బాబు హామీల క్యాలెండర్ రెడీ...వైసీపీకి నో చాన్స్ !

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల మీద దృష్టి పెట్టారు. అధికారంలోకి వచ్చి నెల రోజులు అయింది.

Update: 2024-07-12 03:49 GMT

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల మీద దృష్టి పెట్టారు. అధికారంలోకి వచ్చి నెల రోజులు అయింది. దాంతో హామీల గురించి ప్రజలలో చర్చ బయల్దేరకముందే వాటికి ఒక్కోటీ పట్టాలెక్కించాలన్నది బాబు ఆలోచనగా ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినపుడు వరసగా కొన్నింటి మీద సంతకాలు చేశారు. అందులో సామాజిక పెన్షన్లు నాలుగు వేల రూపాయలు పెంపు ఒకటి అలాగే పాత ఎరియర్స్ తో కలిపి ఒకేసారి ఏడు వేలు చెల్లించడం ఒక్కటి.

దానిని జూలై నెలలో చంద్రబాబు సాకారం చేశారు. ఆ విధంగా తన ఎన్నికల హామీలలో ప్రధానమైన దాన్ని నిలబెట్టుకున్నారు. అలా 66 లక్షల మంది సామాజిక పెన్షన్ దారులకు అండగా నిలిచి విశ్వాసం పొందారు. ఇక ఇపుడు కొత్తగా విద్యా సంవత్సరం ప్రారంభం అయింది కాబట్టి తల్లికి వందనం కార్యక్రమాన్ని బాబు అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు.

దీనికి సంబంధించిన విధి విధానాలు రిలీజ్ చేశారు. అయితే తల్లికి 15 వేల రూపాయలు ఇస్తామని చెప్పడం మీద వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తల్లికి కాదని విద్యార్థులు ఎంత మంది ఆ తల్లికి ఉంటే వారందరికీ పధకం వర్తింపచేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.

మొత్తానికి ఈ పధకం కూడా అమలుకు టీడీపీ ప్రభుత్వం సిద్ధంగానే ఉంది అని తెలుస్తోంది. బహుశా పూర్తి వివరాలతో జీవో ఇష్యూ చేసి దసరా కంటే ముందో వెనకో తల్లుల ఖాతాలో నగదు వేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అంటున్నారు.

అదే విధంగా సీఎం గా చంద్రబాబు పెట్టిన మరో సంతకం ఏపీలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం. దానికి ఆగస్టు 15వ తేదీని ముహూర్తంగా పెట్టుకున్నారు అంటే ఇప్పటికి కచ్చితంగా నెల రోజులు ఉంది అన్న మాట. ఏపీ వ్యాప్తంగా 200కి పైగా క్యాంటీన్లని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. దీని మీద ఈ నెల 16న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు.

ఇక అదే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని కూడా నెరవేర్చాలని బాబు సర్కార్ ఆలోచన చేస్తోంది అని అంటున్నారు. దానికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే సాగుతోంది. ఈ విషయం మీద కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చింది ఒక ముహూర్తాన్ని ప్రకటిస్తారు అని అంటున్నారు. ప్రచారంలో ఉన్న మాట అయితే ఆగస్టు 15 నుంచే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం అని అంటున్నారు.

ఇదిలా ఉంటే రైతన్నలకు రైతు భరోసా మొత్తాన్ని ఇరవై వేలకు పెంచుతామని టీడీపీ హామీ ఇచ్చింది. ఇపుడు ఆ హామీ కూడా ఉంది. ఎందుకంటే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. రైతులు వ్యవసాయ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఇరవై వేలను ఒకసారి కాకుండా నాలుగు విడతలుగా చేసి ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు కూడా చేస్తున్నారు అని అంటున్నారు. గతంలో జగన్ సర్కార్ కూడా రెండు విడతలుగా ఈ మొత్తాన్ని అందించేది.

సో ఈ హామీ కూడా కొద్ది రోజులలో పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా 18 ఏళ్ళు నిండిన ప్రతీ మహిళకు నెలకు 1500 రూపాయలు అన్న దాని మీద పూర్తి అధ్యయనం చేసి ఆ మీదట ఆ పధకాన్ని అమలు చేస్తారు అని అంటున్నారు. ఇక ప్రతీ పేద ఇంటికీ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించే పధకాన్ని ఈ దసరా నుంచి అమలు చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు.

దసరా పెద్ద పండుగ కాబట్టి ఆ రోజు నాటికి వంట గ్యాస్ ఉచితంగా ఇంటికి ఇస్తే మహిళా లోకమంతా హర్షిస్తుందని ఆ విధంగా మాట నిలబెట్టుకున్నట్లుగా అవుతుందని కూటమి పెద్దలు భావిస్తున్నారుట. ఉచిత గ్యాస్ సిలెండర్లను కూడ ప్రతీ నాలుగు నెలలకు ఒకటి వంతున ఇస్తే ఏడాదిలో మూడుఇచ్చినట్లు అవుతుందని భారం కూడా పెద్దగా ఒకేసారి పడదని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

మొత్తం మీద తొలి ఏడాదిలోనే తాను ఇచ్చిన హామీలు అన్నీ పట్టాలెక్కించడం ద్వారా లబ్దిదారులందరి మదిలో మంచి స్థానం సంపాదించాలని బాబు చూస్తున్నారు అని అంటున్నారు. వైసీపీకి ఏ ఒక్క చాన్స్ ఇవ్వకూడదన్న పట్టుదల కూడా ఇందులో ఉందని అంటున్నారు.

Tags:    

Similar News