ఒక్కటీ ఎవరిది పుష్పా ?

ఈ రోజుకు కూడా ఈ డైలాగ్ ని ఎవరికి వారు సందర్భోచితంగా వాడుతూంటారు.

Update: 2024-07-09 23:30 GMT

ఆ మధ్య రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన పుష్ప సినిమాలో పాపులర్ డైలాగ్ ఉంది. పుష్పా ఒక్కటి తక్కువ అయింది అని. అది కూడా సినిమా క్లైమాక్స్ లో పెద్ద డైలాగ్ అలా పేలింది. సినిమాను ఊపేసింది. ఈ ఒక్క డైలాగ్ ఎంతో ఫ్యామస్ అయింది. ఈ రోజుకు కూడా ఈ డైలాగ్ ని ఎవరికి వారు సందర్భోచితంగా వాడుతూంటారు.

ఇపుడు దీనిని కాస్తా ఏపీ పాలిటిక్స్ కి అన్వయిస్తే ఏపీలో మొత్తం పాతిక మంది మంత్రులను తీసుకోవచ్చు. కానీ చంద్రబాబు సరిగ్గా నెల రోజుల క్రితం 24 మంది మంత్రులను తీసుకుని ప్రమాణం చేయించారు. ఆ రోజున ఒక్క ఖాళీ ఉంచారు. ఇప్పటికీ ఆ ఖాళీ అలాగే ఉంది. కేబినెట్ మంత్రి పదవి కోసం అంతా ఎదురుచూసేలా ఆ ఖాళీ ఊరిస్తోంది.

ఆశావహుల లెక్క చెప్పమంటే వన్ ఈస్ టూ హండ్రెడ్ అబౌ అన్నటుగానే ఉంది. అంటే ఒక్క మంత్రి పదవి కోసం వందకు పైగా ఎమ్మెల్యేలు ఆశతో చూస్తున్నారు. అందులో టీడీపీ వారితో పాటు కూటమిలోని బీజేపీ జనసేన ఎమ్మెల్యేల కన్ను కూడా ఈ ఒక్క ఖాళీ మీదనే ఉంది. మరి ఇంతలా ఊరించే ఆ ఒకే ఒక్క మినిస్టర్ పదవి ఎవరికి అన్నదే చర్చ.

అందుకే ఆ ఒక్కటీ ఎవరికి పుష్పా అని పొలిటికల్ సర్కిల్స్ లో ఇపుడు ఈ డైలాగ్ బాగా పేలుతోంది. చంద్రబాబు రాజకీయ చాణక్యుడు. ఆయన రాజకీయం ఎవరికీ ఒక పట్టాన అర్థం కాదు. ఆయన అన్ని మంత్రి పదవులూ ఇచ్చేసి మరీ ఒక్క బెర్త్ ని అలా ఉంచారు అంటే దేని కోసం ఎందు కోసం అన్న చర్చ నడుస్తోంది.

అసలు ఎవరికి ఇవ్వాలని ఈ ఖాళీని ఉంచేశారు అన్న టాక్ కూడా సాగుతోంది. ఇక సీనియర్ మోస్ట్ నేత మండలిలో ఎమ్మెల్సీగా ఉన్న యనమల రామక్రిష్ణుడికి అయితే ఇప్పటికే ఆయన చూసిన ఆర్థిక మంత్రిత్వ శాఖను పయ్యావుల కేశవ్ కి ఇచ్చారు.

యనమల వంటి సీనియర్ కి ఆర్థిక మంత్రిత్వ శాఖ అయితే బాగా సూట్ అవుతుంది ఆయనే దానిని నిభాయించగల సమర్ధుడు అని పేరు కూడా ఉంది. సో అలా యనమలకు చాన్స్ లేదు అని అనుకోవచ్చు అని అంటున్నారు. మరి ఇంకా ఎవరి కోసం ఆ ఖాళీని అట్టేబెట్టారు అన్న చర్చ సాగుతోంది.

మంత్రివర్గంలో చూసుకుంటే ఓవరాల్ గా బలమైన క్షత్రియ సామాజిక వర్గానికి చాన్స్ ఇవ్వలేదు. వారు గోదావరి జిల్లాలో బలంగానే ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలు కూడా కొందరు గెలిచి ఉన్నారు. అయితే వారి నుంచి ఈ మంత్రి పదవిని భర్తీ చేయడానికా అంటే అది కూడా ఆలోచన సాగుతోంది. ఇప్పటికే రఘురామ రాజు ఉన్నారు. ఆయన మంత్రి పదవి కోసం ఆశగా ఎదురు చూశారు కానీ ఆయనకు దక్కలేదు.

పోనీ పిఠాపురంలో జనసేన గెలుపు వెనకాల కొండంత అండగా నిలబడి తన సీటుని త్యాగం చేసిన వర్మకు మంత్రి పదవి అంటే ఆయనకు తాజా ఎమ్మెల్సీ ఖాళీలలో అవకాశమే దక్కలేదు. ఆయనకు నామినేటెడ్ పదవి ఏదైనా ఇస్తారు అని అంటున్నారు. ఇక జనసేనకు మూడు మంత్రి పదవులు దక్కాయి. అయితే మరోటి కావాలని ఆ పార్టీ కోరుతోంది. బీజేపీ అయితే మరోటి అని అడుగుతోంది. వారి కోసమా అంటే అది కూడా కాదనే అంటున్నారు.

చంద్రబాబు దూర దృష్టితోనే ఆ ఖాళీని ఉంచారని అంటున్నారు. అది కూడా ఇప్పటప్పట్లో భర్తీ చేయకపోవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అన్ని శాఖలనూ మంత్రులు ఉన్నారు. ఎవరూ చూడని శాఖలు సీఎం వద్ద ఉంటాయి. పరిపాలనకు ఇబ్బంది లేదు. అయితే రాజకీయంగా ఆశలు పెంచడానికి ఎవరికి వారు తమకూ చాన్స్ అని భావించి తగ్గి ఉండడానికే ఆ ఒక్క ఖాళీని ఉంచారని అంటున్నారు.

దానిని నింపితే మాత్రం ఉసూరుమంటూ ఉంటారు. కానీ నింపకపోతే ప్రతీ వారూ తమకే అనుకుంటారు. అదే బాబు మార్క్ పాలిటిక్స్ అని అంటున్నారు. మొత్తం మీద ఒకే ఒక్క పోస్టుతో టీడీపీతో పాటు కూటమిలో మంత్రి పదవి ఆశలను ఇంకా సజీవంగా ఉంచారంటే దటీజ్ చంద్రబాబు అని అంటున్నారు. ఆయన ఆలోచనలు గమనిస్తూ ఎవరికి వారుగా అంచనాలు కడుతూ మంత్రి పదవి కోసం ఎదురుచూడడమే మిగిలింది అని అంటున్నారు.

Tags:    

Similar News