బీజేపీ వైసీపీల మధ్య ఎంతెంత దూరం ?

దేశంలో ఇపుడు బీజేపీ హవా నడుస్తోంది. 1980 దశకం చివరి వరకూ దేశంలో రాజకీయాలు కాంగ్రెస్ ఆధిపత్యంతో నడిచేవి.

Update: 2024-11-25 03:34 GMT

దేశంలో ఇపుడు బీజేపీ హవా నడుస్తోంది. 1980 దశకం చివరి వరకూ దేశంలో రాజకీయాలు కాంగ్రెస్ ఆధిపత్యంతో నడిచేవి. కాంగ్రెస్ ని గద్దె దించడానికి కాంగ్రెసేతర పక్షాలు నాడు కూటములు ఏర్పాటు చేసేవి. అలా కాంగ్రెస్ కాంగ్రెసేతర అన్న ఒక పెద్ద విభజన గీత నాడు కనిపించేది.

ఇక 1990 దశకం తరువాత పొలిటికల్ సినేరియా మారింది. బీజేపీ బాగా విస్తరించింది. దాంతో బీజేపీని గద్దె దించేందుకు లేదా ఆ పార్టీని వ్యతిరేకించేందుకు కాంగ్రెస్ వామపక్షాలు సహా మధ్యేవాద పార్టీలు ప్రాంతీయ పార్టీలు జట్టు కట్టడం మొదలెట్టాయి. ఆ విధంగా చూస్తే మొదట యునైటెడ్ ఫ్రంట్ ఆ తరువాత యూపీయే ప్రస్తుతం ఇండియా కూటమి ఏర్పడ్డాయి.

అయితే ఎన్డీయే ఇండియా కూటములలో లేని పార్టీలు కూడా కొన్ని ఉన్నాయి. దేశంలో ఆ పార్టీలు ఇపుడు పూర్తిగా తటస్థ వైఖరిని అవలంబిస్తున్నాయి. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. తెలంగాణాలో చూస్తే బీఆర్ఎస్ కి తమ సొంత స్టేట్ లో కాంగ్రెస్ ప్రధాన శత్రువు. ఆ పార్టీతోనే పోరాటం చేయాలి.

దాంతో బీఆర్ ఎస్ ఎన్డీయే కూటమిలో చేరవచ్చు. కానీ బీజేపీ కూడా తెలంగాణాలో బలం పెంచుకుంటోంది. రేపటి రోజున కాంగ్రెస్ ని గద్దె దించి తాను అధికారంలోకి రావాలని చూస్తోంది. దాంతో బీఆర్ఎస్ బీజేపీని కూడా దూరం పెడుతోంది. అలా రెండు జాతీయ పార్టీలకు ఎడం పాటిస్తూ తనదైన తటస్థ వైఖరి కొనసాగిస్తోంది.

ఇక ఒడిషాలో చూస్తే బిజూ జనతాదళ్ ఉంది. ఆ పార్టీ మొదట్లో బీజేపీతోనే పొత్తు పెట్టుకుని రాజకీయాలు చేసింది. ఆ తరువాత సొంతంగా ఎదిగింది. బీజేపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ ని అక్కడ రాజకీయ తెరపైన లేకుండా చేసింది. ఇపుడు చూస్తే బీజేపీ ఏకు మేకై విస్తరించి ఏకంగా అధికారం అందుకుంది.

దాంతో బీజేడీ కాంగ్రెస్ ఇపుడు ప్రతిపక్షంలో ఒంటరి పోరాటం చేస్తోంది. రేపటి రోజున కాంగ్రెస్ తో కలసి పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కానీ దేశంలో ఇండియా కూటమి గ్రాఫ్ ని చూసి మాత్రమే ఈ డెసిషన్ తీసుకుంటారు అంటున్నారు. ఇపుడు దేశంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి బలోపేతమవుతోంది. దాంతో బీజేడీ ఏమి చేస్తుంది అన్నది చర్చగా ఉంది.

