50 రోజుల్లో చంద్ర‌బాబు సృష్టించిన సంప‌ద ఎంత‌... !

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ర‌మార‌మి.. 50 రోజులు గ‌డుస్తోంది.

Update: 2024-07-25 09:30 GMT

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ర‌మార‌మి.. 50 రోజులు గ‌డుస్తోంది. మ‌రి ఈ 50 రోజుల పాలనలో సృష్టించిన సంపద ఎంత? ఈ విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల కంటే కూడా మేధావి వర్గాల్లో చ‌ర్చ‌గా మారింది. సంపద సృష్టిస్తామంటూ ఎన్నికల ముందు ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు ఈ 50 రోజుల్లో ఏమేరకు సంపద సృష్టించారు? వనరులను సృష్టించారు? అనే విషయాన్ని చర్చిస్తున్న విషయం అంతర్జాలంలో స్పష్టంగా కనిపిస్తోంది. మేధావుల నుంచి రాజ‌కీయ ఉద్ధండుల వ‌ర‌కు కూడా.. సంప‌ద సృష్టిపై చ‌ర్చిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ అయితే.. చాలా ఆస‌క్తిగా చూస్తోంది.

అయితే.. కూట‌మి నేత‌లు.. ``ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది.. అప్పుడే ఎందుకు సెగ పెడతారు`` అని విమర్శలు చేయొచ్చు. కానీ సంపద సృష్టిస్తామ‌ని ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో.. ఒక నెల రోజులు టైం తీసుకోవచ్చు కానీ 50 రోజులు గడిచిపోయిన తర్వాత కూడా ఆ దిశగా ఒక ప్రకటన రాలేదు. ఆ దిశగా చేపడుతున్న చర్యలు కూడా కనిపించడం లేదు. దీంతో సంపద సృష్టి విషయంలో చంద్రబాబు ఏం చేస్తున్నారు అనేది చర్చించుకోవడంలో ఎలాంటి తప్పు లేదు.

మరోవైపు ఎన్నికలకు ముందు వైసిపి హ‌యాంలో రాష్ట్రం అప్పులపాలు అయిపోయిందని, శ్రీలంక చేస్తున్నారని.. ఇలాగే చేస్తూ పోతే భవిష్యత్తు తరాలు నాశనం అయిపోతాయని.. బిజెపి, జనసేనతో పాటు టిడిపి ప్ర‌చారం చేసిన విష‌యం తెలిసిందే. కానీ, ఈ 50 రోజుల కాలంలో ఇదే కూట‌మి ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాల 12 వేల కోట్లు. దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. కానీ ప్రభుత్వంలో నాయకులు కానీ ముఖ్యంగా ప్రశ్నిస్తాన‌న్న పవన్ కళ్యాణ్ గాని స్పందించడమే లేదు.

అదే సమయంలో బ‌ల‌మైన మీడియా కూడా ఈ అప్పుల కుప్ప‌పై ఒక మాటంటే ఒక్క మాట కూడా రాయకుండా కళ్ళకు గంతలు కట్టుకుని వ్యవహరిస్తున్నట్టుగా ఉంది. ఇది మంచిదే కానీ.. గమనించే ప్రజలు కూడా అలా ఉంటారా? ముఖ్యంగా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారా? ఈ విషయాన్ని ప్రభుత్వం ఆలోచించుకోవాలి. వాస్త‌వానికికి జగన్ వ్యతిరేకత కన్నా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలే విజయానికి దోహదపడ్డాయి. నిజంగా జగన్ పై వ్యతిరేకంగా ఉంటే కూటమి ప్రభుత్వమే చెబుతున్నట్టుగా 39. 8% ఓటు బ్యాంకు వైసీపీకి వచ్చి ఉండేది కాదు.

కానీ ఇక్కడ కూటమి ఇచ్చిన‌ హామీలు అదేవిధంగా మార్పు వంటివి బలంగా పనిచేశాయి. కానీ ఇప్పుడు 50 రోజుల తర్వాత కూడా ఇప్పటికీ పాలన మెరుగు పడకపోగా.. సంప‌ద సృష్టిలో ఎలాంటి పురోగ‌తి లేక‌పోవ‌డం.. ప్రభుత్వం కంట్రోల్ చెయ్యలేని స్థితిలో కొన్ని కొన్ని ఘటనలు జరుగుతుండడం.. జరిగిన తర్వాత చేతులు కాల్చుకోవడం వంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మార్పు దిశ‌గా అడుగులు వేయాల్సి ఉంది. 50 రోజుల్లోనే ఎట్లాంటి మార్పు రాలేదంటే ముందు ముందు వస్తుందన్న సంకేతాలు కూడా ఉండ‌వు. కాబ‌ట్టి.. ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News