సీబీఐ విచారణ బాబుకూ జగన్ కూ మంచిదే !

స్కిల్ స్కాం లో సీబీఐ విచారణ జరిపించాలని తాను హై కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంలో తప్పేంటి అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు.

Update: 2023-10-15 03:55 GMT

స్కిల్ స్కాం లో సీబీఐ విచారణ జరిపించాలని తాను హై కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంలో తప్పేంటి అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. తన మీద టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా తెగ ట్రోలింగ్ చేస్తున్నారని తాను సీబీఐ విచారణ కోరడంలో నేరమేముంది అని ఆయన నిలదీశారు.

నిజం చెప్పాలీ అంటే ఈ కేసులో సీబీఐ విచారణ జరిపిస్తేనే అన్ని విషయాలూ బయటకు వస్తాయని, బాబుకూ జగన్ కి కూడా అదే మంచిదని ఆయన అంటున్నారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు డైరెక్ట్ గా ముడుపులు ముట్టినట్లుగా ఆధారాలు అయితే లేవని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. అదే టైం లో చంద్రబాబు పీఏ ఖాతాలోకి డబ్బులు వెళ్ళాయన్నది కూడా అంతే నిజం అన్నారు.

స్కిల్ స్కాం కేసు అంతా సూట్ కేసు కంపెనీలదే అని అన్నారు. అసలు వాస్తవాలు బయటకు రావాలనే తాను సీబీఐ విచారణను కోరుతున్నానని అన్నారు. ఇక చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు చర్యగానే ఉండవల్లి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఉంటున్న రాజమండ్రి జైలులో వసతులు లేవు అని చెప్పడం తప్పు అన్నారు. అక్కడ చాలా సౌకర్యవంతంగా ఉంటుందని జైలుకు వెళ్ళి వచ్చిన టీడీపీ నేతలే తనకు చెప్పారని అన్నారు.

చంద్రబాబు ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించి మంచి వైద్యం ఇప్పించాలని ఆయన కోరారు. అంతే కాదు బాబు హోదా రిత్యా ఆయన వయసు రిత్యా హౌజ్ అరెస్ట్ కూడా చేయవచ్చు అని అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ కి ఆ రకమైన సదుపాయం కల్పించారని ఆయన గుర్తు చేసారు. ఇక చంద్రబాబు కేసుని ఎందుకు కొట్టేయమంటున్నారో అర్ధం కావడం లేదు అని అన్నారు ఇది హై ప్రొఫైల్ కేసు అని దీని ధైర్యంగా కొట్టేయడానికి ఎవరికీ వీలు కాదని అన్నారు.

పైగా 17ఎ అన్నది చంద్రబాబుకు వర్తిస్తుంది అంటే జగన్ మీద కేసులే ఉండవని ఉండవల్లి కొత్త పాయింట్ చెప్పారు. క్యాబినెట్ నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించరాదని కొత్త విషయాలు చెబుతున్నారని, అదే నిజం అనుకుంటే వైఎస్సార్ మంత్రివర్గంలో తీసుకున్న డెసిషన్స్ కి జగన్ ఎలా బాధ్యుడు అవుతారని, అసలు జగన్ మీద కేసులే పెట్టకూడదని అన్నారు.

ఇదిలా ఉండగా టీడీపీతో పొత్తు ప్రకటన జనసేన అధినేత పవన్ తీసుకున్న తొందరపాటు నిర్ణయం అని ఉండవల్లి అన్నారు. తనను కనుక పవన్ అడిగి ఉంటే ఈ విషయంలో కాస్తా ఆగమని చెప్పి ఉండేవాడిని అని అన్నారు. జనసేన పొత్తు వల్ల టీడీపీకి మాత్రమే లాభం తప్ప పవన్ కి కాదని ఆయన తేల్చేశారు. మొత్తానికి ఉండవల్లి చాలా కాలానికి మీడియా ముందుకు వచ్చి సంచలన కమెంట్స్ చేసారు.

Tags:    

Similar News