వాలంటీర్లపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ క్రమంలో... సర్పంచుల సంఘం భుజంపై తుపాకీ పెట్టి.. చంద్రబాబు వాలంటీర్లను కాలుస్తున్నారంటూ కథనాలు హల్ చల్ చేశాయి.
ఏపీలో ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు, రద్దు అనే అంశాలపై విపరీతమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పైగా.. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కూడా వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని చెబుతూ.. వారి వేతనాలను రూ.10,000కు పెంచనున్నట్లు హామీ ఇచ్చారు. అయితే ఇటీవల కాలంలో వాలంటీర్ల వ్యవస్థపై పలు కథనాలు తెరపైకి వచ్చాయి.
ఇందులో భాగంగా.. ఏపీలో వాలంటీర్లకు నెల నెలా ఇచ్చే రూ.200 న్యూస్ పేపర్ అలవెన్సులను నిలివేసిందని.. త్వరలో ఈ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయబోతోందని కథనాలొచ్చాయి. ఇక తాజాగా... గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని సర్పంచుల సంఘం తీర్మానించిందంటూ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు, టీడీపీ కీలకనేత వైవీబీ రాజేంద్రప్రసాద్ ప్రకటించడంతో ఈ చర్చ మరింత పీక్స్ కి చేరింది.
ఈ క్రమంలో... సర్పంచుల సంఘం భుజంపై తుపాకీ పెట్టి.. చంద్రబాబు వాలంటీర్లను కాలుస్తున్నారంటూ కథనాలు హల్ చల్ చేశాయి. ఇదే సమయంలో... సుమారు 2.60 లక్షల మంది వాలంటీర్లకు నెలకు రూ.10,000 చొప్పున జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ప్రభుత్వం లేదనే వాదనా తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు.
అవును... ఏపీలో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారంటూ వస్తున్న కథనాలపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. తాజాగా సాంఘిక సంక్షేమశాఖ పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్పందించిన సీఎం... గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల సేవలు మరింత సమర్ధవంతంగా వినియోగించుకునేలా ఆలోచనలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదే సమయంలో... సచివాలయాల్లోని ఉద్యోగులు, వాలంటీర్లు అందరినీ ప్రభుత్వం కొనసాగిస్తుందని, వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందిచాలన్న దానిపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామితో పాటు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీంతో... ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందనే విషయంపై క్లారిటీ వచ్చినట్లయ్యిందని అంటున్నారు!