అసెంబ్లీలో ఆ ఎమ్మెల్యేలను నిలబెట్టిన బాబు... వీడియో వైరల్!
ప్రస్తుతం ఏపీలో "శాంతిభద్రతలు" అంశం అత్యంత కీలకంగా మారిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఏపీలో "శాంతిభద్రతలు" అంశం అత్యంత కీలకంగా మారిన సంగతి తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో రాష్రంలో దాడులూ, దారుణాలు, అత్యాచారాలు, హత్యలు విపరీతంగా జరిగాయంటూ జగన్ ఢిల్లీలో ఎగ్జిబిషన్ పెట్టి ధర్నా చేశారు. మరోపక్క వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయ్యిందంటూ బాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
ఏపీలో ప్రస్తుతం గత ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు, కూటమి ప్రభుత్వం కొలువుదీరిన 45 రోజుల్లోని శాంతిభద్రతలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చర్చ కాస్తా రాష్ట్రం దాటి హస్తినవరకూ చేరిన పరిస్థితి. ఈ నేపథ్యంలో... ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతిభద్రతల విషయంలో ఏపీని దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెడతానని అన్నారు.
ఇదే సమయంలో... గత ప్రభుత్వ హయాంలో పెట్టిన రాజకీయ ప్రేరేపిత కేసులను సమీక్షిస్తామని చెప్పిన చంద్రబాబు... అక్రమ కేసులు పెట్టిన అధికారులను శిక్షించేందుకు సిద్ధమని ప్రకటించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా శిక్షిస్తామని బాబు తెలిపారు. అధికారులు సమిష్టిగా చట్టాన్ని గౌరవించినప్పుడే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని అన్నారు.
ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్న బాబు... బాబ్లీ కేసు తప్ప తనపై గతంలో ఏనాడూ కేసులు లేవని.. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై 17 కేసులు పెట్టారని, పవన్ కల్యాణ్ పై 7 కేసులు నమోదు చేశారని అన్నారు. ఇక, జేసీ ప్రభాకర్ రెడ్డిపై సుమారు 60కి పైగా కేసులు పెట్టారని బాబు సభకు వెళ్లడించారు. ఈ స్థాయిలో ప్రతిపక్ష నేతలను అణిచివేయాలయని ప్రయత్నించారని తెలిపారు.
ఇక ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనిత, స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని చెప్పిన బాబు.. రఘురామ కృష్ణంరాజును లాకప్ లో చిత్రహింసలు పెట్టారని అన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు చూసి నాటి సీఎం పైశాచికానందం పొందారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. గత ప్రభుత్వ హయాంలో కేసులు ఉన్న సభ్యులు లేవాలని బాబు కోరారు!
అవును... గత ప్రభుత్వ హయాంలో కేసులు ఉన్న సభ్యులు ఓసారి లేచి నిలబడాలని సీఎం చంద్రబాబు నేడు అసెంబ్లీలో కోరారు. దీంతో... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు చాలా మంది సభ్యులు తమ తమ స్థానాల్లో లేచి నిలబడ్డారు. అనంతరం స్పందించిన సీఎం... రాజకీయ పోరాటం చేసిన అందరిపైనా కేసులు పెట్టారని.. వారిని ఎప్పటికీ బయటకు రానీయకుండదని అనుకున్నారని.. కానీ, ప్రజలు మాత్రం నేరుగా అసెంబ్లీకి పంపారని అన్నారు.