ఒకే ఫ్రేమ్ లో బాబు పవన్ జగన్ లను చూడొచ్చా ?

దీంతో ఈసారి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒకే ఫ్రేమ్ లో కనిపించే అవకాశం ఉంది.

Update: 2024-07-18 02:45 GMT

వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి వస్తారా రారా అంటే దాని మీద ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని ఒక క్లారిటీ ఇచ్చారు. జగన్ అసెంబ్లీకి తప్పకుండా హాజరవుతారని ఆయన మీడియాకు చెప్పారు. జగన్ కి విపక్ష నేత హోదా ఇవ్వకపోయినా ఒక ఎమ్మెల్యే హోదాలో ఆయన సభకు హాజరవుతారని చెప్పారు.

అంతే కాదు మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు సభకు వెళ్తారు అని చెప్పారు. దీంతో ఈసారి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒకే ఫ్రేమ్ లో కనిపించే అవకాశం ఉంది.

ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ ఈ నెల 22 నాటికి తాడేపల్లికి చేరుకుంటారని ఆయన బడ్జెట్ సెషన్ కి హాజరవుతారని అంటున్నారు. గత నెలన్నరగా ప్రభుత్వం ఏమి చేసింది అన్న దాని మీద ఆయన విపక్ష నేతగా సభలో విమర్శలు చేస్తారు అని అంటున్నారు.

వైసీపీ మీద దాడులతో పాటు రాష్ట్రంలో శాంతిభద్రతల మీద కూడా జగన్ ప్రశ్నిస్తారు అని అంటున్నారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను ఎపుడు నెరవేరుస్తుందని కూడా జగన్ నిలదీస్తారని అంటున్నారు. తల్లికి వందనం తో పాటు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, అదే విధంగా 18 ఏళ్ళు నిండిన ప్రతీ వారికీ నెలకు అయిదు వందల రూపాయలు ఇచ్చే హామీ రైతులకు ఇరవై వేల రూపాయలను భరోసగా ఖరీఫ్ సీజన్ లో ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తారని అంటున్నారు.

అసెంబ్లీ సమావేశాలలో అధికార కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైసీపీ ఒక వ్యూహాన్ని రూపొందిస్తుందని అంటున్నారు. ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగానే అనేక అంశాల మీద ప్రశ్నించాలని వైసీపీ నిర్ణయించుకుందని అంటున్నారు. అయితే స్పీకర్ విపక్షానికి ఎంత సమయం ఇస్తారు అన్నది చూడాలి.

గతంలో అయితే ప్రతిపక్ష నేత హోదాలో జగన్ కి మైక్ అడిగితే వచ్చేది. ఆయన ఎక్కువ సేపు మాట్లాడేవారు. ఈసారి ఒక సాధారణ సభ్యుడిగా ఉన్నారు. దాంతో ఆయనకు ఎంత టైం ఇవ్వాలన్నది స్పీకర్ విచక్షణ మీదనే ఆధారపడి ఉంది. ఇక అసెంబ్లీలో ఏకైక విపక్షంగా ఉన్నందువల్ల వైసీపీకి ఎంత సమయం అయినా ఇవ్వడం సంప్రదాయం అని నిపుణులు అంటున్నారు.

మరో వైపు చూస్తే బడ్జెట్ సెషన్ లో కూటమి ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని నాలుగు నెలలకు సరిపడా ప్రవేశపెడుతుందని సమాచారం గా ఉంది. దీని మీద మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రభుత్వం ప్రవేశపెట్టలేకపోతోందని విమర్శించారు. ఇవన్నీ పక్కన పెడితే జగన్ అసెంబ్లీకి హాజరు అయితే మాత్రం సభా కార్యక్రమాలు వాడి వేడిగా సాగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

Tags:    

Similar News