బాబు బెయిల్ షరతులు, జగన్ కేసుల విచారణలపై కీలక అప్ డేట్లు!

అవును... టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ పై అదనపు షరతుల విధించాలంటూ సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ పై తాజాగా ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది.

Update: 2023-11-03 06:15 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు... 52 రోజుల తర్వాత కేసు మెరిట్స్ తో సంబంధం లేకుండా, ఆరోగ్య సమస్యలపై మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో న్యాయస్థానం కొన్ని షరతులను విధించింది. వాటితోపాటు మరికొన్ని షరతులు విధించాలని ఏపీసీఐడీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై తాజాగా హైకోర్టు తీర్పు వెలువరించింది.

అవును... టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ పై అదనపు షరతుల విధించాలంటూ సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ పై తాజాగా ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇందులో భాగంగా... స్కిల్‌ డెవలప్ మెంట్ కుంభకోణం కేసు అంశాలపై మీడియాతో మాట్లాడవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఇదే సమయంలో... రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని కోర్టు స్పష్టం చేసింది.

ఇదే క్రమంలో... చంద్రబాబు కార్యక్రమాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థనను మాత్రం హైకోర్టు తిరస్కరించింది. కాగా... అటు రాజమండ్రిలోనూ, ఇటు హైదరాబాద్ లోనూ కూడా చంద్రబాబు హైకోర్టు షరతులను పరిపూర్ణంగా అతిక్రమించారని అధికార వైసీపీ నేతలు, పలువురు పరిశీలకులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... హైదరాబాద్ లో బేగంపేట విమనాశ్రయం నుంచి జూబ్లీహిల్స్ లోని ఇంటివరకూ ర్యాలీగా వెళ్లడంపై తెలంగాణలో కేసు నమోదైన సంగతి తెలిసిందే.

సుప్రీంలో రఘురామ పిటిషన్ పై విచారణ:

ఆ సంగతి అలా ఉంటే... ఏపీ సీఎం జగన్‌ కేసులపై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ పై సుప్రీంకోర్టులో తాజాగా విచారణ జరిగింది! ఇందులో భాగంగా... సీబీఐకి నోటీసు జారీ చేసిన సుప్రీం, కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పాలని ప్రశ్నించింది. ఇదే క్రమంలో... రఘురామ వేసిన కేసుల బదిలీ పిటిషన్‌ ను ఎందుకు విచారించకూడదో కూడా చెప్పాలని ఆదేశించింది.

ఈ క్రమంలో... ఈ పిటిషన్ కు సంబంధించిన ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది.

కాగా... పదేళ్లుగా సాగుతున్న జగన్ కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఇటీవల రఘురామ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... సీబీఐ నమోదు చేసిన 11 కేసులు ఇప్పటివరకు 3,041 సార్లు వాయిదా పడ్డాయని.. వీటి విచారణ త్వరగా జరపాలనే ఉద్దేశం సీబీఐలో కనిపించట్లేదని.. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్‌ కు ఇష్టానుసారం వాయిదాలు కోరే స్వేచ్ఛనిచ్చారని తన పిటిషన్ లో పేర్కొన్నారు.

ఇదే సమయంలో... ఈ తాజా పరిస్థితులను బట్టి చూస్తుంటే కేసుల విచారణ ప్రారంభమయ్యే పరిస్థితే కనిపించట్లేదని.. అందువల్ల సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని వీటి విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ తన పిటిషన్‌ లో పేర్కొన్నారు.

Tags:    

Similar News