కేసీఆర్తో ఫోన్ సంభాషణ.. మాజీ మంత్రి శాంతించినట్టేనా?
అనంతరం సీఎం కేసీఆర్ మాజీ మంత్రి తుమ్మల ఫోన్ లో మాట్లాడుకున్నారని తెలుస్తోంది. వీటన్నటి మధ్య తుమ్మల కాస్త వెనక్కుతగ్గినట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ లో టికెట్ దక్కనివారు ఆరున్నొక అసమ్మతి రాగం వినిపిస్తూనే ఉన్నారు. అయితే ఎక్కడికక్కడ సర్దిచెపుపుకొంటూ వెళ్తోంది ఆ పార్టీ అధిష్ఠానం. ఉదాహరణకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి ఏకంగా మంత్రిమండలిలో స్థానం కల్పించింది. ఉమ్మడి వరంగల్ లో మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య వద్దకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని రాయబారానికి పంపింది. ఇక మిగిలిన ప్రధాన జిల్లా ఉమ్మడి ఖమ్మం. ఇక్కడ టికెట్ దక్కనిది కీలక నేత తుమ్మల నాగేశ్వరరావుకు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈయనకు బలం బలగం ఉంది. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తుమ్మల పలు దఫాలు మంత్రిగానూ పనిచేశారు. 2014లో ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా ఓడినప్పటికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్కున చేర్చుకుని ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రిని చేశారు. 2018లో పాలేరు నుంచి అనూహ్యంగా ఓటమి పాలైన తర్వాత మాత్రం ఎలాంటి పదవీ లేకుండా ఉండిపోవాల్సి వచ్చింది.
టికెట్ కోసం పట్టుబట్టి..
పాలేరులో ఓడినప్పటికీ ఐదేళ్లుగా ఆ నియోజకవర్గంతో సంబంధాలను కొనసాగిస్తున్నారు తుమ్మల. పునర్విభజన నేపథ్యంలో ఆయనకిది మూడో నియోజకవర్గం. సత్తుపల్లి నుంచి మూడుసార్లు గెలిచిన తుమ్మల.. 2009లో ఖమ్మం, 2016లో పాలేరు ఉప ఎన్నికల్లో నెగ్గారు. అయితే, అదే ఊపులో 2018లో టికెట్ వచ్చినప్పటికీ మంత్రి హోదాలో ఉంటూ పాలేరులో పరాజయం పాలయ్యారు. అక్కడ కాంగ్రెస్ తరఫున గెలిచిన కందాళ ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ లోకి రావడంతోనే చిక్కొచ్చిపడింది. చివరకు ప్రస్తుతం టికెట్ కూడా కందాళకే దక్కడంతో తుమ్మల రాజకీయ చౌరస్తాలో నిలిచారు.
రాయబారానికి రాజకీయ ప్రత్యర్థి
తమ్మలకు.. ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు టీడీపీలో ఉన్నప్పటి నుంచే రాజకీయ ప్రత్యర్థి. ముందుగా తుమ్మల బీఆర్ఎస్ లోకి వచ్చినా, నామా కూడా 2019లో అదే బాట పట్టారు. దీనికి ముఖ్యంగా తోడ్పడింది ఉమ్మడి ఖమ్మం రాజకీయ పరిస్థితులే. అయితే, పాలేరులో ఓటమితో బీఆర్ఎస్ లో తుమ్మల ప్రాధాన్యం తగ్గగా, నామా గెలిచిన వెంటన లోక్ సభా పక్ష నేత అయ్యారు. చిత్రం ఏమిటంటే ఇప్పుడదే నామా.. తుమ్మలను శాంతింపజేసేందుకు రాయబారానికి వెళ్లారు.
గంట పాటు చర్చ.. సీఎం తో ఫోన్ సంభాషణ
పార్టీ మారదాం.. కాంగ్రెస్ లోకి వెళదాం అంటూ ఖమ్మంలో తుమ్మల అనుచరులు హంగామా చేయడంతో శాంతి చర్చలకు నామానే చొరవ చూపినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని తుమ్మల ఇంటికి వెళ్లిన ఆయన గంట పాటు మాట్లాడారు. అనంతరం సీఎం కేసీఆర్ మాజీ మంత్రి తుమ్మల ఫోన్ లో మాట్లాడుకున్నారని తెలుస్తోంది. వీటన్నటి మధ్య తుమ్మల కాస్త వెనక్కుతగ్గినట్లు తెలుస్తోంది. అయితే, అనిశ్చితి మాత్రం పూర్తిగా పోలేదని చెప్పవచ్చు. ఏది ఏమైనా.. అటు అనుచరుల ఒత్తిడి.. ఇటు స్నేహితుడు సీఎం కేసీఆర్ బుజ్జగింపుల నడుమ తుమ్మల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.