గిరిజన వర్శిటీ : శ్రీకారం చుట్టారు...నిధులు ఎపుడిస్తారు...?
కేంద్ర ప్రభుత్వం ప్రతీ బడ్జెట్ లో గిరిజన వర్శిటీకి విదిలించేది పాతిక ముప్పయి కోట్లు కంటే ఎక్కువ ఉండడంలేదు అని విమర్శలు ఉన్నాయి
విభజన చట్టం ప్రకారం ఏపీకి కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాయలం మంజూరు అయింది. అయితే దానికి సంబంధించి భవనాల నిర్మాణానికి 2014 నుంచి ఇప్పటికి తొమ్మిదేళ్ల కాలం పట్టింది. మొదట ఎస్ కోట ప్రాంతంలోని రెల్లి గ్రామంలో నాటి టీడీపీ ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయానికి స్థలాన్ని ఎంపిక చేసింది. అక్కడే వర్శిటీ వస్తుందని అనుకున్నారు.
అయితే ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం సాలూరు నియోజకవర్గాన్ని ఎంపిక చేసింది. అక్కడ భూములను సేకరించి శంకుస్థాపన చేయడానికి ఈ సమయం పట్టింది. ఇక గిరిజన వర్శిటీని 570 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఇందులో అత్యధిక భాగం ప్రభుత్వ భూములు ఉండడం మంచి పరిణామం.
ఇరవై నుంచి పాతిక శాతం మాత్రమే రైతుల నుంచి సేకరించిన భూములు. దానికి గానూ నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంది. ఇక భూములకు నష్టపరిహారం గిరిజన వర్సిటీ నిర్మాణానికి కలుపుకుని దాదాపుగా రెండు వేల కోట్లు నిధులు అవసరం అవుతాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రతీ బడ్జెట్ లో గిరిజన వర్శిటీకి విదిలించేది పాతిక ముప్పయి కోట్లు కంటే ఎక్కువ ఉండడంలేదు అని విమర్శలు ఉన్నాయి. ఈ నిధులతో సిబ్బంది జీతాలకే సరిపోతోంది అని అంటున్నారు. 2019 నుంచి ఏయూకి సంబంధించిన భవనాలలో గిరిజన వర్శిటీ పనిచేస్తోంది.
అలా సిబ్బంది జీతభత్యాలకు మాత్రమే కేంద్ర నిధులు బడ్జెట్ రూపంలో వస్తున్నాయి. వందల వేల కోట్ల రూపాయతో గిరిజన వర్శిటీ పూర్తి చేయాలంటే కచ్చితంగా బడ్జెట్ లో కేంద్రం నిధులు భారీ ఎత్తున విడుదల చేయాల్సి ఉంది.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అయితే కేంద్రం రెండు వేల కోట్లతో రిగిజన వర్శిటీని నిర్మిస్తోందని చెప్పారు. మంచిదే కానీ ఇప్పటిదాకా కేంద్రం బడ్జెట్ లో ఇచ్చిన నిధులు అన్నీ కలుపుకున్న వంద కోట్లకు మించవు కదా అని అంటున్నారు.
ఇలా అయితే గిరిజన వర్శిటీ ఎప్పటికి పూర్తి అయ్యేను అన్న చర్చ కూడా ఉంది. కేంద్రం విభజన చట్టం ప్రకారం ఏపీలో విద్యా సంస్థలను అయితే మంజూరు చేసింది. వాటికి భూములను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. అయితే భవనాల నిర్మాణం మాత్రం నత్తనడకనే సాగుతోంది. దానికి కారణం నిధుల విడుదలలో జాప్యమే అని అంటున్నారు.
బడ్జెట్ లో నిధులు కేటాయిస్తేనే విభజన హామీలు నెరవేర్చినట్లు అని అంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర సాయం తమకు అవసరం అని అదే సభలో చెప్పారు. ఇదిలా ఉంటే ఎన్నికల కోసం తప్పించి ఇపుడు ఈ శంకుస్థాపన వల్ల ఉపయోగం ఏముంది అని టీడీపీ సహా విపక్షాలు విమర్శిస్తున్నాయి. వందల కోట్ల బడ్జెట్ తో గిరిజన వర్శిటీ ఉందని, కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. ఆ విధంగా వైసీపీ ప్రభుత్వం వత్తిడి చేయాలని కోరుతున్నారు. లేకపోతే ఇవి ఎన్నికల ముందు వెసిన శిలాఫలకాలుగానే మిగిలిపోతాయని అంటున్నారు.