త‌మ్ముళ్ల దూకుడుకు బాబు బ్రేకులు వేయ‌లేరా?

క్షేత్ర‌స్థాయిలో త‌మ్ముళ్లు రెచ్చిపోతున్న తీరును ఎండ‌గ‌డుతూ.. టీడీపీకి బ‌ల‌మైన మ‌ద్దతుగా ఉండే మీడియాలోనే పేజీల‌కు పేజీల క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

Update: 2024-10-09 01:30 GMT

త‌మ్ముళ్ల తీరు ప‌లు విధాలుగా ఉంది. ఎంత దాద్దామ‌నుకున్నా.. త‌మ్ముళ్లు దాచ‌లేని స్థాయిలో రెచ్చిపో తున్నారు. ఒక‌రు ఇసుకంటే.. మ‌రొక‌రు లిక్క‌ర్ అంటున్నారు. క‌లివిడి అనేక ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ప్ర‌భుత్వానికి అప్పుడే చెడ్డ‌పేరు వ‌స్తుందేమో.. అన్న భ‌యం కూడా లేదు. క్షేత్ర‌స్థాయిలో త‌మ్ముళ్లు రెచ్చిపోతున్న తీరును ఎండ‌గ‌డుతూ.. టీడీపీకి బ‌ల‌మైన మ‌ద్దతుగా ఉండే మీడియాలోనే పేజీల‌కు పేజీల క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

ఒక‌ప్పుడు వైసీపీలో నాయ‌కులు రెచ్చిపోవ‌డానికి కొంత స‌మ‌యం తీసుకున్నారు. తొలి రెండేళ్లు హ‌ద్దుల్లో నే ఉన్నారు. అధినేత‌కు ఎక్క‌డ చెడ్డ‌పేరు వ‌స్తుందో.. త‌మ‌కు వ్య‌తిరేక మీడియా ఎక్క‌డ యాగీ చేస్తుందోన న్న భ‌యం కూడా వైసీపీ నేత‌ల‌ను వెంటాడింది. దీంతో తొలి రెండేళ్ల‌లో ఎక్క‌డా అవినీతి, అక్ర‌మం అన్న మాట వినిపించ‌లేదు. ఆ త‌ర్వాత‌.. చెల‌రేగ‌డం.. వారికి ప్ర‌జ‌లు వాత‌లు పెట్ట‌డం తెలిసిందే. కానీ.. ఇప్పుడు కూట‌మి స‌ర్కారు వ‌చ్చీరావ‌డంతోనే త‌మ్ముళ్లు గ‌ల్లాలు తెరిచేశారు.

ఈ ప‌రిణామ‌మే ఇప్పుడు ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు తెచ్చేస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇసుక విషయంలో త‌మ్ముళ్లు రెచ్చిపోయారు. ఇప్పుడు మ‌ద్యం షాపుల విష‌యంలో నేనంటే నేనే అంటూ.. ఎక్క‌డిక‌క్క‌డ ఆధిప‌త్యం చ‌లాయిస్తున్నారు. వ్యాపారుల‌ను టెండ‌ర్ల‌లో కూడా పాల్గొన‌కుండా చేస్తున్నారు. పాల్గొన్న చోట కూడా.. వాటాలు ముందే నిర్ణ‌యించుకున్నారు. మ‌రీ ముఖ్యంగా విజ‌య‌వాడ వంటి చోట అయితే.. ముందుగానే ముడుపులు తీసుకున్న‌ట్టు టీడీపీ వ‌ర్గాలే చెబుతున్నాయి.

అంతేకాదు.. మ‌రికొంద‌రు త‌మ్ముళ్ల‌యితే.. `రాసుకో!` అంటూ మీడియా ప్ర‌తినిధుల‌ను హెచ్చ‌రిస్తున్నారు. వెబ్‌సైట్ల‌కు ఆర్టిక‌ల్స్ రాసేవారిని హెచ్చ‌రిస్తున్నారు. `ఏం పీకుతారు` అంటూ.. ప‌రుష ప‌దాలు కూడా వాడుతున్నారు. సో.. స‌ర్కారు ఏర్ప‌డిన 100 రోజుల్లోనే ప‌రిస్థితి ఇలా ఉంటే.. ఎలా? అనేది సామాన్యుల ప్ర‌శ్న‌. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. బీజేపీ త‌ప్ప‌.. జ‌న‌సేన నాయ‌కులు కూడా.. ఈ దందాల్లో పాలు పంచుకుంటున్నారు. ఇది ఎవ‌రో చెప్పిన విష‌యం కాదు.. టీడీపీకి అత్యంత విధేయ మీడియాలే వెల్ల‌డిస్తున్నాయి!!

Tags:    

Similar News