సీఎం నేనే అంటున్న చంద్రబాబు...పవన్ వింటున్నారా...?

చంద్రబాబు అయితే తుపాను బాధితుల పరామర్శ యాత్రలో రోజుకు పది సార్లు అయినా తానే సీఎం అని ప్రకటించేసుకుంటున్నారు

Update: 2023-12-09 16:01 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే పార్టీ సమావేశాలలో బహిరంగ సభలలో సీఎం పదవి అన్నది చంద్రబాబు తాను కలసి కూర్చుని చర్చిస్తామని చెబుతూ వస్తున్నారు. ఆ మధ్యన మంగళగిరిలో జరిగిన పార్టీ సభలలో ఇదే చెప్పారు. లేటెస్ట్ గా విశాఖ సభలో ఆయన తనను సీఎం అని అంటున్న అభిమానులను సున్నితంగా మందలిస్తూ సీఎం అన్నది ఇపుడు కాదు ముందు పార్టీని గెలిపించండి, ఆ మీదట చంద్రబాబుతో కలసి చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.

అయితే దానికి భిన్నంగా టీడీపీ అధినాయకత్వం వైఖరి ఉంది అని అంటున్నారు. చంద్రబాబు అయితే తుపాను బాధితుల పరామర్శ యాత్రలో రోజుకు పది సార్లు అయినా తానే సీఎం అని ప్రకటించేసుకుంటున్నారు. మా ప్రభుత్వం మూడు నెలలలో ఏపీలో అధికారంలోకి వస్తుంది అపుడు రైతుల సమస్యలను తామే పరిష్కరిస్తామని బాబు హామీలు ఇస్తున్నారు. నేము ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరు క్షణం తుపాను రైతులకు నష్ట పరిహారం పూవులలో పెట్టి ఇస్తామని కూడా బాబు చెబుతున్నారు.

ఇక వచ్చేది తమ ప్రభుత్వమే అని బాబు అంటున్నారు. దీంతో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే కాబోయే సీఎం ఎవరు అన్న డౌట్ అయితే తీరింది అని అంటున్నారు. నిజానికి ఈ డౌట్ ఎవరికీ లేదు కూడా ఆ మాటకు వస్తే జనసైనికులకు అసలు లేదు. వారికి తెలుసు. చంద్రబాబు సీఎం అవుతారు అని. అందుకే వారు సీఎం పవన్ అని అంటున్నారు.

వారికి ఉన్న బాధల్లా పవన్ ని సీఎం గా ప్రకటించకుండా ఏదైనా చేస్తారేమో అన్నదే. అందుకే సీఎం గా పవన్ అని పదే పదే అంటున్నారు. ఇక పవన్ కి కూడా సీఎం గా చంద్రబాబే ఉంటారని తెలుసా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఎందుకు తెలియదు అని రాజకీయాల మీద అవగాహన ఉన్న వారు కూడా అనే విషయం. పెద్ద పార్టీయే ఎపుడూ సీఎం పదవి తీసుకుంటుంది. ఏపీలో జనసేన టీడీపీ ప్రభుత్వం అని చెబుతున్నా జనసేన పోటీ చేసే సీట్లు మొత్తం 175లో ఆరవ వంతో ఏడవ వంతో ఉంటే సీఎం సీటు ఎలా లభిస్తుంది అన్నది ఎవరికీ తెలియని విషయం కాదు.

మరి ఇలా అందరికీ తెలిసిన విషయంలో పవన్ ఎందుకు ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అన్నదే ప్రశ్న. అయితే పవన్ జనసైనికులకు నచ్చ చెప్పే విషయంలోనే ఈ విధంగా చెబుతున్నారా అన్నది కూడ చర్చకు వస్తోంది. పవన్ సీఎం అంటే జనసైనికులకు వచ్చే హుషార్ జోరు వేరు. అదే చంద్రబాబు సీఎం అంటే వేరేగా రియాక్షన్ ఉంటుంది.

అందువల్ల ఎన్నికల క్రతువు విజయవంతంగా ముగించాలి అంటే తానూ సీఎం రేసులో ఉన్నాను అని చెప్పడమే పవన్ ఆలోచనగా ఉందని అంటున్నారు. మరో వైపు చూస్తే టీడీపీ 140 సీట్లకు తగ్గకుండా పోటీ చేస్తుందని అంటున్నారు. అధికారం చేపట్టాలీ అంటే మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు రావాలి. అంటే ఈ 140లో ఎలాగైనా సొంతంగా టీడీపీకి 90 నుంచి వంద సీట్లు వస్తే చాలు మిత్రపక్షాలతో సంబంధం లేకుండా బాబే సీఎం అవుతారు.

అలాంటి వెసులుబాటు చూసుకునే పొత్తు సీట్లను టీడీపీ డిసైడ్ చేస్తుంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే 2014లో బీజేపీకి 12 సీట్లను టీడీపీ ఇచ్చింది.అందులో వారు గెలిచింది నాలుగు. ఇక మిగిలిన 163 సీట్లలో టీడీపీ పోటీ చేసి 105 దాకా గెలిచింది. దాంతో బాబు సీఎం అయ్యారు. అయినా మిత్ర ధర్మంగా బీజేపీకి రెండు మంత్రి పదవులు ఇచ్చారు.

ఇక 2024 ఎన్నికల్లో జనసేనకు బీజేపీకి ఇచ్చిన సీట్ల కంటే డబుల్ ఇస్తారు అని అంటున్నారు అంటే పాతిక సీట్ల దాకా అన్న మాట. మరి అందులో జనసేన గెలిచే దాన్ని బట్టి నాలుగది మంత్రి పదవులు మిత్ర ధర్మంగా ఇవ్వవచ్చు అని అంటున్నారు. ఏపీలో పాతిక మంది దాకా మంత్రులను తీసుకోవచ్చు. అందులో ఇరవై మంది మంత్రుల దాకా టీడీపీ వారు ఉంటే అయిదుగురు జనసేన నుంచి ఉండవచ్చు. ముఖ్యమంత్రి మాత్రం పక్కాగా చంద్రబాబే అంటున్నారు. ఎనీ డౌట్స్ అని అంటున్న వారూ ఉన్నారు. మరి అర్థం చేసుకోవాల్సింది ఎవరు అన్నదే ఇక్కడ ప్రశ్న.

Tags:    

Similar News