ఇద్దరు మీడియా అధినేతల మధ్య నలుగుతున్న బాబు ?

నిజానికి టీడీపీ విజయంలో ఇద్దరి పాత్ర ఉంది. ఎవరినీ తగ్గించడానికి లేదు. అలాగే ఇద్దరూ టీడీపీ శ్రేయోభిలాషులే. దాంతోనే అసలు సమస్య వచ్చిపడింది అని అంటున్నారు.

Update: 2024-10-16 03:56 GMT

తెలుగు సీమలో రాజకీయాలూ మీడియా రంగం ఎంతలా అల్లుకునిపోతాయో అందరికీ తెలిసిందే. ఇది దశాబ్దాల నుంచి జరుగుతున్న వ్యవహారమే. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఒక ప్రధాన రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తుంది అన్నది కూడా రాజకీయాల పట్ల మీడియా పట్ల ఏ కాస్తా అవగాహన ఉన్న వారికైనా తెలిసే విషయమే.

ఇక మీడియా హౌస్ ని మెయింటెయిన్ చెస్తూ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ ని ఒడిసి పట్టుకునే నేర్పున్న దమ్మున్న మీడియాధిపతులు కూడా ఉన్నారు. ఇక వారు మద్దతు ఇచ్చి గెలిచిన పార్టీలు అధికారంలోకి వస్తే పండుగే మరి. తాము అనుకున్నట్లుగా అంతా సాగుతుందని వారి ఆలోచన.

అలా జరిగిన కాలం కూడా ఉంది. అయితే ఇపుడు పరిస్థితులు కూడా మారుతున్నాయి. అన్నింటా పోటీ ఏర్పడింది. అలాగే ఒకే పార్టీకి ఇద్దరు బలమైన మీడియాధిపతులు మద్దతుగా నిలిచినపుడు వారి ప్రాధాన్యతలు వారి హవాను కూడా తెలుసుకుని దానికి అనుగుణంగా ఆకాంక్షలను నెరవేర్చడం కష్టమే.

ఇక చూస్తే గతంలో ఒక రాజగురువు పాత్ర పోషించిన మీడియాధిపతి ఉండేవారు. ఇపుడు ఆ ప్లేస్ ఖాళీగా ఉంది. అందులోకి దాదాపుగా తానే వచ్చేసినట్లుగా సీనియర్ మోస్ట్ మీడియాధిపతి ఒకరు తలపోస్తున్నారు. గతంలో రాజగురువుకు జరిగిన మర్యాదలు ఆయనకు ఇచ్చిన ప్రయారిటీ తనకూ దక్కాలని ఆయన కోరుకుంటున్నారని టాక్.

తాను ప్రభుత్వాన్ని తనదైన శైలిలో సలహా సూచనలతో శాసించాలని కూడా ఆ మీడియాధిపతికి అత్యాశలు కూడా ఉన్నాయని అంటున్నారు. మరో వైపు చూస్తే ఆయన మాదిరిగానే ఇంకో మీడియాధిపతి ఉన్నారు. ఆయన కూడా టీడీపీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఆయన కూడా తనదైన విధానంలో పనిచేస్తూ వత్తాసు పలుకుతూ వచ్చారు.

ఇపుడు పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రెండవ మీడియాధిపతికి ఒక బ్రహ్మాండమైన పోస్టుని ఇచ్చేందుకు అధినాయకత్వం సిద్ధం అయినట్లుగా పుకార్లు అయితే ఉన్నాయి. అదే సమయంలో తానే సీనియర్ మోస్ట్ మీడియాధిపతిని అని భావించే ఆయన ఇపుడు ఈ పరిణామాల పట్ల గుర్రు మంటున్నారుట.

అయితే గియితే సదరు పదవి ఏదో తన లాంటి వారికో తాను చెప్పిన వారికో దక్కాల్సిందే తప్ప ఆయనకు ఇవ్వడమేంటని కూడా ఒక బిగ్ క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇపుడు సదరు మీడియాధిపతికి టీటీడీ చైర్మన్ పదవిని ఇస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. దానిని అడ్డుకోవడానికి సదరు సీనియర్ మీడియాధిపతి క్రిష్ణ చక్రమే వేసి బ్రేక్ పడేలా చూస్తున్నారని అంటున్నారు.

ఇద్దరూ కావల్సిన వారే. ఇద్దరూ తన వారే. ఇద్దరినీ నొప్పించకూడదు. అదే టైం లో ఒకే మాట మీద ఒప్పించలేక టీడీపీ అధినాయకుడు చంద్రబాబు మధ్యన పడి నలిగిపోతున్నారు అని టాక్ అయితే ఉంది. ఇరువురు భామలతో ఇరుకున పడిన తీరు చందమైంది అని అంటున్నారు.

నిజానికి టీడీపీ విజయంలో ఇద్దరి పాత్ర ఉంది. ఎవరినీ తగ్గించడానికి లేదు. అలాగే ఇద్దరూ టీడీపీ శ్రేయోభిలాషులే. దాంతోనే అసలు సమస్య వచ్చిపడింది అని అంటున్నారు. దీంతో చంద్రబాబు ఏమి నిర్ణయం తీసుకుంటారో తెలియదు అని అంటున్నారు. అయితే ఒక్క విషయం మాత్రం వాస్తవం అని అంటున్నారు. ఈ పీట ముడిని విప్పడంలో ఎవరికి తేడా చేసినా తక్కువగా చేసినా మా చెడ్డ గొడవలు వచ్చేస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఇది అయితే పుకారుగా షికారు చేస్తూ గాసిప్ గానే చక్కర్లు కొడుతూ అందరినీ ఆకట్టుకునే వార్తగా ఉంది మరి.

Tags:    

Similar News