హాట్‌ టాపిక్‌.. మనం 300 ఏళ్లు జీవించవచ్చా?

పాడైన అవయవాలు, మరణించే దశలో ఉన్న జీవకణాలను మార్చడం ద్వారా మనం 200, 300 ఏళ్లు జీవించే వీలుంటుందని చెప్పారు.

Update: 2024-01-06 04:48 GMT

భవిష్యత్తులో మనిషి 200, 300 ఏళ్లు కూడా జీవించొచ్చని ఇప్పటికే వైద్య నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. వైద్య రంగంలో వస్తున్న ఆవిష్కరణలు, కీలక పరిశోధనలు ఇందుకు సంబంధించి ఆశను కల్పిస్తున్నాయని అంటున్నారు. తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్‌ డాక్టర్‌ సోమనాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో మనిషి 200, 300 ఏళ్లు కూడా జీవించవచ్చని వెల్లడించారు

ప్రస్తుతం విద్య, వైద్య, ఫార్మా రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు, భవిష్యత్తులో వచ్చే వినూత్న ఆవిష్కరణలతో మనిషి జీవించే కాలం పెరిగే అవకాశాలు ఉన్నాయని సోమనాథ్‌ అభిప్రాయపడ్డారు. పాడైన అవయవాలు, మరణించే దశలో ఉన్న జీవకణాలను మార్చడం ద్వారా మనం 200, 300 ఏళ్లు జీవించే వీలుంటుందని చెప్పారు.

మనదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు మనిషి సగటు జీవితకాలం 35 ఏళ్లేనని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ గుర్తు చేశారు. ప్రస్తుతం మనిషి సగటు జీవిత కాలం 70 ఏళ్లుగా ఉందన్నారు. జేఎన్‌టీయూ హైదరాబాద్‌ స్నాతకోత్సవంలో మాట్లాడిన సోమనాథ్‌ అనేక విషయాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

దేశంలో భారీ వ్యయంతో నిర్మిస్తున్న సినిమాలతో పోలిస్తే అంతరిక్ష రహస్యాలను తెలుసుకునేందుకు ఇస్రో చేస్తున్న పరిశోధనలు చాలా తక్కువ ఖర్చుతో పూర్తవుతున్నాయని ఆయన హాట్‌ కామెంట్స్‌ చేశారు.

విద్యార్థులు బావిలో కప్పల్లా ఉండకూడదని సోమనాథ్‌ సూచించారు. కృత్రిమ మేథ, మిషన్‌ లెర్నింగ్‌ ప్రభావం ఇప్పటికే చదువులు, పరిశోధనలపై పడిందని గుర్తు చేశారు. రోబోటిక్‌ సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి ఉన్న విద్యార్థులు అత్యాధునిక రోబోలు సృష్టిస్తే వాటిని భవిష్యత్తులో ఇస్రో తరఫున పలు ప్రయోగాల్లో వినియోగించుకుంటామని బంఫర్‌ ఆఫర్‌ ఇచ్చారు.

ఈ ఏడాది పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీలను గ్రహాల కక్ష్యల్లోకి పంపుతున్నామని తెలిపారు. వీటిద్వారా తుపాన్లు, భారీ వర్షాలు ఎప్పుడు, ఎక్కడ వస్తాయన్నది కచ్చితంగా తెలిసే అవకాశాలున్నాయని వెల్లడించారు. అంతరిక్షంలోకి భారత యాత్రికులను పంపే ‘మిషన్‌ గగన్‌ యాన్‌’ను ఈ ఏడాదిలోపు పూర్తి చేస్తామన్నారు. సూర్యగ్రహంపై చేస్తున్న ప్రయోగం జనవరి 6న సాయంత్రం 4 గంటలకు మొదలవుతుంది అని తెలిపారు.

ఏదైనా సబ్జెక్ట్‌ ఫెయిలైతే పిల్లలపై తల్లిదండ్రులు, స్నేహితుల ఒత్తిళ్లు తీవ్రంగా ఉంటున్నాయని సోమనాథ్‌ తెలిపారు. ప్రస్తుతం తాను ఉన్న స్థితి చూసి అన్నీ విజయాలే దక్కాయని మీరు అనుకోవచ్చని.. అయితే తాను కూడా రెండు పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యానని వెల్లడించారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదురయ్యే అపజయాలు విజయానికి మెట్లుగా నిలుస్తాయన్నారు. అపజయాలను విద్యార్థులు సోపానంగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. తాను కూడా రాకెట్లు, ఉపగ్రహాలు తయారు చేసేటప్పుడు తప్పులు చేశానన్నారు. ఆ తర్వాత వాటి గురించి నిజాయతీగా ఆలోచించి విజయం సాధించేందుకు కృషి చేశానన్నారు.

Tags:    

Similar News