చంద్ర‌బాబు స‌ర్దుకు పోయినా.. రేవంత్‌కు సాధ్యం కాదు.. అనేక చిక్కులు!

దీనికి ప్రధానమైన కారణం తెలంగాణ సమాజంతో ముడిపడిన `సెంటిమెంటు` అంశాలు కీలకంగా మారుతున్నాయి.

Update: 2024-07-08 03:15 GMT

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం ఇప్పట్లో సాధ్యమవుతుందా? ఇప్పటికిప్పుడు అనుకున్న విధంగా సమస్యలు పరిష్కారం కానున్నాయా? అంటే ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మారిపోయింది. గతంలో తెలంగాణను పాలించిన కేసీఆర్, ఏపీని పాలించిన జగన్ కూడా ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం అంటూ రెండు దఫాలుగా చర్చలు జరిపారు. ఆ చర్చల్లో ఏ విషయంపై వారు దృష్టి పెట్టారనేది తెలియకపోయినా మొత్తానికి పరిష్కారం దిశగా అయితే ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయి. కానీ పరిష్కారం మాత్రం కనిపించలేదు.

దీనికి ప్రధానమైన కారణం తెలంగాణ సమాజంతో ముడిపడిన `సెంటిమెంటు` అంశాలు కీలకంగా మారుతున్నాయి. `నీళ్లు - నిధులు - నియామకాలు` నినాదంతో ఏర్పడిన తెలంగాణ ఇప్పుడు వాటి విషయంలో పంపకాలు జరిగేసరికి ఒకింత సెంటిమెంట్ తో కూడిన ఆందోళన, రాజకీయ అంశాలు ముడి పడినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఆనాడు కేసీఆర్ కైనా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కైనా సంక్లిష్టంగా మారిందనే చెప్పాలి.

రేవంత్ కు సమస్యలను పరిష్కరించుకోవాలని బలంగా ఆకాంక్ష ఉండొచ్చు. కానీ తెలంగాణ సమాజం పరంగా చూసుకుంటే రాజకీయంగా ఈ సమస్యల దుమారం చాలా పెద్ద ఎత్తున రేగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా స్థిరాస్తులను పంచడం విషయంలో తెలంగాణ సమాజం సంసిద్ధంగా లేదు. అదే విధంగా విద్యుత్ బకాయిలకు సంబంధించి కూడా సంసిద్ధంగా లేనటువంటి విషయాన్ని గతంలో కేసీఆర్ కూడా చెప్పుకొచ్చారు. ఏపీనే బకాయి ఉందని ఆయన మాట్లాడారు.

అదే విధంగా న‌దీ జలాల విషయానికి వచ్చేసరికి సాగు ప్రాంతం ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు మేలు జరిగే విధంగా నిర్ణయించేసారని, ఎడారి ప్రాంతంగా ఉన్నటువంటి తమ ప్రాంతానికి అన్యాయం చేస్తూ బచావత్‌ ట్రైబల్ కేటాయింపులు జరిపిందని అనాడు కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు దానిని కాదని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే ఏపీకి అనుకూలంగా కాకపోయినా కనీసం బచావత ట్రైబల్ ప్రకారం నీళ్ల కేటాయింపును ఆయన సమర్థించినా కూడా తెలంగాణ సమాజంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం జరుగుతుందనేది స్పష్టం.

అదేవిధంగా నియామకాల విషయానికి వచ్చేసరికి ఏపీ నుంచి ఇప్పటికి 1800 మంది ఉద్యోగులను తెలంగాణ తీసుకోవాల్సి ఉంది. కానీ ఈ విషయంలో కూడా తెలంగాణ సమాజం ఇష్టపడుతున్నట్టుగా కనిపించడం లేదు. అదే విధంగా అప్పులు చెల్లించాల్సి ఉందని ఏపీ చెబుతుండగా అసలు తామేమి చెల్లించాల్సిన అవసరం లేదని తెలంగాణ చెబుతుండటం గమ‌నార్హం. దీనికి కారణం కూడా తెలంగాణ సమాజంగానే మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎలా చూసుకున్నా గతంలో కేసీఆర్ ఏ విధంగా అయితే తెలంగాణ సమాజానికి కాస్త భయపడి వెనకడుగు వేశారో ఇప్పుడు రేవంత్ విషయంలో కూడా అదే జరుగుతుంది.

ఇక ఏపీ విషయాన్ని తీసుకుంటే సర్దుకుపోయేటటువంటి ప‌రిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో 2014 నుంచి 2019 వరకు పాల‌న‌ సాగించిన చంద్రబాబు కొన్ని కొన్ని విషయాల్లో పట్టు విడుపు ధోర‌ణులతో వ్యవహరించారు. ఇప్పుడు కూడా అదే ధరణితో ఆయన ముందుకు వెళ్లినా ఇబ్బంది అయితే ఉండదు. కానీ తెలంగాణ‌ నుంచి సమస్యల పరిష్కారానికి అంత సానుకూలమైనటువంటి వాతావరణం కనిపించడం లేదు. బలమైనటువంటి రాజకీయ ప్రత్యర్థులు, బలమైన తెలంగాణ సామాజిక వాదం వంటివి ఇక్కడ ప్రభావం చూపుతున్నాయి.

Tags:    

Similar News