తమ్ముళ్లకు శీల పరీక్ష.. బాబు బిగ్ ట్విస్ట్..!
చంద్రబాబు హయాంలో 26 సామాజిక వర్గాల కార్పొరేషన్లు ఉన్నాయి.
తెలుగు దేశం పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు బిగ్ ట్విస్టే పెట్టారు. పార్టీ అధికారంలోకి వచ్చింది కదా.. తమ పంట పండుతుందని.. తమకుపదవులు వస్తాయని ఆశలు పెట్టుకున్న వారిపై శీల పరీక్ష రూపంలో చంద్రబాబు నీళ్లు జల్లారు. నిజానికి కూటమి ప్రభుత్వం రాకతో.. రాష్ట్రంలో తమకు నామినేటెడ్ పదవులు దక్కుతాయని తమ్ముళ్లు ఆశలు పెట్టుకున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం కంటే కూడా.. వైసీపీ హయాంలో ఏదో ఒక పేరుతో నామినేటెడ్ పదవులు సృష్టించారు.
చంద్రబాబు హయాంలో 26 సామాజిక వర్గాల కార్పొరేషన్లు ఉన్నాయి. వాటిని జగన్.. ఏకంగా 56 కార్పొరేష న్లు చేశారు. దీంతో మరో 30 మందికి పదవులు ఇవ్వచ్చు. అలానే.. వివిధ అభివృద్ధి కార్యక్రమాల పేరుతో చైర్మన్ పదవులను ఏర్పాటు చేశారు. వీటిలో రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా మండలి అని ఒక దానిని ఏర్పాటు చేశారు. దీనిలో ఏకంగా 12 మందిని నామినేట్ చేసుకునే అవకాశం ఉంది. ఇక, ఇతర నామినేటెడ్ పదవులైన.. వక్ఫ్ బోర్డు, ఆలయాల పాలక మండళ్ల పోస్టులు కామనే.
సుమారుగా 250 నుంచి 300 మధ్య ఈ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు సలహాదారుల పోస్టులు కూడా ఉన్నాయి. సలహాదారుల సంఖ్యను కుదించినా.. ఇతర పోస్టులను కొనసాగించుకోవచ్చు. దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఇంత వరకు బాగానే ఉన్నా.. మూడు పార్టీల నుంచి నేతలను తీసుకుని వారికి ఈ పదవులు ఇచ్చే క్రమంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. ఇదే సమయంలో సీనియర్లు.. జూనియర్లు.. అనే తేడా ఎలానూ ఉంది. కుల సమీకరణలు కామన్.
ఈ నేపథ్యంలో చంద్రబాబు తెలివిగా వ్యవహరించారు. జిల్లాల స్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నట్టు చంద్రబాబు చెప్పారు. పార్టీ కోసం ఎవరు ఏమేరకు కష్టపడ్డారో తెలుసుకుంటున్నట్టు తాజాగా ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు.. కష్టపడిన వారికి మాత్రమే పదవులు ఇస్తామన్నారు. దీంతో ఇప్పుడు తమ్ముళ్లు ఈ శీల పరీక్షలో నెగ్గాల్సి ఉంటుంది. కేవలం మీడియా ముందుకు నాలుగు తిట్లు తిట్టి.. ఇంట్లో కూర్చున్న వారికి ఇప్పుడు బెంగ పట్టుకుంది. అదేసమయంలో ఇంట్లో తమను తామునిర్బంధించుకుని.. పోలీసులు నిర్బంధించారంటూ.. నిరసనలకు డుమ్మా కొట్టిన వారు కూడా.. ఇప్పుడు బిక్కు బిక్కుమంటున్నారు. సో.. మొత్తానికి బాబు వ్యూహం బాగుంది. కానీ.. ఏమేరకు సక్సెస్ చేస్తారనేది చూడాలి.