రాజకీయ విక్రమార్కుడు ఈసారి పార్లమెంట్ కి వెళ్తారా ?

ఆయన వరసగా నాలుగోసారి ట్రై చేస్తున్నారు. అది కూడా ఒకే సీటు నుంచి పోటీ నాలుగు ఎన్నికల్లో నాలుగు పార్టీలు మారి మరీ కాకినాడ మీద గురి పెడుతున్నారు. ఆయనే చలమలశెట్టి సునీల్.

Update: 2024-04-28 03:57 GMT

ఆయనదో వెరైటీ స్టోరీ. ఎవరైనా ఒక సారి ట్రై చేస్తారు లేదా రెండు సార్లు చేస్తారు. ఆయన వరసగా నాలుగోసారి ట్రై చేస్తున్నారు. అది కూడా ఒకే సీటు నుంచి పోటీ నాలుగు ఎన్నికల్లో నాలుగు పార్టీలు మారి మరీ కాకినాడ మీద గురి పెడుతున్నారు. ఆయనే చలమలశెట్టి సునీల్.

ఆయన రాజకీయ అరంగేట్రం 2009 ప్రజారాజ్యం ద్వారా జరిగింది. ఆ ఎన్నికల్లో గెలుపు అంచులకు వచ్చినా ఓటమి పాలు అయ్యారు. 2014 నాటికి వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసినా విజయం వరించలేదు. దానికి కారణం ఆనాడు టీడీపీ వేవ్ ఉంది.

ఇక 2019లో ఆయన వైసీపీ వేవ్ ఉన్న వేళ టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఇపుడు ఆయన అధికార వైసీపీ నుంచి పోటీకి దిగారు. దీని మీద ఆయన ఒక చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను పట్టువదలని విక్రమార్కుడిని అనిపించుకోవాలని పోటీ చేయలేదని చెప్పారు.

తనను రాజకీయాలు వదలడం లేదు అన్నారు. మూడు సార్లు పోటీ చేసినా హ్యాట్రిక్ పరాజయం దక్కిందని ఇక చాలు పాలిటిక్స్ అని విరమించుకుందామని అనుకుంటే వైసీపీ పెద్దలు తనకు కాకినాడ ఎంపీ టికెట్ ఇచ్చారని ఆయన చెప్పారు. ఈసారి తన విజయం ఖాయమని ఆయన అంటున్నారు. మూడు సార్లు ఓటమి తరువాత జనంతో ఎలాగూ ఒక కనెక్షన్ ఏర్పడింది. అది ఎమోషనల్ గా మారిందని సానుభూతిగా కూడ మారే అవకాశం ఉండొచ్చని ఆయన అనుచరులు అంటున్నారు.

తనకు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో పట్టు ఉందని గెలిచి తీరుతాను అని ఆయన అంటున్నారు. అయితే ఈసారి ఆయన గెలుపునకు పీకే రూపంలో పవన్ కళ్యాణ్ ఎదురయ్యారా అన్న చర్చ నడుస్తోంది. పవన్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. టీ టైం ఉదయ్ ని ఆయన కాకినాడ నుంచి ఎంపీగా నిలబెడుతున్నారు.

పవన్ ఫ్యాక్టర్ ఎంత అన్నది కూడా ఇపుడు చర్చగా ఉంది. ఏది ఏమైనా జగన్ పధకాలు వరస ఓటముల నుంచి వచ్చిన సానుభూతి తనను గెలిపిస్తుందని చలమలశెట్టి భావిస్తున్నారు. ఈ రాజకీయ విక్రమార్కుడికి విజయం ఈసారి దక్కేనా పార్లమెంట్ కి ఆయన వెళ్తారా అన్నది చూడాలి. ఏది ఏమైనా రాజకీయాల్లో అన్నీ కలసి రావాలని అంటున్నారు.

Tags:    

Similar News