ఏపీ ఆర్ధిక పరిస్థితి లోతుల్లోనే ?

ఈ నెల రోజులలో కొత్త ప్రభుత్వం ఏమి చేసింది అంటే కీలకమైన రంగాలకు సంబంధించి శ్వేత పత్రాలు రిలీజ్ చేశారు.

Update: 2024-07-10 15:57 GMT

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నెల 12కి సరిగ్గా నెల రోజులు అవుతుంది. అంటే ప్రజలు ఇచ్చిన మొత్తం అరవై నెలల అధికారంలో ఒక నెల గడచినట్లే. ఈ నెల రోజులలో కొత్త ప్రభుత్వం ఏమి చేసింది అంటే కీలకమైన రంగాలకు సంబంధించి శ్వేత పత్రాలు రిలీజ్ చేశారు.

అయితే ఏ శ్వేత పత్రం చూస్తే ఏముంది కొత్తదనం అంతా ప్రగతి నిరోధకం అన్న డైలాగు నే కూటమి పెద్దల నుంచి వస్తోంది. ఇక ఏది చేయాలన్నా డబ్బు ఉండాలి. ఆర్థికంగా బలంగా లేకపోతే ఆలోచనలు వేయి ఉన్నా అడుగు ముందుకు వేయలేరు. మరోవైపు చూస్తే ఏపీ ఆర్థిక పరిస్థితి మీద కూడా కూటమి ప్రభుత్వం పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు.

బయట నుంచి చూసినది వేరు ప్రభుత్వంలోకి వచ్చాక దిగేదాకా లోతులు తెలుస్తున్నాయని అంటున్నారు. చంద్రబాబు ఆర్ధిక రంగం మీద సమీక్ష చేస్తున్నారు. అయితే ఆర్ధిక రంగం పరిస్థితి ఇంకా అంతు చిక్కనిదిగానే ఉంది అని అంటున్నారు.

అప్పులు చూస్తే ఏకంగా 14 లక్షల కోట్ల రూపాయలుగా ఉండవచ్చు అని కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వానికి అన్నీ సవాళ్ళుగానే కనిపిస్తున్నాయి. ఎలా అడుగు ముందుకు వేయాలి అన్న దాని మీద కూడా తర్జన భర్జన పడుతున్నారు.

మరోవైపు చూస్తే ఈసారి పూర్తి బడ్జెట్ ప్రవేశపెడతారా అన్నది కూడా తెలియడం లేదు బడ్జెట్ లో అనేక రంగాలకు కేటాయింపులు చేయాలి. అలాగే సంక్షేమ పధకాలకు కూడా నిధులు చూసుకోవాలి. దాంతో ఆదాయం ఎంత అప్పు ఎంత అన్న దాని మీద మరింత స్పష్ట కోసం చూస్తున్నారు.

అదే టైం లో కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఎంత మేరకు ఆర్ధికంగా ఊతం లభిస్తుంది అన్నది కూడా చూస్తున్నారు. కేటాయింపులు కేంద్ర బడ్జెట్ లో చూసుకుని ఆ మీదట మిగిలిన సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ని పూర్తిగా పెట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఏది ఏమైనా ఏపీలో ఆర్ధిక రంగం అన్నది లోతైన అధ్యయనం చేయాల్సిన విషయమే అని అంటున్నారు. కొత్త ప్రభుత్వానికి కనీసంగా ఒక ఏడాది రెండేళ్ల వరకూ ఇదే రకమైన ఒడిదుడుకులు తప్పకపోవచ్చు అని అంటున్నారు. అదే విధంగా కేంద్రం ఈ సమయంలో ఆదుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.

అంతే కాకుండా బడ్జెట్ లో కేటాయింపులు చేసిన దానిని పూర్తిస్థాయిలో విడుదల చేస్తేనే రాష్ట్రం కోలుకోలగలదని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఏపీలో ఆర్ధిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంది అని అంటున్నారు. సంపద సృష్టి అన్నది ఒక రోజులో అయ్యేది కాదు అది క్రమంగా రావాలి. ఫలితాలు వచ్చేంతవరకూ కూడా వేచి చూడాలి. దాంతో కత్తి మీద సాముగానే ఆర్థిక రంగం ఉంటుందని అంటున్నారు.

Tags:    

Similar News