ఏపీ మెట్రో ఇష్యూలో చంద్రబాబుది అత్యాశా?

ఎందుకుంటే.. మామూలు మెట్రోకే దిక్కు లేదు అన్న వేళలో.. విశాఖ.. విజయవాడలో డబుల్ డెక్కర్ మెట్రో ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించటం..

Update: 2025-01-03 07:30 GMT

ఆశను అర్థం చేసుకోవచ్చు. అత్యాశతోనే సమస్య. అందునా.. మోడీ లాంటి మహానేతతో డీల్ చేయటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సాధ్యమా? అన్నది ప్రశ్న. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. డెవలప్ మెంట్ ప్రాజెక్టుల కోసం భారీ అంచనాలతో కేంద్రం వద్దకు వెళితే.. స్పందన ఎంతన్న విషయాన్ని గడిచిన పదేళ్లుగా చూస్తున్నదే. తాము ఏం ఇవ్వాలనుకున్నారో.. దాన్ని మాత్రమే ఇచ్చే అలవాటున్న మోడీ సర్కారుకు.. మిత్రపక్షాలు అడిగినా చేయి విదల్చని పరిస్థితి. ఈ విషయాన్ని చంద్రబాబు ఎందుకు మిస్ అవుతున్నారన్నది ప్రశ్న.

ఏపీలో విశాఖపట్నం.. విజయవాడలో మెట్రో ఏర్పాటు కోసం ఏళ్లకు ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నా.. అడుగు ముందుకు పడని పరిస్థితి. ఇలాంటి వేళ.. తాజాగా ఈ అంశం మీద రివ్యూ చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికకరంగానే కాదు.. ఆయనది అత్యాశ అన్న భావన కలిగేలా ఉన్నాయని చెప్పాలి. ఎందుకుంటే.. మామూలు మెట్రోకే దిక్కు లేదు అన్న వేళలో.. విశాఖ.. విజయవాడలో డబుల్ డెక్కర్ మెట్రో ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించటం.. ఇందుకోసం వందశాతం నిధులను కేంద్రం నుంచి వచ్చేలా చేయాలన్న ఆశ చూస్తే.. అది అత్యాశ అనిపించుకోక మానదు.

విశాఖపట్నంలో 19 కిలోమీటర్లు (మధురవాడ - తాడిచెట్లపాలెం) (గాజువాక - స్టీల్ ఫ్లాంట్) విజయవాడలో 4.7కి.మీ. (రామవరప్పాడు రింగ్ - నిడమానూరు) మోతావులపై డబుల్ డెక్కర్ మెట్రోను నిర్మించాలన్నది చంద్రబాబు తాజా ప్రతిపాదన. మొత్తంగా ఏపీలోని రెండు నగరాల్లోనూ మెట్రోను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలన్న ఆయన ఆశయాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. వాస్తవంలో అదెంత సాధ్యమన్న అంశాన్ని చంద్రబాబు మర్చిపోకూడదు కదా? అన్నది ప్రశ్న.

విజయవాడలో 66కిలోమీటర్ల మేర.. విశాఖపట్నంలో 76.90 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణానికి డీపీఆర్ లు ఆమోదం పొందాలి. కేంద్రం తో చర్చలు జరిపి రానున్న నాలుగేళ్లలో మెట్రో సేవలు ప్రారంభమయ్యేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. నిజానికి మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులే తలనొప్పులుగా మారి.. నెలల తరబడి టైం తీసుకుంటున్న వేళలో.. ఏపీలోని మెట్రో ప్రాజెక్టులకు వంద శాతం నిధులను కేంద్రం నుంచి తీసుకునేలా చేయాలన్న చంద్రబాబు ఆలోచన చూసినప్పుడు.. ఏపీకి మెట్రో కనుచూపు మేర సాధ్యం కాదన్న మాట వినిపిస్తోంది.

మోడీని ఒప్పించి.. నిధుల మంజూరు చేయించుకోవటం మామూలు విషయం కాదంటున్నారు. అయితే.. 2017లో తీసుకొచ్చిన పాలసీ ప్రకారం వందశాతం ఈక్విటీ కేంద్రమే చెల్లిస్తూ కోల్‌కత్తాలో 16 కి.మీ మేర ప్రాజెక్టు చేపట్టారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏపీకి ఇదే విధానం అమలు అయ్యేలా చూడాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. కోల్ కతా విషయంలో మోడీ సర్కారు నిర్ణయం తీసుకుందంటే.. దాని వెనుకున్న రాజకీయ ప్రయోజనాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఏపీకి ఈ మోడల్ ఎంతవరకు ఓకే అవుతుందన్న విషయాన్ని పట్టించుకోకుండా.. చంద్రబాబు ఆశలు పెట్టుకోవటం ఏమిటన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News