పేదలు ఎవరి పక్షం...జగన్ ట్రాప్ లో బాబు ?
పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తామంటే సామాజిక సమీకరణలు దెబ్బతింటాయని చెప్పి కోర్టుకు వెళ్ళిన ఘనుడు చంద్రబాబు అని కూడా జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో పేదల గురించి పెద్ద చర్చ సాగుతోంది. తాను పేదల పక్షం అని పేదల రాజ్యం తమదని జగన్ చాలా కాలంగా చెప్పుకుంటూ వస్తున్నారు. తాజాగా తన మీద జరిగిన రాళ్ల దాడిని కూడా ఆయన పేదల మీద దాడిగా అభివర్ణించారు.
పెత్తందారులు తన మీద దాడి చేశారు. పేదలకు తాను సంక్షేమ పధకాలు అందించడం వారిని అండగా ఉండడం చూసి ఓర్వలేకనే ఇలా చేస్తున్నారు అని జగన్ మండిపడ్డారు. చంద్రబాబుని పేదలకు పూర్తిగా వ్యతిరేకిగా జగన్ అభివర్ణించారు.
చంద్రబాబు ఏ రోజు అయినా పేదల కోసం పనిచేశారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. పేద రైతులకు విద్యుత్ ని ఉచితంగా ఇవ్వాలంటే వద్దు అన్నది ఈ చంద్రబాబు కాదా అని ఆయన నిలదీశారు. పేదలకు ఏదైనా పధకం ఇవ్వాలంటే కూడా ఆయన అడ్డం పడతారు అని అన్నారు. కిలో రెండు రూపాయల బియ్యాన్ని ఎన్టీఆర్ తీసుకుని వస్తే చంద్రబాబు దానిని అయిదు రూపాయల ఇరవై పైసలకు చేశారని అదీ పేదల పట్ల బాబుకు ఉన్న అసలు ప్రేమ అని ఎద్దేవా చేశారు.
పేదలు బాగు పడతారు అనుకుంటే ప్రత్యేక హోదాను ఏపీకి రాకుండా చేసి పూర్తిగా తాకట్టు పెట్టిన ఘనత బాబుదే అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు అని తన ఫిలాసఫీని బయటపెట్టుకున్న వ్యక్తి కూడా చంద్రబాబే అన్నారు. పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తామంటే సామాజిక సమీకరణలు దెబ్బతింటాయని చెప్పి కోర్టుకు వెళ్ళిన ఘనుడు చంద్రబాబు అని కూడా జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంతలా పెదలకు వ్యతిరేకంగా ఉన్న నేతను తాను చూడలేదని అన్నారు. పేదల ఓట్లు కావాలి కానీ వారు మాత్రం బాగు పడకూడదు అన్నది బాబు సిద్ధాంతం అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అంతా దోచుకోవడం దాచుకోవడం పంచుకోవడం బాబు విధానంగా సాగుతుందని అన్నారు.
చంద్రబాబు పేదలకు వ్యతిరేకి అని తేలిన తరువాత ఆయనను పేదలు ఎందుకు ఆదరించాలి ఓట్లు వేయాలి అని జగన్ ప్రశ్నిస్త్న్నారు. ఇదంతా ఆయన గుడివాడ సభలో చెప్పుకొచ్చారు. సరిగ్గా జగన్ గుడివాడలో ప్రసంగం చేస్తున్న సమయంలోనే చంద్రబాబు ఉత్తరాంధ్రాలోని రాజం సభలో పాల్గొన్నారు. ఆయన పేదలకు మేలు చేయాలన్నదే తన తపన అంటూ చెప్పుకొచ్చారు.
పేదలకు తాను చేసిన మేలు జగన్ సహా ఎవరూ చేయలేదని అన్నారు. ఏపీలో పేదవాడు బాగుపడాలి అన్నదే తన నిరంతర ఆలోచనగా చెప్పుకున్నారు. తన మీద వైసీపీ నేతలు ఎన్ని దాడులు చేసినా పేదల కోసమే తాను నిలబడతాను అని బాబు అంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఎస్సీ ఎస్టీలకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. పేదలకు జగన్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని చంద్రబాబు విమర్శించారు.
ఇలా పేదల విషయం మీదనే జగన్ చంద్రబాబు ఇద్దరూ మాట్లాడుతున్నారు. తాము పేదల కోసమే అంటున్నారు. మరి పేదలు ఎవరి పక్షం అన్నదే ఇపుడు చర్చకు వస్తోంది. ఏపీలో చూస్తే పేదలే ఎనభై శాతంగా ఉన్నారు. వారు అర్బన్ రూరల్ అన్న తేడా లేకుండా ఉన్నారు. అలాగే పట్టణాలు పల్లెలు అన్న తేడా లేకుండా ఉన్నారు
వారికి కులం మతం లేదు పార్టీలు అన్నది కూడా లేదు. పేదలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అందుకే తాను పేదల పక్షమని జగన్ చాలా కాలంగా ఈ అతి పెద్ద జనాభాను తన వైపు తిప్పుకునే ప్రయంతం చేస్తున్నారు. వారికి తాను సంక్షేమ పధకాలను అందిస్తున్నాను అని చెబుతున్నారు. చంద్రబాబు సైతం తాను పేదల కోసమే రాజకీయం చేస్తున్నాను అని అంటున్నారు. మరి పేదలకు ఎవరు నిజమైన అండగా ఉన్నారు. పేదల మనసులో ఎవరు ఉన్నారు.
ఏపీ రాజకీయాన్ని మార్చేసి ఏకపక్షంగా పేదలంతా ఓటేసి గెలిపించేది ఎవరిని అన్నదే ఇపుడు చర్చకు వస్తోంది. పేదల గురించి మాట్లాడడం అన్న చర్చను జగన్ తెర లేపి చంద్రబాబుని తెలివిగానే ఈ వైపునకు లాగారు అని అంటున్నారు. పేదలకు గత ప్రభుత్వాలు చేసిన మేలు ఎంత అయినా జగన్ అయిదేళ్ళ పాలనలో ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలను వారి ఖాతాలో వేసి పేదలకు దగ్గర అయ్యారని వైసీపీ నేతలు అంటున్నారు.
అందుకే జగన్ ధైర్యంగా తాను పేదల పక్షం అంటున్నారు అని చెబుతున్నారు. చంద్రబాబు తాను పేదలకు చేస్తాను అని అంటున్నారు. ఇప్పటిదాకా చేశాను అని చెబుతున్నారు. మరి ఈ ఇద్దరిలో పేదలు ఎవరిని నమ్ముతారు అన్నది చూడాల్సి ఉంది.