చాగంటి పాఠాలు...ఏపీకి సరికొత్త బాటలు
ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారుడిగా ఆయనకు పెద్ద బాధ్యతలనే అప్పగించింది. చాగంటి తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ప్రముఖ ప్రవచనకారుడు చాగంటి కోటేశ్వరరావు పేరు వినని వారు ఉండదు. ఆయన చక్కని తెలుగు భాషలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతారు. ఆయన చెప్పే ప్రవచనాలు పండిత పామరులను సరిసమానంగా అలరిస్తాయి. ఆయన బోధనలు మనసుకు ప్రశాంతత చేకూరుస్తాయి.
అటువంటి చాగంటి వారిని ఏరి కోరి మరీ ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసి కీలకమైన బాధ్యతలను అప్పగించింది. ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారుడిగా ఆయనకు పెద్ద బాధ్యతలనే అప్పగించింది. చాగంటి తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి ఆయనలు పలు సూచనలు చేశారు. అలాగే చాగంటి తనకు అప్పగించిన బాధ్యతల విషయంలో ఏమి చేయాలనుకుంటున్నదీ ముఖ్యమంత్రికి వివరించారు. వర్తమాన సమాజంలో నైతిక విలువల పతనం అన్నది అతి పెద్ద సామాజిక సంక్షోభంగా మారుతోంది.
పెద్దలు ముందు తరాలు తాము పుణికి పుచ్చుకున్న మంచి విషయాలను ఈ తరానికి నేర్ప లేనంత బిజీగా ఉన్నారు. అలాగే ఈనాటి తరం వారి మీద శ్రద్ధ చూపించలేనంత అనాసక్తతతో ఉన్నారు. దాంతో చాగంటి వంటి ప్రముఖుడిని ఈ తరానికి అనుసంధానం చేయడం ద్వారా వారిలో నైతిక నిష్టను పెంపొందించడంతో పాటు ఉత్తమ లక్షణాలను అలవరచుకునేలా తీర్చిదిద్దాలనుకోవడం ఏపీ ప్రభుత్వం చేస్తున్న మంచి ఆలోచన.
నిజానికి ఈ దేశంలో ఎక్కడా లేని విధానం ఇది. ప్రభుత్వ సలహాదారులు ఎంతో మంది ఎన్నో చోట్ల ఉన్నారు వారు ఆర్ధిక విషయాలు రాజకీయ విషయాలు ఇతర అంశాలలో సలహాలు ఇచేవారు తప్ప నైతిక విలువల విషయంలో సలహాదారులు అన్న పదవి లేదు, అసలు ఆ ఆలోచన లేదు.
ఆ విధంగా మంచి ఆలోచన చేసిన ఏపీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా అంతా అభినందించాలి. భవిష్యత్తు తరం కోసం ప్రభుత్వం తీసుకున్న విలువైన నిర్ణయంగా దీనిని చూడాలి. రేపటి తరం కళాశాలలలో విద్యాలయాలలో ఉంటుంది. వారే రేపటి సమాజాన్ని తీర్చిదిద్దే వారు. వారే రేపటి దేశ నిర్మాతలు. అటువంటి వారి విషయంలో మిగిలిన దేశాలలో పెట్టే పెట్టుబడి చూపించే శ్రద్ధ భారత దేశంలో అంతగా చూపించడంలేదు అన్నది వాస్తవం.
ఈ రోజున సమాజంలో నేరాలు అశాంతి అన్నీ ఉన్నాయి. వాటికి కారణం నైతిక పతనం చెందడమే అన్నది పెద్దలు చెప్పే మాట. మరి వారికి ఆ దిశగా ఆలోచనలు కలుగచేసే ఒక యంత్రాంగం అయితే లేదు అన్నది కఠిన వాస్తవంగా ఉంది.
కఠిన చట్టాలు ఎన్ని ఉన్నా నేరాలను ఆపలేవు. అదే నైతికపరమైన బోధనతో మనిషిని తీర్చిదిద్దితే చాలు సమాజం శాంతిగా ఉంటుంది. అందుకే బాల్యం నుంచే వాటిని నేర్పించాలి. కానీ ఇపుడు ఉన్నత చదువులు విదేశీ ఉద్యోగాల విషయంలోనే ఫోకస్ పెట్టించి వాటి మీదనే చదువులు చెబుతూ పోటీ ప్రపంచంలోకి విద్యార్ధిని తీసుకుని వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నైతిక విలువలు కూడా ప్రధానం అని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం దానికి చాగంటి వారి సేవలను తీసుకోవాలని చూడడం ఒక మంచి కార్యక్రమంగా అంతా భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈనాటి తరం భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొంటున్నారు. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్ తో పాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతం అవుతుందని ఆయన తనను చాగంటి వారు కలసిన సందర్భంలో చెప్పిన మాటగా ఉంది.
విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చాగంటికి సూచించారు. నైతిక విలువలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చాగంటిని కోరారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రవచనాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో మంచిని పెంచే ప్రయత్నం చేయొచ్చని అన్నారు. ప్రపంచంలో మరే దేశానికి లేని ఉన్నతమైన సంస్కృతి, సాంప్రదాయాలు మన సొంతం అని చెబుతూనే వాటిని ఈ తరానికి, భవిష్యత్ తరాలకు అందించాలని అన్నారు.
ఇక మహిళలను గౌరవించడం, పెద్దలు, తల్లితండ్రుల మాటలకు విలువ ఇవ్వడం వంటివి యువతకు నేర్పించాలన్నారు. మారుతున్న కాలంలో అనేక అంశాలు విద్యార్థులు, యువతపై దుష్ప్రభావం చూపుతున్నాయని నైతిక విలువల పతనానికి ఇవి కారణం అవుతున్నాయని అన్నారు.
అదే విధంగా సుమతీ-వేమన శతకాలు, నీతి కథలు, మంచి మాటలు, ప్రత్యేక క్లాసుల ద్వారా విద్యార్థులు, యువతలో విలువలు పెంచేందుకు ప్రయత్నం చేస్తామని, విద్యాశాఖలో చేపట్టే కార్యక్రమాలపై ఇప్పటికే మంత్రి లోకేష్‌తో చర్చించానని చాగంటి కోటేశ్వరావు తెలిపారు. మొత్తానికి చూస్తే ఏపీ ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలలో ఇది ఒక కీలకమైనదిగా అంతా భావిస్తున్నారు.