సంగతి పక్కన పెట్టి ముందు షర్మిల తమ సంగతి కూడా ఆలోచిస్తే బాగుంటుంది అని అంటున్నారు. ఇక కాంగ్రెస్ లో చాలా మంది నేతలు ఉన్నారని, షర్మిల పార్టీని విలీనం చేసుకుని ఆమెకు అవకాశాలు ఎంతమేరకు ఇస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా షర్మిల సంబరాలు ఇక చాలు అనే అంటున్న వారే సోషల్ మీడియా నిండా ఉన్నారు.