రోజాపై అలాంటి వ్యాఖ్యలు.. చింతకాయలపై మరో కేసు!
రంగుల రాణి రోజా మేకప్ చూస్తే రాత్రులు కూడా భయమేస్తుందంటూ అంటూ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై తాజా కేసు నమోదైంది.
టీడీపీ తరఫున ప్రభుత్వంపైన, వైసీపీ నేతలపైన ఘాటు విమర్శలు, వ్యాఖ్యలు చేసేవారిలో మాజీ మంత్రి, నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఒకరు. ఇప్పటికే ఆయన పోలీసులపై, మంత్రి రోజాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో కేసులు నమోదయ్యాయి. అలాగే అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలంలో ఇంటి ప్రహరీ కట్టారని.. ఆయన ఇంటి గోడను గతంలో అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా చింతకాయల అయ్యన్నపాత్రుడును, ఆయన కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
కాగా మరోసారి చింతకాయలపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా గన్నవరంలో బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభలో ప్రసంగాలకు సంబంధించి తెలుగుదేశం నేతలపై తాజా కేసులు నమోదు అయ్యాయి.
సభా వేదిక నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఆత్కూరు పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్నలపై పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. రంగుల రాణి రోజా మేకప్ చూస్తే రాత్రులు కూడా భయమేస్తుందంటూ అంటూ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై తాజా కేసు నమోదైంది.
అలాగే ముఖ్యమంత్రిని ఆర్ధిక ఉగ్రవాది, సైకో, ధన పిశాచి, పనికిమాలినవాడు అంటూ విమర్శలు చేశారని మరో కేసు నమోదు చేశారు. అయ్యన్నపై 153a, 354a1(4), 504, 505(2), 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
గతంలో ఇంటి గోడ నిర్మాణం విషయంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారన్న అభియోగాలపై అయ్యన్నపాత్రుడిని పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతిని విమర్శిస్తూ భారతి పే అంటూ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారని గతంలో సీఐడీ ఆయనపై కేసు నమోదు చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌లో ఉంటున్న చింతకాయల విజయ్ ఇంటికి వెళ్లి సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు.
ఈ వ్యవహారంలో చింతకాయల విజయ్ కు, ఆయన తండ్రి అయ్యన్నపాత్రుడికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాగా ఇప్పుడు రోజాపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి చింతకాయల అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
మరోవైపు చింతకాయలపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. తాము ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేయని పోలీసులు వైసీపీ నేతలు ఫిర్యాదు చేస్తుంటే మాత్రం కేసులు నమోదు చేస్తున్నారని మండిపడుతున్నారు.