కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. కొత్త చట్టాల్లోని సెక్షన్ 122, 126 (2)!
అయితే ఈ చట్టం అమలులోకి వచ్చిన రెండు రోజుల్లోనే తెలంగాణలో ఓ ఎమ్మెల్యేపై ఈ సెక్షన్స్ కింద కేసు నమోదైంది. దీంతో... ఈ విషయం ఆసక్తిగా మారింది.
జూలై 1 నుంచి దేశంలో కొత్త చట్టాలు అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో భారత న్యాయ సంహిత అమలులోకి వచ్చింది. అయితే ఈ చట్టం అమలులోకి వచ్చిన రెండు రోజుల్లోనే తెలంగాణలో ఓ ఎమ్మెల్యేపై ఈ సెక్షన్స్ కింద కేసు నమోదైంది. దీంతో... ఈ విషయం ఆసక్తిగా మారింది.
అవును... హుజూరాబాద్ బీఆరెస్స్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కరీనంగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జిల్లా పరిషత్ సమావేశంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా... భారత న్యాయ సంహిత సెక్షన్ 122, 126 (2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాళ్లోకి వెళ్తే... కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశం నుంచి తన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్తున్నారంటూ కలెక్టర్ పమేలా సత్పతిని కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. ఇందులో భాగంగా ఆమె వెళ్లే మార్గంలో నేలపై భైఠాయించి నిరసన తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలతోపాటు కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్పందించిన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే హోదాలో తాను మండల విద్యాధికారులతో తన నియోజకవర్గంలో విద్యాశాఖ ప్రగతిపై సమీక్ష నిర్వహించినందుకు... అందులో పాల్గొన్న అధికారులకు డీఈవో మెమోలు జారీ చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే బీఆరెస్స్ జెడ్పీటీసీలు అంతా సదరు డీఇవోను సస్పెండ్ చేయాలని ఫ్లకార్డులు ప్రదర్శించారు.
మరోపక్క ఈ వ్యవహారంపై కలెక్టర్ సమాధానం చెప్పాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే... కలెక్టర్ పమేలా సత్పతి ఆ సమయంలో తన కుర్చీలో నుంచి లేచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో... ఎమ్మెల్యే ఆమె ఎదుట నేలపై కూర్చున్నారు. ఈ సమయంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు!