ఆ పొరపాటు.. బెయిల్‌ వచ్చినా ఏకంగా మూడేళ్లు జైళ్లోనే!

వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌ కు చెందిన చందన్‌ జీ ఠాకూర్‌ (27) ఓ హత్య కేసులో దోషి.

Update: 2023-09-27 12:30 GMT

కొందరు చేసేది చిన్న పొరపాటే అయినా దాని ఫలితం అవతలివారికి తీవ్రంగా ఉండొచ్చు. ఇప్పుడు అలాంటిదే జరిగింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక వ్యక్తికి తీరని నష్టం వాటిల్లింది. జైలు శిక్ష అనుభవిస్తున్న ఒక వ్యక్తికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఈమెయిల్‌ రూపంలో అధికారులకు పంపింది. అయితే అధికారులు ఆ మెయిల్‌ చూసుకోకపోవడంతో ఏకంగా మూడేళ్లపాటు కారాగారంలోనే ఉండిపోవాల్సి వచ్చింది.

అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు నిందితుడికి రూ.లక్ష పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఉదంతం ప్రపంచంలో మరెక్కడో కాదు.. గుజరాత్‌ లోనే వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌ కు చెందిన చందన్‌ జీ ఠాకూర్‌ (27) ఓ హత్య కేసులో దోషి. దీంతో కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. అయితే, సెప్టెంబర్‌ 29, 2020న అతడికి గుజరాత్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రీ జైలు అధికారులకు ఈ–మెయిల్‌ లో పంపింది. అయితే జైలు అధికారులు మాత్రం మెయిల్‌ లో ఉన్న కోర్టు ఉత్తర్వులను తెరచి చూడలేదు. దీంతో 2020 సెప్టెంబర్‌ 29 నుంచి ఇప్పటివరకు చందన్‌ జీ జైల్లోనే గడపాల్సి వచ్చింది. తాజాగా అతడు బెయిల్‌ కోసం మళ్లీ హైకోర్టును ఆశ్రయించడంతో అధికారుల నిర్వాకం బయటపడింది

2020లో కోవిడ్‌ బీభత్సంగా ఉండటంతో కోర్టులు తమ ఉత్తర్వులను ఈమెయిల్‌ రూపంలో పంపాయి. అయితే గుజరాత్‌ లో అధికారుల నిర్లక్ష్యం బాధితుడికి శాపంగా మారింది. అధికారుల నిర్లక్ష్యంపై గుజరాత్‌ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. బెయిల్‌ ఆర్డరు కాపీలు కోర్టు రిజిస్ట్రీ నుంచి జైలు అధికారులకు చేరినప్పటికీ అందులోని అటాచ్‌మెంట్‌ ను ఓపెన్‌ చేయకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆ ఈ–మెయిల్‌ ను జిల్లా సెషన్స్‌ కోర్టుకు పంపినప్పటికీ.. అక్కడ కూడా దాని తెరిచి చూడలేదని నిప్పులు చెరిగింది.

నిందితుడి విడుదలకు కోర్టు అవకాశం ఇచ్చినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో ఆ స్వేచ్ఛను అతడు ఆస్వాదించలేకపోయాడు అని హైకోర్టు ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. బాధితుడి దీనస్థితిని పరిగణనలోకి తీసుకొన్న ధర్మాసనం.. అధికారులు నిర్లక్ష్యం వహించినందుకు గాను అతడికి రూ.లక్ష పరిహారాన్ని అందించాలని ఆదేశించింది. ఈ మేరకు గుజరాత్‌ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

అంతేకాకుండా కోవిడ్‌ సమయంలో ఇలా మెయిల్‌ లో ఇచ్చిన ఆదేశాలన్నీ అమలయ్యాయా..? లేదా అనే విషయాన్ని తెలియజేయాలని జిల్లా లీగల్‌ సెల్‌ అథారిటీకి ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News