చంద్రబాబుకు మళ్లీ చుక్కెదురు.. హైకోర్టులో పరిస్థితి ఇది!

దీన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీధర్.. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ అక్రమం అంటూ లంచ్ మోషన్ పిటీషన్‌ ను దాఖలు చేశారు.

Update: 2023-10-10 09:09 GMT

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో గత మాసం రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉంటున్నారు.

మరోపక్క బాబును ఎలాగైనా బయటకు తీసుకురావాలని ఆయన తరుపు న్యాయవాదులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా... ఇప్పటికే దాఖలు చేసిన ఏపీ ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్కాం, అంగళ్లు అల్లర్ల కేసులకు సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఏసీబీ కోర్టులో బాబు బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది.

దీన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీధర్.. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ అక్రమం అంటూ లంచ్ మోషన్ పిటీషన్‌ ను దాఖలు చేశారు. 17ఏ అంశాన్ని కూడా ఆయన ఈ పిటిషన్ లో పొందుపరిచారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం సరికాదని పిటీషన్‌ లో పేర్కొన్నారు.

తాజాగా ఈ లంచ్ మోషన్ పిటీషన్‌ పై కూడా చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ పిటీషన్‌ పై విచారణ చేపట్టడానికి ఏపీ హైకోర్టు నిరాకరించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు విచారణ దశలో ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

మరోపక్క చంద్రబాబు క్వాష్ పిటిషన్ పైనా సుప్రీంకోర్టులో మంగళవారం వాడీ వేడీ వాదనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మెజారిటి సమయం చంద్రబాబు లాయర్ సాల్వే తీసుకున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సీఐడీ తరుపు న్యాయవాది వాదనలను శుక్రవారం.. లేదా, సోమవారం వినే అవకాశం ఉందని.. ప్రస్తుతానికి వాయిదా వేయొచ్చని తెలుస్తుంది.

ఇదే సమయంలో అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో నారా లోకేష్ నేడు సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకూ విచారణ జరగనుంది. మరోపక్క ఈ రోజు మధాహ్నం మూడు గంటలకు భువనేశ్వరి, బ్రాహ్మణి.. చంద్రబాబుని రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలవనున్నారు. వీరితోపాటు పయ్యావుల కేశవ్ కూడా ఉంటారని తెలుస్తుంది.

Tags:    

Similar News