నా దళితులు-నా బీసీలు అంటూనే ముంచేస్తారు: జగన్‌పై చంద్రబాబు విమర్శలు
ఏపీ సీఎం చంద్రబాబు.. విపక్ష నేత, వైసీపీ నాయకుడు జగన్‌పై పరోక్షంగా విమర్శల జల్లు కురిపించారు.
ఏపీ సీఎం చంద్రబాబు.. విపక్ష నేత, వైసీపీ నాయకుడు జగన్‌పై పరోక్షంగా విమర్శల జల్లు కురిపించారు. రాజకీయ ముసుగులో నేరాలు చేసేవారితో ప్రజాస్వామ్యానికి పెను విఘాతమని వ్యాఖ్యానించారు. `కొందరు బయలు దేరారు.. నా దళితులు-నా దళితులు అంటూ రాగాలు తీశారు. నా బీసీలు అంటూ..ప్రకటనలు గుప్పించారు. వీరంతా రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులు. వారిని నమ్మితే నట్టేట ముంచేస్తారు. ఈ విషయం తెలుసుకున్నాకే కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ విషయాన్ని మనం కూడా గ్రహించాలి`` అని చంద్రబాబు పేర్కొన్నారు.
మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి శుక్రవారం సాయంత్రం చంద్రబాబు పార్టీ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పరోక్షంగా వైసీపీ పాలన, ఆ పార్టీ నాయకులపై విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లపాటు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వారు.. ఇప్పుడు నీతులు చెబుతున్నా రని దుయ్యబట్టారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా .. అదే నిజమని ప్రజలు నమ్మేలా చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వారిని బలంగా ఎదుర్కొనేందుకు నాయకులు మరింత ద్రుఢంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
తమ స్వార్థ ప్రయోజనాల కోసం కుటుంబ సభ్యులను కూడా హత్య చేయించేందుకు.. వెనుకాడని వారు ఉన్నారని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ``ఆ ఐదేళ్లు ఆటవిక రాజ్యం నడిచింది. హత్యలు, రాజకీయ విధ్వంసాలు, సామాజిక విధ్వంసాలతో రెచ్చిపోయారు. కానీ, మనది ప్రజాస్వామ్య పాలన. ఇక్కడ ఆటవికతకు చోటు లేదు. ఏదైనా ప్రజాస్వామ్య బద్ధంగా, చట్టబద్ధంగా జరగాల్సిందే. చట్ట పరంగానే పాలన నిర్దిష్టంగా ముందుకు సాగుతుంది. ఈ విషయంలో మనవైపు ఎవరూ వేలు చూపించేందుకు వీల్లేకుండా మీరు కూడా వ్యవహరించాలి`` అని చంద్రబాబు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ఎన్నికలంటే సీరియస్ ఏదీ?
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికలను టీడీపీ నాయకులు లైట్ తీసుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు గెలుపు గుర్రం ఎక్కేలా ప్రయత్నించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై చర్చించిన చంద్రబాబు.. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు ఎంపీ భరత్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు.