చాగంటికి కీలక పదవి!
తాజాగా ఆయన పేరు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవికి వినిపిస్తోంది.
ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు గురించి తెలియనివారు లేరు. ఉదయాన్నే ఆయన ప్రవచనాలను లక్షల సంఖ్యలో వింటుంటారు. తాజాగా ఆయన పేరు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవికి వినిపిస్తోంది. ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు చాగంటి కోటేశ్వరరావు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మ ప్రచార పరిషత్ సలహాదారుగా నియమితులైన సంగతి తెలిసిందే. నాడు చాగంటి కుటుంబ సమేతంగా తాడేపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లి అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు కూడా తెలిపారు.
అయితే.. ధర్మప్రచార పరిషత్ సలహాదారుగా నియమితులైన నెల రోజులకే చాగంటి ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఇందుకు ఆయన ఏ కారణాలను వెల్లడించలేదు. టీటీడీకి సలహాలు ఇవ్వడానికి పదవులు అవసరం లేదని అప్పట్లో ఆయన ప్రకటించారు. తిరుమల వేంకటేశ్వరుడే తన ఊపిరని, ఆయన సేవ చేసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు. ఇందుకు పదవులు ఏమీ అక్కర్లేదని చెప్పారు. టీటీడీకి తన అవసరం ఎప్పుడొచ్చినా పరుగెత్తుకుంటూ వెళ్లి ముందుంటానని చెప్పి సలహాదారు పదవిని చాగంటి తిరస్కరించారు. టీటీడీకి తన సలహాలు అవసరమైతే పదవి లేకపోయినా తప్పకుండా ఇస్తాను అని చాగంటి తెలిపారు.
కాగా చాగంటి సలహాదారు పదవిని తిరస్కరించడం వెనుక రెండు కారణాలు ఉన్నాయని అప్పట్లో గాసిప్స్ వినిపించాయి. నాడు ఏపీ హైకోర్టు ప్రభుత్వ సలహాదారులపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సలహాదారుల నియామకం, అర్హతలు, వారికి చట్టబద్ధత, జీతాలు ఇలా అనేక అంశాలపై ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించింది. అంతేకాకుండా సలహాదారుల ద్వారా ప్రభుత్వ సున్నిత సమాచారం కూడా బయటకు వెళ్లే ప్రమాదం ఉందంటూ వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా సలహాదారుల రాజ్యాంగబద్ధతను తేలుస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సలహాదారుల వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో చాగంటి తన సలహాదారు పదవికి రాజీనామా చేశారని టాక్ నడిచింది.
ఈ క్రమంలో ప్రస్తుతం లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు కలిశాయనే ఆరోపణలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న వేళ చాగంటి కోటేశ్వరరావును టీటీడీ చైర్మన్ గా నియమించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని టాక్ నడుస్తోంది. రాజకీయ నేతలను టీటీడీ చైర్మన్ గా నియమిస్తే ఇంకా వివాదాలు రేగడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్టు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రవచనకారుడిగా సర్వత్రా గుర్తింపు తెచ్చుకున్న చాగంటి కోటేశ్వరరావులాంటి ఆధ్యాత్మికవేత్తను టీటీడీ చైర్మన్ గా నియమించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది నిజమా, అబద్ధమో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇటీవల కాలం వరకు భూమన కరుణాకరరెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది.