చంద్రబాబుకి హోదా వచ్చింది...ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా ?
మొత్తానికి మాజీ సీఎం కాస్తా కొత్త సీఎం గా మారిపోయారు చంద్రబాబు. ఆయన అయిదేళ్ల పాటు విపక్షంలో గడిపారు
మొత్తానికి మాజీ సీఎం కాస్తా కొత్త సీఎం గా మారిపోయారు చంద్రబాబు. ఆయన అయిదేళ్ల పాటు విపక్షంలో గడిపారు. అలా జగన్ వచ్చిన దగ్గర నుంచి టీడీపీని టార్గెట్ చేసినా కూడా బాబు అంతకు రెట్టింపు ఉత్సాహం తెచ్చుకుని మరీ వైసీపీ ప్రభుత్వం మీద పోరాడారు. ఈ విషయంలో బాబుకు కేంద్రంలోని బీజేపీ పెద్దలు సహకరించారు.
బాబుతో కటీఫ్ అన్న బీజేపీ చివరికి పొత్తుకు వచ్చింది. కూటమికి అనూహ్యంగా బలం చేకూరింది. అంతే కాదు ఎన్నికల్లో ఆది బాగా ఉపకరించింది. ఎలక్షనీరింగ్ లో వైసీపీని దాటుకుని టీడీపీ ముందుకు సాగింది. అలా అధికారం చేతిలో పడింది.
మొత్తానికి చంద్రబాబుకు సీఎం పోస్ట్ వచ్చింది. కానీ అదే సమయంలో ఏపీకి ఏమి న్యాయం జరిగింది అన్నది అందరి ప్రశ్నగా ఉంది. మామూలుగా అయితే ఏపీకి ప్రత్యేక హోదా అన్నది ఇపుడు వినిపించి ఉండకూడదు. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి సొంతంగా మెజారిటీ లేదు.
అటువంటి ప్రభుత్వానికి ఆక్సిజన్ ఇచ్చి పవర్ లోకి తెచ్చింది చంద్రబాబు. అలా చూస్తే చంద్రబాబు మోడీ పరస్పరం ఒకరికి ఒకరు సహకరించుకున్నారు అనుకోవాలి. కానీ ఏపీలో చంద్రబాబుకు బీజేపీ సాయం అవసరం లేదు. పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఉంది. కానీ కేంద్రంలో అలా కాదు బాబు ఊత కర్ర మద్దతు తీసి పక్కన పెడితే అర క్షణం కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండలేదు.
మరి ఇంతటి కీలక సమయంలో బాబు బీజేపీ పెద్దలను ఒప్ప్పించి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకుని రావాలి కదా అన్నది అంతా అంటున్న విషయం. ఏపీకి ప్రత్యేక హోదా సంజీవినిగా ఉంటుంది. అన్ని రకాలుగా కూన రిల్లిన ఏపీని ఆదుకోవడానికి ప్రత్యేక హోదా అన్నది ఒక్కటి చాలు. దానికి సరిసాటి కూడా వేరేది లేదు
మరి అలాంటి ప్రత్యేక హోదా విషయంలో ఒక్క మాట కూడా బాబు అనలేదని సగటు ఆంధ్రుల ఆవేదంగా ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పిస్తూ బాబు సీఎం గా ప్రమాణం చేసి ఉంటే ఆ లెక్కే వేరు. ఆ కిక్కే వేరు అన్నట్లుగా ఉండేది అని అంటున్నారు.
కానీ బాబు మాత్రం సీఎం పోస్ట్ తో హోదా వచ్చేసింది అనుకుంటే పొరపాటే అని అంటున్నారు. ఏపీకి బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే ఆ విషయంలో టీడీపీ ఇప్పటికైనా మించిపోయింది లేదు ఒత్తిడి భారీ ఎత్తున పెట్టాల్సిందే అని అంటున్నారు. ఏపీ ఇపుడు విభజన గాయాలతో పదేళ్ళుగా చేసిన అప్పులతో అన్ని విధాలుగా కునారిల్లి ఉంది.
అలాంటి ఏపీని ఊరడించాలంటే ప్రత్యేక హోదా తప్ప మరేదీ అవసరం లేదు అన్నది మేధావుల భావన. మరి ఆ హోదాను ఏపీకి సాధిస్తే బాబుని మించిన బహు మొనగాడు ఎవరూ ఉండరు అనే అంటారు. కానీ మోడీ చేత ఆ మాట పలికించడంలో బాబు సక్సెస్ అవుతారా అసలు ముగిసిన అధ్యాయాన్ని తెరిపించడంలో బాబు తనదైన వ్యూహాలను ఎంతవరకూ అమలు చేయగలరు అన్నది ఇక్కడ ప్రశ్న. అంతే కాదు ప్రత్యేక హోదా విషయం టీడీపీ కూడా మరచిపోయిందా అన్న డౌట్లు వస్తే అపుడే మొదలవుతుంది అసలైన రాజకీయం అని అంటున్నారు.