హాట్‌ టాపిక్‌.. జైళ్ల శాఖ డీఐజీకి టీడీపీ నేతల వినతిపత్రం!

ఈ నేపథ్యంలో చంద్రబాబు న్యాయవాదులు ఆయనను కలవడానికి ఇచ్చే ములాఖత్‌ ల సంఖ్యను తగ్గిస్తూ జైళ్ల శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Update: 2023-10-17 16:52 GMT

స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇన్నర్‌ రింగు రోడ్‌ ఎలైన్మెంట్, ఏపీ పైబర్‌ నెట్‌ తదితర కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ కోసం ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయా పిటిషన్లపై విచారణ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు న్యాయవాదులు ఆయనను కలవడానికి ఇచ్చే ములాఖత్‌ ల సంఖ్యను తగ్గిస్తూ జైళ్ల శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ములాఖత్‌ ల కారణంగా సాధారణ ఖైదీలకు ఇబ్బంది ఎదురవుతుందంటూ రోజుకు ఇవ్వాల్సిన రెండు లీగల్‌ ములాఖత్‌ లను ఒకటికి తగ్గించారు.

పరిపాలనా కారణాలతో ఇకపై రెండో ములాఖత్‌ రద్దు చేసినట్లు జైలు అధికారులు వెల్లడించారు. దీనిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు వారాలుగా లేని భద్రతాపరమైన ఇబ్బంది.. ఇప్పుడే ఎందుకు వచ్చిందని నిలదీశారు. కుట్రలో భాగంగానే లీగల్‌ ములాఖత్‌ లు కుదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులపై లాయర్లతో సంప్రదింపులు అత్యంత కీలకమని కుటుంబసభ్యులు భావిస్తున్న ఈ సమయంలో ములాఖత్‌ పై ఆంక్షలు విధించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో జైళ్ల శాఖ డీఐజీకి టీడీపీ నేతలు వినతిపత్రం అందజేశారు. రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబుకు లీగల్‌ ములాఖత్‌ లు తగ్గించడంపై డీఐజీ రవికిరణ్‌ తో టీడీపీ నేతలు చర్చించారు.

చంద్రబాబుపై మూడు న్యాయస్థానాల్లో వివిధ కేసులు కొనసాగుతున్నాయనీ.. ఈ నేపథ్యంలో ఆయన తన న్యాయవాదులతో మాట్లాడాల్సి ఉందన్నారు. ఇలాంటి సమయంలో లీగల్‌ ములాఖత్‌ లు ఎలా తగ్గిస్తారని నిలదీశారు. రోజుకు రెండుసార్లు లీగల్‌ ములాఖత్‌ లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ నేతలు లేవనెత్తిన అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని డీఐజీ వారికి హామీ ఇచ్చారు.

Tags:    

Similar News