సలహాదారుల విషయంలో లెక్క అదీ...జగన్ తో పోలిస్తే !

ఇవన్నీ ఇలా ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు సలహాదారులు ఎంతమంది ఈ విషయంలో ఆయన ఆలోచనలు ఏమిటి అన్న చర్చ అయితే నడుస్తోంది.

Update: 2024-08-07 03:28 GMT

ఏ ప్రభుత్వం అయినా అధికారంలో ఉన్నపుడు తమకు కొంతమంది సలహాదారులను నియమించుకుంటుంది. వారికి ప్రభుత్వమే గౌరవ వేతనం చెల్లిస్తూ ఉంటుంది. నిజానికి మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా లేక ఎమ్మెల్యే అయినా అన్ని రంగాలలో నిష్ణాతులు కానవసరం లేదు వారు ప్రజల మెప్పు పొంది వారి ఓట్లతో అధికారంలోకి వస్తారు.

అలా వచ్చిన తరువాత ప్రజలకు మేలు చేయాలని చూస్తారు. కొన్ని నిర్ణయాలు తీసుకునేటపుడు వారికి ఆయా రంగాలలో అనుభవం ఉన్న వారి సలహాలు అవసరం అవుతాయి. అందుకే తమకంటూ బాగా కావాల్సిన వారిని అన్నీ తెలిసిన వారిని సలహా దారులుగా పెట్టుకుంటూ ఉంటారు. దీనికి ఎంత పరిధి, ఎంతమంది ఉండాలి అన్న దానికి అయితే లెక్క ఏమీ లేదు.

కానీ ప్రభుత్వం సొమ్ము ప్రజా ధనం కాబట్టి సాధ్యమైనంతవరకు తక్కువ మందితో నడిపిస్తే బాగుంటుంది అనే అంతా అంటారు. మరో వైపు చూస్తే సలహాలు ఇవ్వడానికి ప్రభుత్వ అధికారులు ఉంటారు. ఐఏఎస్ చదివిన వారు ఎన్నో విషయాల మీద అవగాహనతో ఉంటారు. కానీ వారితో పాటుగా తమ సొంత ఆలోచనలూ జత చేయడానికే ఈ సలహాదారులను నియమించించుకుంటూ ఉంటారు.

ఇక సలహాదారుల వ్యవస్థ ఇటీవల దశాబ్దాలలో సాగుతోంది. కానీ అది ఎక్కువగా వివాదాస్పదం అయి జనం నోళ్లలో నానినది మాత్రం వైసీపీ ఏలుబడిలోనే. జగన్ ప్రభుత్వంలో నలభై నుంచి యాభై మధ్యలో సలహాదారులు ఉండేవారు అని ప్రచారంలో ఉంది. వారు ఏ పనిచేసేవారో ఏ సలహా ఎవరికి ఇచ్చేవారో తెలియదు కానీ వారికి గౌరవ వేతనాలు అయితే భారీగా ఉండేవి.

ఇక ఒక సీనియర్ పాత్రికేయుడు ఇలాగే సలహాదారుడిగా వైసీపీ ప్రభుత్వంలో నియమితులై కొన్ని నెలల తరువాత ఊరకే జీతం పుచ్చుకుంటున్నాను నా సలహా ఎవరికీ అక్కరలేదు అయినా నన్ను ఎవరూ ఏదీ అడగడం లేదు అని చెప్పి బయటకు వచ్చేశారు. దానిని బట్టి చూస్తే సలహాదారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో అన్నది అర్ధం అవుతుందని ప్రతిపక్షాలు కూడా విమర్శించేవి.

ఇవన్నీ ఇలా ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు సలహాదారులు ఎంతమంది ఈ విషయంలో ఆయన ఆలోచనలు ఏమిటి అన్న చర్చ అయితే నడుస్తోంది. అయితే చంద్రబాబు మాత్రం సలహాదారులు వద్దు అనే అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో ఆర్ధిక పరిస్థితి గడ్డుగా ఉంది. ఖజానాలో చిల్లి గవ్వ లేదు. ఈ నేపధ్యంలో ప్రతీ పైసా ముఖ్యంగా ఉంది.

సలహాదారుల నియామకం పేరుతో కొందరికి రాజకీయ ఆశ్రయం కల్పించి తద్వారా లక్షలలో జీతాలు ఇతర వసతులు కల్పించడం ఇపుడున్న పరిస్థితులలో దుబారాగా బాబు భావిస్తున్నారు అని అంటున్నారు. పైపెచ్చు తామే గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించి అదే పని చేస్త జనలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని కూడా ఆలోచిస్తున్నారుట.

ఇక చంద్రబాబు 2014 నుంచి 2019 దాకా చేసిన పాలనలో చూస్తే సలహాదారులు ఉండేవారు కానీ వారంతా వైసీపీ ఏలుబడిలో ఉన్నంతమంది కారు. ఇపుడు చూస్తే సలహాదారులు అంటేనే జనంలో ఒక నెగిటివిటీ ఏర్పడిపోయిన పరిస్థితి ఉంది. దానికి తోడు గతంలో వైసీపీ ప్రభుత్వంలో సలహాదారులకు రాజకీయ పునరావాసంగా అన్నీ కల్పొస్తూ వారి కోసం ప్రజా ధనం ఖర్చు చేయడాన్ని అంతా తప్పు పట్టారు.

అందుకే ఆ తప్పు చేయకూడదని బాబు భావిస్తున్నారు అని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ విధానం అమలు చేసి భవిష్యత్తులో ఆర్ధికంగా కోలుకుంటే కనుక అపుడు కొంతమందికి సలహాదారులుగా అవకాశం ఇవ్వవచ్చు అన్నదే బాబు ప్లాన్ అని అంటున్నారు.

Tags:    

Similar News