చంద్రబాబుకు తీవ్ర ఉద్వేగం కలిగించిన సంఘటన అదే!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, హస్తిన పర్యటన, తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ, తెలంగాణ టీడీపీ కేడర్ తో మీటింగ్... ఇలా ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా అధికారికంగా తొలిసారి హైదరాబాద్ కి వచ్చిన చంద్రబాబు గచ్చిబౌలి సభను తలచుకుని ఎమోషనల్ అయ్యారు!
అవును... ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు చంద్రబాబుని ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన అనంతరం కోర్టు రిమాండ్ విధించింది. దీంతో... చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ సమయంలో హైదరాబాద్ లో ఓ అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది!
ఇందులో భాగంగా... చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ, ఆయనకు మద్దతుగా హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఆయన కోసం భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు భారీ ఎత్తున బాబు అభిమానులు హాజరయ్యారు. ఈ సభలో పాల్గొన్న వారంతా ముక్త కంఠంతో చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు.. ఆ అరెస్ట్ అక్రమం అంటూ నినాదాలు చేశారు. నాడు ఈ సభ పూర్తి వైరల్ గా మారింది.
అయితే ఆ సభ ద్వారా వచ్చిన స్పందన చూడటానికి చంద్రబాబు బయట లేరు. అప్పుడు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఒంటరిగా ఉన్నారు. అయితే బయట గచ్చిబౌలిలో మాత్రం ఆయన కోసం వేలాదిగా తరలివచ్చిన ప్రజానికం... నిలబడింది, గళం విప్పింది, ఆ అరెస్ట్ ను ఖండించింది. అయితే బాబు జైలు నుంచి విడుదలయ్యాక ఆ సభ గురించి తెలుసుకుని ఎమోషనల్ అయ్యారంట.
తాజాగా ముఖ్యమంత్రి హోదాలో హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు.. నాడు తనకు మద్దతుగా గచ్చిబౌలి వేదికగా జరిగిన సభను గుర్తుచేసుకున్నారు.. ఈ సందర్భంగా ఉద్వేగానికి గురయ్యారు. తాజాగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో టీటీడీపీ కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. తనను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సమయంలో... హైదరాబాద్ వాసులు తన కోసం చేసిన ఆందోళనను మరిచిపోలేనని అన్నారు.
తనకు మద్దతుగా గచ్చిబౌలిలో నిర్వహించిన సభ గురించి తర్వాత తెలుసుకుని ఉద్వేగానికి గురైనట్లు చెప్పారు.. తన జన్మ ధన్యమైందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తనకు ఏపీ, తెలంగాణ రెండు కళ్లని.. వాటిలో దేన్నీ వదులుకోనని చంద్రబాబు చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలం అన్నదమ్ములుగా కొనసాగుతామని తెలిపారు.
ఈ సందర్భంగా ఏ నాయకుడికీ ఇవ్వనన్ని అవకాశాల్ని తెలుగుజాతి తనకు ఇచ్చిందని.. ఇందులో భాగంగా సమైక్యరాష్ట్రంలో 9.5 ఏళ్లు సీఎంను, పదేళ్లు ప్రతిపక్ష నేతగా అవకాశం ఇచ్చిందని అన్నారు. ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరని తెలిపారు. తనకు పునర్జన్మ ఉంటే తెలుగుగడ్డపైనే పుట్టాలని భగవంతుడిని కోరుకుంటానని బాబు స్పష్టం చేశారు!