పోలీసుల తీరుపై చంద్రబాబు ఫైర్

ఏపీలో పోలీసుల తీరు దారుణంగా ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఫైర్ అయ్యారు

Update: 2024-05-13 08:40 GMT

ఏపీలో పోలీసుల తీరు దారుణంగా ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఫైర్ అయ్యారు. పోలింగ్ బూతుల వద్ద జనాలు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారని అయినా ప్రశాంతంగా సాఫీగా పోలింగ్ నిర్వహించేలా చూడడంలో మాత్రం పోలీసులు ఫెయిల్ అయ్యారంటూ బాబు ద్వజమెత్తారు.

ఏపీలో ప్రశాంతంగా పోలింగ్ ని నిర్వహించాల్సిన చోట పోలీసులు దారుణంగా విఫలం కావడం కళ్ల ముందే కనిపిస్తోందని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రతీ చోట నుంచి దాదాపుగా ఫిర్యాదులు అన్నీ ఒకేలా వస్తున్నాయని ఆయన అన్నారు.

వాటిని తాను ఎప్పటికపుడు మోనిటరింగ్ చేస్తూ అధికారులకు తెలియచేస్తున్నామని తాను సైతం ఫిర్యాదులు చేస్తున్నా కూడా పోలీసు యంత్రాంగంలో చలనం అయితే లేదని బాబు మండిపడ్డారు. ఏపీలో శాంతి భద్రతలను పోలీసులు కాపాడలేకపోయారని ఆయన తీవ్రంగా విమర్శించారు.

దీనిని వెంటనే చక్కదిద్దాలని ఎన్నికల సంఘం పరిస్థితిని సమీక్షించాలని పోలింగ్ ని కూడా పరిశీలించాలని మొత్తం చక్కదిద్దాల్సిన అవసరం ఉందని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఈసారి ఏపీలో పోలింగ్ విషయంలో ఘర్షణలు చోటు చేసుకుంటాయని అంతా ముందు నుంచి ఊహించినదే.

దానికి తగినట్లుగానే చాలా చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పల్నాడు జిలాలో అలాగే రాయలసీమలోని జమ్మలమడుగు, అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలలో ఘర్షణలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి. దాదాపుగా ప్రతీ చోటా వైసీపీ టీడీపీ కూటమి కార్యకర్తలు బాహాబాహీకి తలపడుతున్నారు. పల్నాడులో అయితే కర్రలతో కొట్టుకున్నారు. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు అల్లుడు ఉపేష్ కారు మీద దాడికి పాల్పడ్డారు. ఇక రెంటాలలో కూటమి అభ్యర్ధి బ్రహ్మారెడ్డి కారు ద్వంసం అయింది.

తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కారు అద్దాలు బద్ధలు అయ్యాయి. ఇదే తీరున చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి. మరో వైపు చూస్తే ఏపీకి స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ గా వచ్చిన దీపక్ మిశ్రా సైతం ఘర్షణల పట్ల ఆరా తీశారు. ఏపీలో 42 వేల సీసీ కెమెరాలు పెట్టినా ఘర్షణలు చోటు చేసుకోవడం పట్ల ఆయన అధికారుల తీరు మీద అసహనం వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.

ఏపీలో ప్రశాంతంగా జరగాల్సిన పోలింగ్ ఎందుకు హింసాత్మకంగా మారుతోంది అన్న దాని మీద కేంద్ర అబ్జర్వర్లు కూడా ఆరా తీస్తున్నారు. చెదురు మదురు సంఘటనలు గతంలో జరిగేవి. ఈసారి మాత్రం చాలా చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. ఇది పోలింగ్ సరళి మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది అన్నది కూడా చూడాలని అంటున్నారు.

Tags:    

Similar News