ఇప్పటి వరకు ఓకే.. ఇక, నుంచి బాబుకు సవాళ్ల పాలనే?!
రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి వంటి కీలక అంశాలను టార్గెట్‌గా పెట్టుకుని అడుగులు ముందుకు వేస్తోంది.
కూటమి సర్కారు వచ్చింది. నాలుగు మాసాలు అయిపోతోంది. ఇప్పటి వరకు ఫీల్ గుడ్ అన్నట్టుగానే పరిస్థితి ముందుకు సాగింది. పెద్ద - చిన్న సమస్యలు(వరదలు, విపత్తులు, దాడులు, ప్రమాదాలు) వచ్చినా వాటిని సమర్థవంతంగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎదుర్కొంది. ముందుకు సాగుతోంది. రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి వంటి కీలక అంశాలను టార్గెట్‌గా పెట్టుకుని అడుగులు ముందుకు వేస్తోంది.
అయితే.. ఇప్పటి వరకు సాగింది ఒక ఎత్తు.. అయితే, ఇప్పుడు జరగబోయే నెలలు అంత తేలిక కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన 14 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవాన్ని రంగరించి అడుగులు వేస్తే తప్ప.. పాలన సవ్యంగా సాగడం కష్టమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం.. పొంచి ఉన్న సమస్యలు, ఇప్పటికే చెలరేగుతున్న సమస్యలు వంటివి మున్ముందు మరింత పెరగనున్నాయి. వీటి నుంచి బయట పడుతూ.. పాలనను ముందుకు తీసుకువెళ్లడం.. చంద్రబాబు పెద్ద సవాలేనని అంటున్నారు.
ఏంటా సమస్యలు?
+ ప్రభుత్వం ఉద్యోగులు.. తమకు ఐఆర్ పెంపు సహా వేతన సంఘం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం దీనిపై జిల్లాల స్థాయిలో సమావేశాలు ఊపందుకున్నాయి. ఈనెల 15 డెడ్‌లైన్‌గా వారు పెట్టుకు న్నారు. అప్పటి వరకు కూడా సర్కారు స్పందించకపోతే.. ఉద్యమాల బాట పట్టేందుకు రెడీ అవుతున్నా రు. ఇది సర్కారు భారీ ఇబ్బందిగా మారనుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో వారి కోరికలు తీర్చడం కష్టమే.
+ సీపీఎస్ రద్దుపై ఈ కోటా కింద పనిచేస్తున్న 2.7 లక్షల మంది ఉద్యోగులు ఉద్యమాలకు రెడీ అవుతున్నా రు. వైసీపీ హయాంలో మూడు సంవత్సరాల పాటు వీరు ఉద్యమించిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయు లు కూడా దీనిలో ఉన్నారు. ఎన్నికల సమయంలో దీనికి సంబంధించి.. ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటామని.. పవన్ కల్యాణ్, చంద్రబాబు కూడా హామీ ఇచ్చిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు.
+ వలంటీర్లు.. వైసీపీ హయాంలో ఏర్పడిన వలంటీర్ వ్యవస్థను ప్రస్తుత కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. వీరు నాలుగు మాసాలుగా చిన్నపాటి ఉద్యమాలు చేస్తున్నారు. ఇప్పుడు వీరికి కమ్యూనిస్టులు తోడయ్యారు. దీంతో వీరు త్వరలోనే రాష్ట్ర స్థాయి ఉద్యమాలకు రెడీ అవుతున్నారు. నేడో రేపో ప్రకటన చేయనున్నారు.
+ చార్జీల పెంపు... ఈ విషయంపై ఇప్పటికే కమ్యూనిస్టులు నిప్పులు చెరుగుతున్నారు. నవంబరు నుంచి విద్యుత్ చార్జీలను పెంచారు. త్వరలోనే రిజిస్ట్రేషన్ చార్జీలను సవరించి పెంచనున్నారు. అదేవిధంగా నూనెలపై వేస్తున్న వ్యాట్‌ను రూపాయి చొప్పున పెంచడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. అలానే.. వేళ్లూనుకున్న దళారీ వ్యవస్థ చెలరేగుతున్న విషయంపైనా వారు ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు.
+ అంగన్‌వాడీ మహిళలు.. తమకు వేతనాలు పెంచాలన్న డిమాండ్ తో ఉద్యమించిన విషయం తెలిసిం దే. వైసీపీ హయాంలో వారిపై లాఠీ చార్జి కూడా చేశారు. అప్పట్లో సర్దు మణిగిన ఈ వ్యవహారం ఇప్పుడు మండల స్థాయిలో మరోసారి పుంజుకుంటోంది. నాలుగు మాసాలు వేచి చూసినా..తమను పట్టించుకోవడం లేదని కూటమి సర్కారుపై వారు ఆవేదన, ఆగ్రహంతో ఉన్నారు. ఇలా.. మరికొన్ని కీలక సమస్యలు కూడా .. చంద్రబాబు సర్కారుకు సవాల్‌గా మారనున్నాయి.