చంద్రబాబు : ఒక కుర్చీ కథ !

టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఎమ్మెల్యేల సమావేశం విజయవాడలో జరిగింది.

Update: 2024-06-11 09:34 GMT

టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఎమ్మెల్యేల సమావేశం విజయవాడలో జరిగింది. ఈ భేటీలో ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చంద్రబాబు పేరును జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ప్రతిపాదించారు.

ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వేదికపైన చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆశీనులయ్యారు. ఈ క్రమంలో వేదికపై చంద్రబాబు కోసం ప్రత్యేక కుర్చీని ఏర్పాటు చేశారు. మిగతా ముగ్గురికీ ఒక రకమైన కుర్చీలు వేసి.. చంద్రబాబుకు ప్రత్యేక ఆసనం ఏర్పాటు చేసి.. అందులో పసుపు తువ్వాలు పరిచారు.

దీంతో చంద్రబాబు తన వెనుక ఉన్న సెక్యూరిటీని, సహాయకులను పిలిచి ఆ ప్రత్యేక కుర్చీని తీసివేయించారు. పవన్‌ కళ్యాణ్, పురందేశ్వరి, అచ్చెన్నాయుడు కూర్చున్న కుర్చీనే తనకు వేయాలని ఆదేశించారు. దీంతో సహాయకులు ఆయనకు కూడా సాధారణ కుర్చీనే వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. చంద్రబాబు సింప్లిసిటీని టీడీపీ శ్రేణులు కొనియాడుతున్నాయి.

అలాగే తనను నాయకుడిగా ఎన్నుకున్న సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. తాను ముఖ్యమంత్రిగా ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండబోవన్నారు. గతంలో మాదిరిగా సీఎం ప్రయాణిస్తుంటే చెట్లు కొట్టేయడం, షాపులు బంద్‌ చేయడం, రోడ్లు మూసేయడం, పరదాలు కట్టుకోవడం ఇలాంటివాటికి కూడా తావు లేదని స్పష్టం చేశారు. సీఎం కూడా మామూలు మనిషేనన్నారు. మామూలు మనిషిగానే వస్తానని తెలిపారు. మిత్రుడు పవన్‌ కళ్యాణ్‌ తో పాటు మేమంతా సామాన్య వ్యక్తులుగానే మీ వద్దకు వస్తామని తెలిపారు. ప్రజల్లో ఒకరిగా ఉంటామని హామీ ఇచ్చారు. హోదా సేవ కోసమే తప్ప.. పెత్తనం కోసం కాదని తేల్చిచెప్పారు.

సీఎం కాన్వాయ్‌ వచ్చే సమయంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని ఇప్పటికే అధికారులకు చెప్పానన్నారు. ఒక సిగ్నల్‌ కి మరో సిగ్నల్‌ కి కొద్ది నిమిషాల వ్యవధిలో మాత్రమే గ్యాప్‌ పెట్టుకోవాలని సూచించానన్నారు. తమకు ఐదు నిమిషాలు లేట్‌ అయినా పర్వాలేదు కానీ.. ప్రజలకు అసౌకర్యం కలగకూడదని ఆదేశించానన్నారు.

అలాగే దాడులు చేసి బాధితులపైనే కేసులు పెట్టే పరిస్థితి ఉండదని తేల్చిచెప్పారు. ప్రజల్లో ఏ ఒక్కరి ఆత్మగౌరవానికీ భంగం కలగదని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News