ఎట్టకేలకు అమరావతిలో ఇంటి స్థలం కొన్న చంద్రబాబు!
వెలగపూడి రెవెన్యూ పరిధిలోని 25 వేల చదరపు గజాల ఈ ఫ్లాట్ ఈ-6 రోడ్డుకు అనుకొని ఉంది. ఇది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతుల పేరుతో ఉన్న ఆస్తిగా చెబుతున్నారు.
ఎట్టకేలకు విమర్శల ప్రశ్నలకు చెక్ చెప్పేలా నిర్ణయం తీసుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ రాజధాని క్రియేటర్ గా.. విభజన తర్వాత ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన చంద్రబాబుకు.. తాను డిసైడ్ చేసిన రాజధానిలో సొంత ఇల్లు.. భూమి లేకపోవటాన్ని పలువురు ప్రశ్నించారు అంతేకాదు.. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ.. ఆ రాష్ట్ర రాజధాని ప్రాంతంలో సొంత ఇల్లు లేకపోవటం ఏమిటి? అన్న ప్రశ్న తరచూ చర్చకు వచ్చేది. దీనికి కౌంటర్ సమాధానం ఇవ్వలేని పరిస్థితి. దీనికి కారణం చంద్రబాబు ఇల్లు హైదరాబాద్ లో ఉండటమే.
తాజాగా ఆ లోటును తీర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు. ఇప్పటివరకు చంద్రబాబు క్రిష్ణా నది ఒడ్డున ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమనేనికి చెందిన గెస్టు హౌస్ లో ఉండటం తెలిసిందే. తాజాగా రాజధాని ప్రాంతంలో ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశారు. దీంతో.. ఇక్కడ ఇంటిని కట్టుకొని అందులోకి షిప్టు అవుతారని చెబుతున్నారు. రాజధానిలోని పలు ప్రాంతాల్లో అన్వేషించి.. చివరకు వెలగపూడి రెవెన్యూ పరిధిలోని స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా బయటకు వచ్చాయి.
వెలగపూడి రెవెన్యూ పరిధిలోని 25 వేల చదరపు గజాల ఈ ఫ్లాట్ ఈ-6 రోడ్డుకు అనుకొని ఉంది. ఇది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతుల పేరుతో ఉన్న ఆస్తిగా చెబుతున్నారు. ఇప్పటికే సదరు రైతులకు డబ్బులు చెల్లించినట్లుగా తెలుస్తోంది. ఈ భూమికి నాలుగు వైపులా రోడ్డు ఉండటం గమనార్హం. రాజధానిలో కీలకమైన సీడ్ యాక్సిస్ దారి కూడా దీని ముందు నుంచే వెళుతున్నట్లుగా చెబుతున్నారు.
చంద్రబాబు కొనుగోలు చేసినట్లుగా చెబుతున్న ప్లాట్ కు రెండు కిలోమీటర్ల దూరంలోనే గెజిటెడ్ అధికారులు.. ఎన్జీవోల నివాస సముదాయాలు.. జడ్జిల బంగ్లాలు.. తాత్కాలిక హైకోర్టు..విట్.. అమరావతి గవ్నమెంట్ కాంప్లెక్స్ తదితర కీలక భవనాలకు దగ్గర్లోనే ఉంది. దాదాపు 5 ఎకరాల్లో ఉన్న ఫ్లాట్ లో కొంత విస్తీర్ణంలో ఇంటిని కట్టుకొని.. మిగిలినే స్థలాన్ని గార్డెన్ కు.. సెక్యూరిటీ ఉండేందుకు రూంలు.. వాహనాల పార్కింగ్ కు వినియోగిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ ప్లాట్ లో మట్టి పరీక్షలు జరుపుతున్నారు. వాటిని పూర్తి చేసిన తర్వాత నిర్మాణం మొదలవుతుందని చెబుతున్నారు. ఇన్నాళ్ల తర్వాత చంద్రబాబు ఇంటి అడ్రస్ మారటం ఆసక్తికరంగా చెప్పాలి.