బాబు ఆవేదన వెనుక: ఇవి మారవు అంతే.. రాజకీయాలకే పనికొస్తాయి!
ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెండు కీలక అంశాలు సర్కారుకు ఊపిరి ఆడనివ్వడం లేదు. చంద్రబాబు కంటిపై కునుకు కూడా పట్టనివ్వడం లేదు. ఆయా అంశాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడం.. రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయోనన్న బెంగ చంద్రబాబును వేధిస్తోంది. దీంతో ఆయన నిద్రపోవాల్సిన సమయంలోనూ.. అధికారులతో భేటీ అవుతున్నారు. ఆన్ లైన్, ఆఫ్‌లైన్‌లో సమీక్షలు చేస్తున్నారు. మంత్రులను తరుము తున్నారు. పరిస్థితులు తెలుసుకుంటున్నారు. మొత్తంగా చాలా కష్టమే పడుతున్నారు.
ఏంటా విషయాలు..
1) అత్యాచారాలు: రాష్ట్రంలో కూటమి సర్కారు వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎంత అడ్డుకట్ట వేయాలని భావించినప్పటికీ.. ఎక్కడో ఒక చోట అత్యాచారాలు, మహిళలపై దాడులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అత్తా, కోడలిని బెదిరించి.. సామూహిక అత్యాచారం జరిపారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని చిలమత్తూరు మండలంలో జరిగిన ఈ సామూహిక అత్యాచార ఘటన ప్రభుత్వానికి సవాలుగా మారింది. మరోవైపు.. ఉత్తరాంధ్రలో 10 ఏళ్ల చిన్నారిపై తాత వయసున్న వ్యక్తి పదే పదే అత్యాచారం చేయడంతో ఆమె మృతి చెందింది. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉన్నాయి.
2) గంజాయి: రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని కూటమి సర్కారు చెప్పిన మరుసటి రోజే విజయవాడ పోలీసులు 300 కిలోల గంజాయిని రెండు రోజుల కిందట పట్టుకున్నారు. అదేరోజు విశాఖపట్నంలో ఏకంగా 1003 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఇక, విద్యార్థులకు గంజాయి టాబ్లెట్లను పంచుతున్నముఠాను ఏయూలో పట్టుకున్నారు. మరోవైపు మన్యంలోని గిరిజనులు సాగుచేసుకునే భూముల్లో గంజాయి పంట యథేచ్ఛగా సాగుతోంది. దీనికి కట్టడి చేసేందుకు వెళ్లే ధైర్యం కూడా అధికారులు చేయడం లేదు. ఇలా.. రెండో సమస్య కూడా సర్కారును పట్టిపీడిస్తోంది.
రాజకీయం..
గతంలో వైసీపీ హయాంలో ఈ రెండు అంశాలనే కూటమి నేతలు.. రాజకీయంగా మార్చుకున్నారు. రాష్ట్రం గంజాయి వనంగా మారిపోయిందని.. ఆంధ్రప్రదేశ్ అంటే..ఒకప్పుడు వరికి ప్రసిద్ధి అని.. కానీ, ఇప్పుడు గంజాయికి కేరాఫ్‌గా మారిందని చెప్పారు. ఎక్కడ గంజాయి పట్టుకున్నా.. దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని కూడా అన్నారు.(నిజానికి ఇటీవల రెండు రోజుల కిందట మధ్య ప్రదేశ్‌లో పట్టుకున్న 3 వేల కిలోల గంజాయి కూడా ఏపీ నుంచే వెళ్లింది). ఇక, మహిళలకు రక్షణ లేదని.. 33 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని, వేలాది మందిపై అత్యాచారాలు జరుగుతున్నాయని అప్పట్లో కూటమి నేతలు చెప్పుకొచ్చారు. తామొస్తే.. కట్టడి చేస్తామన్నారు.
అలా చేస్తే మంచిదే.. కానీ, జరగడం లేదు. ఏదేమైనా.. ఇలాంటి అంశాలు కేవలం రాజకీయాలకు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప.. నిజానికి వాటిని కట్టడి చేయడం మాత్రం చాలా కష్టమైన పని!! ఎందుకంటే.. చాలా మంది నాయకులకు గంజాయి వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయని అధికారులు కూడా చెబుతున్నారు. ఇక, సమాజంలో మార్పు రానంత వరకు మహిళలపై అఘాయిత్యాలు కూడా తగ్గే పరిస్థితి లేదు.