భారత్ - కెనడాల మధ్య ఖలిస్తానీ చిచ్చు.. తీవ్ర వివాదం!!
ఇటీవల పంజాబ్‌లో ఖలిస్తానీ తీవ్రవాది వ్యవహారం చర్చకు రావడం.. రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
కెనడా.. భారత్‌కు మిత్ర దేశం. అంతేకాదు, వాణిజ్య పరంగా కెనడా భారత్‌తో కలిసి అనేక రూపాల్లో ముందు కు సాగుతున్న దేశం కూడా! అయితే.. ఇప్పుడు ఇదే కెనడాతో భారత్‌కు విభేదాలు ఏర్పడ్డాయని అంతర్జా తీయ పరిశీలకులు చెబుతున్నారు. దీంతోకీలకమైన వాణిజ్య చర్చలు, ఒప్పందాలు ఇరు దేశాల మధ్య నిలిచిపోయాయి. మరి దీనికి కారణం ఏంటి? అసలు వివాదాలు, విభేదాలు ఎందుకు తలెత్తాయి? ఇవీ..ఇప్పుడు జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా చర్చకు వస్తున్న కీలక విషయాలు.
భారత వ్యతిరేక శక్తులకు..
భారత్ తన వ్యతిరేక శక్తులుగా ఉగ్రవాదులను చూస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న వాదనను వినిపిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా భారత్ తన వ్యతిరేక శక్తులుగా చూస్తున్న వారిలో ఖలిస్తాన్ తీవ్రవాదులు కూడా ఉన్నారు. ఇటీవల పంజాబ్‌లో ఖలిస్తానీ తీవ్రవాది వ్యవహారం చర్చకు రావడం.. రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే, భారత్ వ్యతిరేకిస్తున్న ఖలిస్తానీలకు కెనడా ఆశ్రయం కల్పిస్తోందన్నది భారత ప్రభుత్వం వాదన. కెనడాలో ఖలిస్థానీ సానుభూతిపరులు ఆందోళనలు చేస్తున్నా..అక్కడి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందని భారత్ పేర్కొంటోంది. ఖలిస్తానీ తీవ్రవాదులతో ముప్పు ఉందని, ఇలాంటి వారిని ఉపేక్షించరాదనేది భారత్ వాదన. అయితే, మిత్రదేశమే అయినా.. కెనడా.. భారత్ వాదనను పట్టించుకోవడం లేదు. ఇదే ఈ రెండు దేశాలకు వివాదాన్ని సృష్టించింది.
ఇటీవల జీ20 సదస్సుకు వచ్చిన ట్రూడోతో భారత ప్రధాని నరేంద్రమోడీ ఖలిస్తానీ విషయాన్ని నేరుగా ప్రస్తావించారు. భారత్ వ్యతిరేక శక్తులు కెనడాలో ఆశ్రయం పొందుతున్నారని, అది కెనడాకు కూడా ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. భారత్-కెనడా దౌత్య సంబంధాల పురోగతిలో పరస్పర గౌరవం, విశ్వాసం చాలా ముఖ్యమని తేల్చిచెప్పారు. అయినా.. ట్రుడో పట్టించుకోనట్టు వ్యవహరించారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్నాయి.
నిలిచిన వాణిజ్య చర్చలు..
భారత్, కెనడా మధ్య ఇప్పటివరకు ఆరు సార్లు వాణిజ్య చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య అత్యధిక వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని తొలగించడం లేదా తగ్గించడం, పెట్టుబడులను ఆకర్షించేలా వాణిజ్య నిబంధనలను సరళీకరించడం ఈ చర్చల ముఖ్య ఉద్దేశం. ఈ ఒప్పందంతో టెక్స్‌టైల్, లెదర్ వంటి ఉత్పత్తులపై సుంకాలను తొలగించుకోవడంతో పాటు వీసా నిబంధనలను కూడా సులభతరం చేసుకోవచ్చని భారత్ భావిస్తోంది. అటు భారత్ నుంచి డెయిరీ, వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ ధరకు దిగుమతి చేసుకోవచ్చని కెనడా ఈ చర్చలు ప్రారంభించింది. అయితే.. ఇప్పుడు ఈ చర్చలు రెండు సార్లుగా వాయిదాలు పడ్డాయి.