''2014-19 మధ్య ఎలాంటి పాలన జరిగిందో మీకు తెలుసు... మళ్లీ అలాంటి పాలన రావాలంటే''
తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఉమ్మడి ప్రచార సభను నిర్వహించాయి.
''2014-19 మధ్య ఎలాంటి పాలన జరిగిందో మీకు తెలుసు... మళ్లీ అలాంటి పాలన రావాలంటే కూటమి రావాలి''- అని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో యువతను భ్రష్టు పట్టించిన జగన్‌ను తరిమి కొట్టేందుకు యువత సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో యువత ఇచ్చే తీర్పు.. చేసే కన్నెర్రతో జగన్ తన ఫ్యాన్‌ను మడిచి.. చెత్తబుట్టలో పారేసి లండన్‌కు పారిపోతాడని చంద్రబాబు అన్నారు. తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఉమ్మడి ప్రచార సభను నిర్వహించాయి. ఈ సభలో పవన్‌తోపాటు..చంద్రబాబు పాల్గొన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. తమ కూటమి ప్రభావంతో జగన్ సహా ఆయన పార్టీ కొట్టుకుపోతా యని అన్నారు. ప్రజాతీర్పు నిర్ణయం అయిపోయిందన్న చంద్రబాబు కేవలం ఎన్నికలు, ఫలితం మాత్రమే మిగిలి ఉందన్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్ల జగన్ పాలనలో ఎవరైనా ప్రశాంతంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. ''నేనడుతున్నా.. మీరు ఈ ఐదేళ్లలో ప్రశాంతంగా ఉన్నారా? మీకు మేలు జరిగిందా? లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మీకు మేలు చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. ముఖ్యంగా యువత నేడు నిరాశలో కూరుకుపోయారు. వారికి ఉద్యోగాలు లేవు. మెగా డీఎస్సీ అన్నాడు ఒక్క డీఎస్సీ అయినా వేశాడా?'' అని చంద్రబాబు నిలదీశారు.
''నేనొకటే చెబుతున్నా.. పొత్తు పెట్టుకున్నారని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. నిజమే 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు.. ఆ కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు పొత్తులు పెట్టుకున్నాం. ఇప్పుడు.. ఒక దుర్మార్గుడు పాలన చేస్తూ.. రాష్ట్రాన్ని అన్ని విధాలా ధ్వంసం చేస్తుంటే.. దానిని అరికట్టేందుకు రాష్ట్రాన్ని, ప్రజలను పరిరక్షించేందుకు పొత్తులు పెట్టుకున్నాం. ఇది మీరంతా అర్థం చేసుకున్నారు. కానీ, అర్ధం చేసుకోని వాళ్లకి నేను చెబుతున్నా'' అని పొత్తులపై చంద్రబాబు వివరణ ఇచ్చారు. ఇక, పవన్ రాష్ట్రం కోసం.. ప్రజల కోసం అనేక త్యాగాలు చేశారని చెప్పారు. తనను దూషించినా.. వైసీపీ నేతలు కవ్వించినా.. ఆయన ఎదురొడ్డి నిలిచారని చెప్పారు.
ఒక సినిమా హీరోగా పవన్‌కు రూ.కోట్లు సంపాయించుకునే అవకాశం.. విలాసవంతమైన జీవితం గడిపే అవకాశం ఉన్నా.. ప్రజల కోసం, రాష్ట్రం కోసం పనిచేస్తున్నారని తెలిపారు. నేను రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు వచ్చేందుకు పవన్ ప్రయత్నిస్తే.. ఈ దుర్మార్గుడు(సీఎం జగన్) అడ్డుపడ్డాడు. అయినా.. అడ్డంకులు ఛేదించుకుని వచ్చి నన్ను కలిశాడు. పొత్తులు అప్పుడే మొదలయ్యాయి. ఎలాంటి నిబంధనలు లేకుండా మేం చేతులు కలిపాం. రాష్ట్రం కోసరం.. ప్రజల కోసరం ముందుకు వచ్చిన పవన్‌ను ప్రజలు అభినందించాలని.. 21 సీట్లలో జనసేన అభ్యర్థులను గెలిపించాలి. అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ''2014-19 మధ్య ఎలాంటి పాలన జరిగిందో మీకు తెలుసు... మళ్లీ అలాంటి పాలన రావాలంటే కూటమినే గెలిపించాలి'' అని వ్యాఖ్యానించారు.