మూతి బిగింపులు-అలకలు....... పాతబడలేదు బ్రో!
గురువారం రాత్రంతా కీలక నేతలతో మాటా మంతీ బుజ్జగింపులతోనే తెల్లవారుజామున 3 అయిందట.
మూతి బిగింపులు.. అలకలు పాతబడిన విద్యలని-అన్నారు కవిగారు. కానీ, రాజకీయాల్లో ఇప్పుడు ఇవే ఎక్కువగా వర్కవుట్ అవుతున్నాయి. వైసీపీలో ఇలాంటివి కనిపించవు కానీ, అంతో ఇంతో నేతల అభిప్రాయాలకు.. వారి ఆవేదనలకు ప్రాధాన్యం ఇచ్చే టీడీపీలో మాత్రం గత రెండు రోజులుగా నేతల మూతి బిగింపులు.. అలకలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో వీరిని బుజ్జగించ లేక.. చంద్రబాబుకు కంటిపై కునుకు లేకుండా పోతోంది. గురువారం రాత్రంతా కీలక నేతలతో మాటా మంతీ బుజ్జగింపులతోనే తెల్లవారుజామున 3 అయిందట. ఇలా ఒక కునుకు తీసేసరికి 5. దీంతో వెంటనే ప్రెస్ మీటు.. ఏపీపీఎస్సీ దురాచారంపై ఆగ్రహం.
కట్ చేస్తే.. మళ్లీ మోడీ పాల్గొనే సభ గురించి చర్చ, వర్చువల్‌గా ఏర్పాట్ల పరిశీలన.. వంటివి షరా మామూలే అయ్యాయి. మొత్తానికి నేతల మూతి బిగింపులు.. చంద్రబాబుకు పెద్ద పరీక్షే పెడుతున్నాయి. ఇదిలావుంటే.. చంద్రబాబు అందరికీ ఒకే హామీ ఇస్తున్నారు. ''పార్టీ అధికారంలోకి వచ్చాక.. మీ స్థాయికి తగిన పదవి ఇస్తా'' అని. ఎవరు వెళ్లి కలిసినా.. వారికి ఈ మాటే చెబుతున్నారు. దీంతో ఇది కూడా వికటించే ప్రమాదం ఉందని టీడీపీ అనుకూల వ్యక్తులు చెబుతున్నారు. ఇప్పటికి 50 మందికి ఇదే మాట చెప్పారు. రేపు పార్టీ అధికారంలోకి వస్తే.. అటు బీజేపీ నుంచి, ఇటు జనసేన నుంచి కూడా నామినేటెడ్ పదవులపై ఒత్తిడి ఉంటుంది. కాబట్టి టీడీపీ అధినేత ఇలా వరాలు ఇస్తే ఎలా అనేది ఒక వాదన.
కట్ చేస్తే.. చంద్రబాబు ప్రకటించిన రెండు జాబితాల్లో చోటు దక్కని ఆశావహులు ఆయన నివాసానికి శుక్రవారం అర్ధరాత్రి వరకు వస్తూనే ఉన్నారు. కొందరు పిలవకుండానే వస్తున్నారు. మరికొందరు నేతలను పిలిచి చంద్రబాబు మాట్లాడుతున్నారు. వారి రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇచ్చి బుజ్జగిస్తున్నారు.
+ పెదకూరపాడు అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్‌ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ను జీవీ ఆంజనేయులు తీసుకొచ్చారు. శ్రీధర్ రాజకీయ భవిష్యత్తుకు చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి రాగానే తగిన ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.
+ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా ఉన్న కళా వెంకట్రావు పేరు రెండో జాబితాలో కూడా లేకపోవడంతో ఆయన వర్గీయుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఆయన కూడా అధినేతను కలిశారు. ఆయనకు కూడా సేమ్ టు సేమ్ హామీ లభించింది.
+ రెండు జాబితాల్లోనూ చోటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న పెనమలూరు ఇన్‌ఛార్జి బోడె ప్రసాద్‌ను బుజ్జగించారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండబాబు.. చంద్రబాబు నివాసానికి వచ్చారు. కాకినాడ అర్బన్ టికెట్ ఇంకా ప్రకటించలేదు. దీంతో ఆయనను కూడా బుజ్జగించారు. ప్రస్తుతం ఈ బుజ్జగింపుల పర్వం నామినేషన్లు మొదలయ్యే వరకు సాగుతుందని తెలుస్తోంది.