అలా చేస్తే మళ్లీ అసెంబ్లీకి వెళ్లం: చంద్రబాబు
ఏపీ సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత అధికారులతో మమేకమవుతున్న సంగతి తెలిసిందే.
ఏపీ సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత అధికారులతో మమేకమవుతున్న సంగతి తెలిసిందే. పాలనపై పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు. తాజాగా ఈరోజు సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొన్న చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై, ప్రతి మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని, ప్రజలను సంతృప్తి పరిచేలా పాలన చేయాలని సూచించారు.
ప్రజా వేదిక కూల్చివేతతో ప్రభుత్వం పాలన మొదలుబెట్టిందని, ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ ను దెబ్బతీసిందని విమర్శించారు. ఐఏఎస్ అధికారుల మనోధైర్యాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసిందని, గతంలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆంధ్రా ఐఏఎస్ ఆఫీసర్లు జగన్ పాలనలో అపఖ్యాతి పాలయ్యారని గుర్తు చేసుకున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంల పనితీరుతో పాటు క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారుల పనితీరును బట్టి కూడా ప్రభుత్వ పనితీరును ప్రజలు అంచనా వేస్తున్నారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
రాష్ట్ర పునర్నిర్మాణానికి కలెక్టర్ల సదస్సు నాంది పలకాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి వస్తున్న ఫిర్యాదుల్లో 50% భూ సమస్యలపైనే ఉన్నాయని, వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంపద సృష్టికి కొత్త విధానాలు, నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ప్రజా ప్రతినిధులను గౌరవించాలని, ఎమ్మెల్యేలు ఏమైనా చెబితే వినాలని అన్నారు. ప్రజలు తమకు అధికారాన్ని కట్టబెట్టారని తప్పు చేస్తే మళ్లీ అధికారంలోకి రాలేమని, అసెంబ్లీకి పోలేమని చంద్రబాబు అన్నారు.
పరదాలు కట్టడాలు, రోడ్ బ్లాక్ చేయడాలు వంటివి చేయవద్దని, గత ప్రభుత్వంలో చాలా మంది మంత్రులు ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోయారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం అంతరంగాన్ని అనుసంధానం చేస్తూ ఒక యాప్ క్రియేట్ చేస్తామని చంద్రబాబు చెప్పారు.