అసెంబ్లీకి ఈసారి నమస్కారం పెట్టేది ఎవరు ?
సభకు నమస్కారం అంటూ బయటకు వెళ్ళిపోవడం రాజకీయంగా ఒక ట్రెండ్ గా మారింది.
సభకు నమస్కారం అంటూ బయటకు వెళ్ళిపోవడం రాజకీయంగా ఒక ట్రెండ్ గా మారింది. అదే గెలుపు గుర్రంగానూ మారుతోంది. అప్పుడెప్పుడో తమిళనాడులో జయలలిత తనను నిండు సభలో నాటి సీఎం కరుణానిధి అవమానించారు అని బాధపడి ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం సీఎం గానే సభకు వస్తాను అని ఆమె భీషణ ప్రతిజ్ఞ చేశారు. అలాగే ఆమె గెలిచి వచ్చారు.
అప్పటికి ఉమ్మడి ఏపీలో విపక్షంలో ఉన్న అన్న ఎన్టీఆర్ కూడా సరిగ్గా 1994 ఎన్నికలకు ముందు సభకు నమస్కారం అనేశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తనను అవమానిస్తోందని ఆయన ఆరోపణలు చేశారు. అందుకే తాను సీఎం గానే అసెంబ్లీకి తిరిగి వస్తాను అని సంచలన ప్రకటన చేశారు. ఆ విధంగానే ఎన్టీఆర్ 1994 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి సభకు హుందాగా రాజసంతో వచ్చారు.
ఇక సీన్ కట్ చేస్తే 2014లో విభజిత ఆంధ్ర ప్రదేశ్ కి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటే తొలి ప్రతిపక్ష నేతగా జగన్ వ్యవహరించారు. ఆయన కూడా మొదట్లో అసెంబ్లీకి వెళ్లారు. కానీ ఆ తరువాత సభలో తమను అవమానిస్తున్నారు అని అందుకే తాను ఈ సభ కంటే జనసభలోనే ఉంటాను అని సీఎం గానే అసెంబ్లీకి తిరిగి వస్తాను అని చెప్పి నమస్కారం పెట్టేశారు.
అలా 2017 నుంచి రెండేళ్ళ పాటు ఆయన పాదయాత్ర చేసి ఆ మీదట అధికారం అందుకున్నారు. ఇక 2019లో జగన్ సీఎం చంద్రబాబు విపక్ష నేత. చంద్రబాబు టీడీపీకి 23 సీట్లే వచ్చాయి. అందులో నలుగురు ఇటు నుంచి అటు వెళ్లారు దాంతో చిక్కిన సభ్యులతో సభలో మాట్లాడేందుకు దక్కని అవకాశాలాతో బాబు సభలో మధన పడ్డారు. అయితే తన కుటుంబాన్ని అధికార పార్టీ వారు కించపరచేలా మాట్లాడారు అంటూ బాబు ఆవేశంతో కూడిన ఆవేదనతో 2022లో సభకు నమస్కారం అనేశారు.
మళ్లీ ఈ కౌరవ సభను అంతం చేసి ప్రజా మద్దతుతో గెలిచి అసెంబ్లీలో ముఖ్యమంత్రిగానే అడుగుపెడతాను అని బాబు శపధం చేశారు. ఇక ఇపుడు చూస్తే కీలక ఘట్టం లోకి అంతా వచ్చింది. కౌంటింగ్ కి సరిగ్గా పది రోజులు మాత్రమే సమయం ఉంది. రాజు ఎవరో మంత్రి ఎవరో తేలే సమయం ఇది.
జూన్ 4న కౌంటింగ్ లో ఏపీకి కాబోయే సీఎం ఎవరో తేలిపోతుంది. వైసీపీ అధికారంలోకి వస్తుందా లేక టీడీపీ కూటమి పవర్ లోకి వస్తుందా అన్నది ప్రజా తీర్పు వెలువడుతుంది. ప్రజా తీర్పుని అనుసరించి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అన్నది నిర్ధారణ అవుతుంది. ఒక వేళ వైసీపీ గెలిస్తే బాబు తన శపధం ప్రకారం సభకు రారా అన్న చర్చ కూడా సాగుతోంది.
ఎందుకంటే బాబుకు దాదాపుగా ఇవి చివరి ఎన్నికలు. ఆయన అన్ని శక్తియుక్తులు పెట్టి పోరాడారు. దాంతో ఆయనకు విజయం మీద ధీమా పెరిగింది. కానీ అనుకోని ఉపద్రవం జరిగి ఫలితం తేడా కొడితే బాబు సభకు వచ్చే అవకాశాలు తక్కువగానే ఉంటాయని అంటున్నారు. ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కుమారుడు లోకేష్ కి సభా బాధ్యతలు అప్పగించి ఆయననే విపక్ష నేతను చేస్తారు అని అంటున్నారు.
ఇక అధికారంలోకి వస్తే ఆ దర్జాయే వేరు. చంద్రబాబు సీఎం గా ఉంటారు. అపుడు విపక్ష నేత పాత్రలోకి తిరిగి జగన్ రావాల్సి ఉంటుంది. ఇక అధికార పక్షంలో చంద్రబాబు పవన్ నారా లోకేష్ రఘురామ వంటి వారు చాలా మంది ఉంటారు. వైసీపీకి 67 ఎమ్మెల్యే సీట్లు 2014లో వస్తేనే సభలో మాట్లాడేందుకు చాన్స్ దక్కలేదు.
ఈసారి ఇంతకి ఇంతా బదులు తీర్చుకుంటామని ఇప్పటికే టీడీపీ అంటోంది. దాంతో ఈ సభను ఎదుర్కోవడం వైసీపీ అధినేతకూ కష్టం కావచ్చు.అందువల్ల ఆయన కూడా కేసీఆర్ తరహాలో సభకు రాకుండా పార్టీ ఉప నాయకులకు బాధ్యతలు అప్పగించి జనంలోనే తేల్చుకుంటారు అని అంటున్నారు. మొత్తానికి జగన్ అయినా బాబు అయినా ఎవరో ఒకరు ఈసారి సభలో కనిపించేది బహు తక్కువ అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.