చంద్రబాబు తెలంగాణాలో ఎంట్రీ...బీఆర్ఎస్ బలోపేతం!

ఏపీకి నాలుగవ సారి సీఎం అయ్యాక తొలిసారి హైదరాబాద్ వచ్చిన బాబుకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి భారీ స్వాగతం లభించింది.

Update: 2024-07-09 11:48 GMT

చంద్రబాబు ఇటీవల తెలంగాణాలో ఎంట్రీ ఇచ్చారు. అది కూడా భాగ్యనగరం అంతా పసుపు మయం అయ్యేలా భారీ హోర్డింగులు ఫ్లెక్సీలు బ్యానర్లతో అతి పెద్ద హడావుడి జరిగింది. ఏపీకి నాలుగవ సారి సీఎం అయ్యాక తొలిసారి హైదరాబాద్ వచ్చిన బాబుకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి భారీ స్వాగతం లభించింది.

ఇక తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డితో ఏపీకి సంబంధించిన విభజన సమస్యల మీద చర్చించిన చంద్రబాబు ఆ తరువాత తెలంగాణా తెలుగుదేశం పార్టీ మీటింగులో కీలక వ్యాఖ్యలు చేసారు. రానున్న కాలంలో తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ బలపడుతుందని ఆయన చెప్పడంతో రాజకీయంగా అది అతి పెద్ద చర్చగా మారింది.

మరో వైపు చూస్తే చంద్రబాబు 2019 నుంచి 2024 వరకూ అయిదేళ్ళ పాటు తెలంగాణాలో టీడీపీని పట్టించుకోలేదు. ఆయన తన మొత్తం దృష్టిని అంతా ఏపీ మీదనే పెట్టారు. అధికారం మళ్లీ అక్కడ దక్కించుకున్నారు. ఇపుడు అదే ఊపుతో తెలంగాణాలో సైతం పార్టీని పటిష్టం చేయాలని చూస్తున్నారు.

అయితే తెలంగాణాలో టీడీపీ దూకుడు చేసినా లేక చంద్రబాబు ఎంట్రీ బలంగా ఉన్నా ఆ పరిణామాలు ఎలా ఉంటాయన్న దాని మీద చర్చ సాగుతోంది. బాబు ఎంత బలంగా తెలంగాణా వైపు వస్తే అంతే బలంగా బీఆర్ఎస్ ఊతం వచ్చినట్లుగా ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఒక ఎమోషన్ ని ముందు పెట్టుకుని ఎదిగిన పార్టీ.

ఆ పార్టీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వరసగా ఓటమి పాలు అయింది. ఇపుడు బీఆర్ఎస్ పైకి లేవాలీ అంటే ఒక బలమైన ఎమోషన్ కావాలి. నిజానికి రేవంత్ రెడ్డి దెబ్బతో బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో కుదేలు అయింది. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికలు చూస్తే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ నుంచి ఏకంగా ఇరవై శాతం ఓట్లను బీజేపీ తీసుకెళ్ళింది అంటే గులాబీ పార్టీ ఎంత దెబ్బ తిన్నదీ అర్ధం అవుతుంది.

దాంతో టీఆర్ఎస్ ని స్థాపించాక డిపాజిట్లు రాని ఎన్నిక అంటే ఇదే అని అంతా అంటున్నారు. ఇక కేసీఆర్ కుమార్తె కవితకు బెయిల్ కోసం అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ ఇద్దరూ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ ఢిల్లీ టూర్లు బీజేపీతో సర్దుబాటు కోసం అని కూడా అంటున్నారు. ఇదే విధంగా గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి.

అయితే తెలంగాణాలో బీఆర్ఎస్ ఎన్నడూ లేని విధంగా అత్యంత బలహీనంగా ఉంది. బీఆర్ఎస్ ఎంత బలహీనపడితే అంతలా బీజేపీ రాజకీయంగా లాభపడుతుంది. ఇది పార్లమెంట్ ఎన్నికల్లో అంతా చూశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ని దగ్గరకు తీసి బలోపేతం చేయాల్సిన అవసరం అయితే బీజేపీకి లేదు అని అంటున్నారు.

మరో వైపు రేవంత్ రెడ్డి బిజినెస్ పాలిటిక్స్ తో కార్పోరేట్ లెవెల్ లో ఢిల్లీలో మంత్రులను కలుస్తున్నారు. తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు ఇవ్వమని ఆయన అడుగుతున్నారు. ఇలా తెలంగాణాలో రాజకీయ సన్నివేశం ఉన్న వేళ చంద్రబాబు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. చంద్రబాబు తెలంగాణాలో ఎంట్రీ ఇస్తే అది బీఆర్ఎస్ కే లాభం అని అంటున్నారు.

గత ఏడెనిమిది నెలలుగా ఎలాంటి పొలిటికల్ స్టఫ్ లేక ఇబ్బంది పడుతున్న బీఆర్ఎస్ కి ఇపుడు కావాల్సినంత కంటెంట్ అయితే చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు. బాబు ఎంట్రీ తరువాతనే ఇలా కావాల్సినంతగా పొలిటికల్ సరుకు బీఆర్ఎస్ కి దొరికింది అని అంటున్నారు.

జాబ్ హోల్డర్స్ లో చూస్తే ఇంకా పెద్ద ఎత్తున తెలంగాణా ఉద్యమకారులు ఉన్నారు. వారింకా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వైపు మళ్లడం లేదు అని అంటున్నారు. ఈ నేపథ్యం నుంచి చూసినపుడు బీఆర్ఎస్ పొలిటికల్ ఆక్సిజన్ ని చంద్రబాబు అందిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.

నిజానికి చంద్రబాబు టైంలోనే తెలంగాణా మలివిడత ఉద్యమం స్టార్ట్ అయింది. బాబు కేబినెట్ లో డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కేసీఆర్ తన పదవికి టీడీపీకి రాజీనామా చేసి 2000లో టీఆర్ఎస్ ని స్థాపించారు. అలా బాబు మీదనే యుద్ధం అన్నట్లుగా తెలంగాణా ఉద్యమం సాగింది.

దాంతో తెలంగాణా ఉద్యమానికి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు చంద్రబాబు తరువాత కాలంలో మద్దతు తెలిపినా కూడా బాబు మీద ఆ ఇంప్రెషన్ అయితే తెలంగాణాలో బలంగా ఉంది. దాంతో బాబు తెలంగాణాలో ఎంట్రీ ఎపుడు ఇచ్చినా బీఆర్ఎస్ కి అది కొత్త ఊపిరిలు ఊదుతూనే ఉంది.

2018లో చంద్రబాబు కాంగ్రెస్ తో కలసి ఎన్నికలకు వెళ్తే రెండు పార్టీలు దారుణంగా దెబ్బ తిన్నాయి. అదే సమయంలో అనూహ్యంగా బీఆర్ఎస్ రెండవసారి గెలిచింది. దీంతో చూసుకుంటే కనుక ఇపుడు బాబు తెలంగాణాలో ఎక్కువ చొరవ చూపిస్తే అంతకు వంద రెట్లు బీఆర్ఎస్ బలపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ ఎమోషన్స్ ని బీఆర్ఎస్ అసలు వదులుకోదని అంటున్నారు..

Tags:    

Similar News