అర్హత లేనివారు రాజకీయాలు చేస్తే ఇలానే ఉంటుంది : విజయసాయిరెడ్డి పై చంద్రబాబు రియాక్షన్

సీనియర్ నేత వి.విజయసాయిరెడ్డి రాజీనామాపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారి స్పందించారు.

Update: 2025-01-25 10:34 GMT

సీనియర్ నేత వి.విజయసాయిరెడ్డి రాజీనామాపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారి స్పందించారు. దావోస్ సదస్సుకు వెళ్లివచ్చిన సీఎం.. అక్కడి విశేషాలను మీడియాకు వివరించే సందర్భంలో విజయసాయిరెడ్డి రాజీనామా అంశం ప్రస్తావనకు వచ్చింది. అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమంటూ వ్యాఖ్యానించిన సీఎం చంద్రబాబు అర్హతలేనివారు రాజకీయాలు చేస్తే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఘాటుగా స్పందించారు.

రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. చంద్రబాబు మీడియా సమావేశానికి గంట ముందు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ ను కలిసిన విజయసాయిరెడ్డి తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆ వెంటనే ఆయన విజయసాయిరెడ్డి రాజీనామా లేఖను ఆమోదించారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి వ్యవహారంపై స్పందించాల్సిందిగా మీడియా కోరగా, చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పార్టీపై నమ్మకం ఉంటే ఉంటారు.. లేకపోతే వెళ్లిపోతారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ పరిస్థితి కూడా ముఖ్యం. అయినా ఇది వాళ్ల (వైసీపీ) అంతర్గత వ్యవహారమంటూ ముక్తాయించారు. వ్యక్తిగత కోపంతో వ్యవస్థను నాశనం చేయడం ఏ రాష్ట్రంలో కూడా లేదన్నారు సీఎం. అర్హతలేని వారు రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి ఇలానే ఉంటుందని ఘాటువ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ పరిస్థితిపై ఇంతకుమించి కామెంట్ చేయనని సీఎం స్పష్టం చేశారు. సింగపూర్ వాళ్లకు కూడా జగన్ ప్రభుత్వం విధ్వంసం చూపించిందని, అందువల్లే వాళ్లు రావడానికి విముఖత చూపుతున్నారని తెలిపారు.

కాగా, చంద్రబాబుతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో తనకు మంచి స్నేహ సంబంధం ఉందని విజయసాయిరెడ్డి చెప్పారు. వైసీపీ అధికారంలో ఉండగా, నాటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై విజయసాయిరెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసేవారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా ఆయన ప్రకటనపై చంద్రబాబు ఘాటుగా స్పందించగా, టీడీపీ కూడా అంతే తీవ్రంగా విమర్శలు గుప్పించింది. ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్న ట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డిని తీవ్రంగా హెచ్చరించారు. గతంలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు మూల్యం చెల్లించుకునే సమయం వస్తుందని తేల్చిచెప్పారు.

Tags:    

Similar News