కేసీఅర్ జగన్ : ఆ లెక్కలేంటి ?

ఈ ఇద్దరూ ఆరు నెలల తేడాతో ఓటమి పాలై మాజీ సీఎంలుగా మిగిలారు.

Update: 2025-02-20 01:30 GMT

సరిగ్గా ఒకే సమయంలో అటు కేసీఆర్ ఇటు జగన్ జోరు పెంచుతున్నారు. కేసీఆర్ పార్టీ ఆఫీసుకు వచ్చి కీలక సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అలాగే జగన్ బయటకు వచ్చి పర్యటనలు మొదలుపెట్టారు. ఈ ఇద్దరూ ఆరు నెలల తేడాతో ఓటమి పాలై మాజీ సీఎంలుగా మిగిలారు.

ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఇద్దరూ రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నపుడు పరస్పరం గౌరవించుకుంటూ స్నేహ సంబంధాలు కొనసాగించారు. మరో వైపు చూస్తే ఇద్దరూ మళ్ళీ అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నాలు చేశారు. అంతే కాదు అధికారం తమ నుంచి జారిపోదని ధీమా ఎక్కువగానే ప్రదర్శించారు.

మొత్తానికి మొత్తం సిట్టింగులను కొనసాగిస్తూ కేసీఆర్ ఎన్నికలకు వెళ్తే రిజల్ట్ తేడా కొట్టింది. ఇక సిట్టింగులలో వంద మంది దాకా స్థాన చలనం చేస్తే కూడా జగన్ ప్రయోగం బెడిసికొట్టింది. అలా ఇద్దరి రాజకీయ ప్రయోగాలు విఫలం అయి విపక్షంలోకి వచ్చారు.

ఇదిలా ఉంటే దాదాపుగా పద్నాలుగు నెలల తరువాత కేసీఅర్ దూకుడు పెంచుతున్నారు. ఆయన పార్టీ ఆఫీసులోకి వచ్చి క్యాడర్ ని ఉత్తేజపరచేలా ప్రసంగం చేశారు. ఆరు నూరు అయినా ఈసారి వచ్చేది బీఆర్ఎస్ నే అని గట్టి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిదని ఇక లేవడం కష్టమని కూడా విశ్లేషించారు. కేసీఆర్ ని పార్టీ క్యాడర్ అంతా సీఎం అంటూ హోరెత్తించింది. ఒక దశలో కేసీఆర్ వారిని వారించాల్సి వచ్చింది.

ఇక చూస్తే కనుక తెలంగాణాలో కాంగ్రెస్ చేతిలో మూడున్నరేళ్ళ పాలన ఉంది. కాంగ్రెస్ పాలనలో తప్పులు కొన్ని జరిగినా గతంలో మాదిరిగా అనుకున్న స్థాయిలో వ్యతిరేకత అయితే ఇంకా లేదు. ఒకవేళ వచ్చినా సరిదిద్దుకునేందుకు కావాల్సినంత సమయం ఉంది. కాంగ్రెస్ సామాజిక సమీకరణలను కూడా నమ్ముకుంటూ కొత్త ఎత్తులు వేస్తోంది. బీసీ నినాదం ఆ పార్టీ చేతిలో ట్రంప్ కార్డుగా ఉంచుకుంది.

అయినా సరే కాంగ్రెస్ లోని వర్గ పోరు అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాతావరణం అన్నీ చూసుకుని కేసీఆర్ ఈసారి ఓటమి పాలు కాక తప్పదని అంచనా వేసుకుంటున్నారు అని అంటున్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం బలహీనంగా ఉండడం కూడా కేసీఆర్ ఆశలను పెంచుతున్నాయని అంటున్నారు.

ఇక ఏపీలో జగన్ తీరు చూస్తే ఎనిమిది నెలలు నిండి తొమ్మిదవ నెలలోకి కూటమి ప్రభుత్వం ప్రవేశించింది. అయితే మళ్ళీ మనదే అధికారం అని జగన్ ఆత్మ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మేమే వస్తున్నానమని ఆయన ఢంకా భజాయిస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలు ఏవీ ప్రభుత్వం నెరవేర్చడం లేదని ఆయన విమర్శిస్తున్నారు.

అంతే కాదు ఏపీలో కూటమి సర్కార్ పట్ల అపుడే భారీ వ్యతిరేకత వచ్చిందని భావిస్తున్నట్లుగా ఉంది. అయితే కూటమి చేతిలో ఇంకా నాలుగేళ్ళకు పైగా అధికారం ఉంది. అక్కడ ఉన్నది చంద్రబాబు. ఆయన అపర చాణక్యుడు చివరి నిమిషం దాకా పోరాడే నేర్పూ ఓర్పు ఉన్న నాయకుడు. అంతే కాదు బాబు మార్క్ పాలిటిక్స్ ని ఎవరూ తక్కువ చేయలేరు, అంచనా కట్టలేరు.

అయినా ఈసారి మేమే ఎన్నికల్లో గెలుస్తామని జగన్ అంటున్నారు అంటే ఆయన లెక్కలేంటి అన్న చర్చ సాగుతోంది. సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చడం అసాధ్యమని ఆయన బలంగా నమ్ముతున్నారు. అంతే కాదు పోలవరం అమరావతి వంటి బిగ్ ప్రాజెక్టులు కూడా వచ్చే ఎన్నికల నాటికి ఏ మేరకు సాకారం అవుతాయన్న చర్చ కూడా ఉంది.

మరో వైపు చూస్తే కూటమిలో ఉన్న మూడు పార్టీలు అక్కడ సాగుతున్న రాజకీయ పరిణామాలు కూడా వైసీపీలో కొత్త ఆశలను రేపుతున్నాయని అంటున్నారు. వీటికి మించి ఏపీలో ఉన్న మరో సెంటిమెంట్ కూడా ఈసారి వైసీపీదే అధికారం అని చెప్పేలా చేస్తోంది అని అంటున్నారు. ఏపీ జనాలకు ఒక ప్రభుత్వం ఎంత చేసినా అయిదేళ్ళ తరువాత దించేసి కొత్త ప్రభుత్వాన్ని తెస్తారు.

ఇది చాలా ఎన్నికల నుంచి సాగుతూనే ఉంది. ఆ విధనమైన లెక్కలు అంచనాలతోనే జగన్ వచ్చేది మేమే అని బిగ్ సౌండ్ చేస్తున్నారు అనుకోవాల్సి ఉంది. ఏది ఏమైనా అటు కేసీఅర్ ఇటు జగన్ మళ్ళీ ముఖ్యమంత్రులు అవుతామని చెబుతున్న మాటలు ఆయా పార్టీలకు మాత్రం కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయని చెప్పక తప్పదు.

Tags:    

Similar News