'భారత్' వాడేస్తున్న కేంద్రం... ఒంటెద్దు పోకడలు నేర్పిన పాఠాలెన్నో!

ఇందులో భాగంగా... "ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్" పేరుతో ప్రధాని మోడీని సంబోధిస్తూ పలు పత్రాల్లో కేంద్రం భారత్ పేరును వాడటం మొదలుపెట్టింది

Update: 2023-09-06 09:11 GMT

ఇప్పుడు దేశమంతా ఇండియా పేరును భారత్‌ గా మారుస్తున్నారనే చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే మోడీ సర్కారు ఈ మేరకు పార్లమెంటులో బిల్లు పెట్టబోతోందనే డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటిక్ "భారత్" - "ఇండియా" అంశంపై రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో వాదోపవాదాలు చేస్తున్నారు. ఈ సమయంలో మోడీ సర్కార్ ఒక అడుగు ముందుకు వేసింది.

నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని సైతం ఆహ్వానించకుండా ఒంటెద్దు పోకడలకు పోతున్నారనే పేరు పుష్కలంగా సంపాదించుకున్న మోడీ... మరోమారు అలాంటి పనికి పూనుకున్నారు. ఇందులో భాగంగా జీ20 దేశాల సదస్సుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలపై "భారత్" పేరును వాడేస్తున్నారు.

అవును... ఢిల్లీ వేదికగా త్వరలో జరిగే జీ20 సదస్సుకు విదేశీ అతిధులకు ఆహ్వానాలు పంపింది కేంద్రం. అయితే ఈ ఆహ్వానాల్లో "భారత్" పేరుతో కేంద్రం ఆహ్వానాలు పంపింది. దీంతో దేశవ్యాప్తంగా చర్చోపచర్చలు సాగుతున్న వేళ కేంద్రం ఇలా భారత్ పేరును వాడేస్తుందన్న విషయం తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా... "ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్" పేరుతో ప్రధాని మోడీని సంబోధిస్తూ పలు పత్రాల్లో కేంద్రం భారత్ పేరును వాడటం మొదలుపెట్టింది. ఇదే క్రమంలో తాజాగా జరిగిన బ్రిక్స్ అంతర్జాతీయ సదస్సు ఆహ్వానాల్లోనూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ పేరును కేంద్రం ఉపయోగించింది.

దీంతో... ఇప్పటికే మోడీ ఒంటెద్దు పోకడలకు పోతున్నారని.. ఇలా ఒంటెద్దు పోకడలకు పోయిన వారి పతనం చరిత్రలో స్పష్టంగా కనిపిస్తుందని గుర్తుచేస్తున్నారు నెటిజన్లు! ఇలా కేంద్రం ఇండియాకు బదులుగా విచ్చలవిడిగా భారత్ పేరును వాడేయడంపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. ఇందులో భాగంగా ఆ పార్టీ ఎంపీ జైరాం రమేష్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.

విపక్షం అంతా ఒక్కతాటిపైకి రావడం, వారి కూటమికి ఇండియా పేరు పెట్టుకోవడంతో మోడీ సర్కార్ ఎంత గందరగోళంలో ఉందో అర్ధమవుతోందని జైరాం రమేష్ ఎద్దేవా చేశారు.

అయితే భారత్ పేరును ఇలా ఉపయోగించడంపై విశ్లేషకులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇండియా లేదా భారత్ పేరు అమలు చేసే అధికారం మాత్రం కేంద్రానికి ఉంటుంది కానీ... పార్లమెంటుకు సైతం చెప్పకుండా, దేశ ప్రజలకు తెలియకుండా వాడటం సరైన చర్య కాదని అంటున్నారు. ఇది ఒంటెద్దు పోకడలకు నిదర్శనమని చెబుతున్నారు.

దీంతో... భారతదేశాన్ని మదర్ ఆఫ్ డెమోక్రసీగా చెప్పే మోడీ తాను తీసుకునే నిర్ణయాలు మాత్రం మదర్ ఆఫ్ ఒంటెద్దు పోకడ గా ఉంటాయనేదానికి ఇది మరో తాజా ఉదాహరణ అని అంటున్నారు పరిశీలకులు.

కాగా... రాజ్యాంగం తొలి ముసాయిదాను డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1948 నవంబర్ 4న తొలి సారి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ డ్రాఫ్ట్ లో "భారత్" అనే పదమే లేదు. బీఆర్ అంబేద్కర్ దేశాన్ని ఇండియాగానే సంబోధిస్తూ రాజ్యాంగ ముసాయిదాను పూర్తి చేశారు. అనంతరం 1949 సెప్టెంబర్ 18న అంబేద్కర్ ఆర్టికల్ 1కు సంబంధించిన సవరణను ప్రతిపాదించిన తర్వాతే "భారత్" అనే పేరు రాజ్యాంగంలోకి వచ్చి చేరింది.

Tags:    

Similar News