ఏపీ విషయానికి వస్తే వైసీపీ విపక్షంలో ఉంది. ఎన్డీయే కూటమిలో టీడీపీ జనసేన ఉన్నాయి. ఆ కూటమిలో చాన్స్ అన్నది లేదు. అయితే వైసీపీ కూడా వేచి చూసే వైఖరినే అవలంబిస్తోంది అని అంటున్నారు. ఇటీవల కాలంలో ఇండియా కూటమిలో వైసీపీ చేరుతుంది అన్న ప్రచారం విపరీతంగా సాగింది. కానీ వైసీపీ అధినాయకత్వం తెలివిగానే అన్ని ఆప్షన్లను ఉంచుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇక 2014 సమయంలో ముందుగా వైసీపీకే బీజేపీ పొత్తు ఆఫర్ ఇచ్చినట్లుగా అప్పట్లో ప్రచారం సాగింది. ఆ పార్టీ సొంతంగా సోలోగా అనడంతోనే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు అని కూడా చెప్పుకున్నారు. ఇది ఎంత వరకూ నిజమో తెలియదు అని అంటున్నారు. ఇక 2019 నుంచి 2024 మధ్యలో ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. ఆ సమయంలో ఎన్డీయేలో చేరమని కేంద్ర మంత్రి పదవులు ఇస్తామని డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా ఇస్తామని ఆఫర్లు ఢిల్లీ పెద్దల నుంచి వచ్చాయని ప్రచారం జరిగింది.

ఆఖరుకు బీజేపీ పెద్దలు టీడీపీతో పొత్తు కంటే ముందు జగన్ చివరి సారిగా కేంద్ర పెద్దలను కలసినపుడు కూడా పొత్తు ప్రతిపాదనలు చేసారు అని ప్రచారం అయితే ఒక పుకారుగా సాగింది. అయితే టీడీపీ కూటమిలో బీజేపీ చేరింది. ఇక వైసీపీ విషయానికి వస్తే 2019 నుంచి 2024 వరకూ బీజెపీకి అవుట్ రేట్ గా మద్దతు ఇచ్చినా అదంతా పరోక్షంగానే అని అంటున్నారు. ఎన్నికల్లో బీజేపీతో కలసి పొత్తు పెట్టుకుంటే మైనారిటీల ఓట్లకు గండి పడుతుందని ఆలోచిని ఈ విధంగా బీజేపీతో పొత్తు ప్రతిపాదనలు గురించి ఆలోచించలేదని కూడా ప్రచారం సాగింది.

అయితే ఆరేడు నెలల క్రితం ఏపీలో జరిగిన ఎన్నికల్లో మొత్తం మైనారిటీ వర్గాలు టీడీపీ కూటమికే ఓట్లు వేశారు. వైసీపీకి ఆ విధంగా దెబ్బ పడింది. రెండిందాల నష్టం జరిగింది. దాంతో ఇపుడు చూస్తే మహారాష్ట్రలో కూడా ముస్లిం నియోజకవర్గాలు ఉన్న చోట పెద్ద ఎత్తున ఎన్డీయే కూటమి అభ్యర్ధులు గెలిచారు.

దాంతో బీజేపీతో పొత్తు కూడితే నష్టం రాజకీయంగా ఏమీ ఉండకపోగా మరింత కొత్త బలం సమకూరుతుందని అంటున్నారు. టీడీపీ విషయమే తీసుకుంటే ఇప్పటికి మూడు సార్లు ఆ పార్టీ ఈ పొత్తులతోనే గెలిచింది. మరి టీడీపీకి లేని మైనారిటీల భయం వైసీపీకు ఎందుకు అన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా రానున్న రోజూల్లో బీజేపీకి తటస్థ పార్టీల నుంచి కూడా ఆకర్షణ మంత్రం పనిచేయవచ్చు అని అంటున్నారు. బీజేపీతో గ్యాప్ ఇపుడు మెయిన్ టెయిన్ చేయడానికి చాలా పార్టీలు సిద్ధంగా లేవు అని అంటున్నారు. వైసీపీ విషయానికి వస్తే బీజేపీకి ఎంతెంత దూరం అంటే జవాబు కాలమే చెప్పాలని అంటున్నారు.

Tags:    

Similar News