జైలు అనుభవాలను పంచుకున్న చంద్రబాబు.. తెరపైకి కీలక విషయాలు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు వ్యవహారం ఎంత చర్చనీయాంశం అయ్యిందనే సంగతి తెలిసిందే

Update: 2024-05-09 08:39 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు వ్యవహారం ఎంత చర్చనీయాంశం అయ్యిందనే సంగతి తెలిసిందే. సుమారు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సుమారు 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి సీఐడీ వాదనతో ఏకీభవించిన కోర్టు బాబుకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది! అయితే... జైల్లో తనకు ఎదురైన అనుభవాలను చంద్రబాబు తాజాగా పంచుకున్నారు.

అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో సుమారు 53 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల వేళ తాజాగా ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి జైలు జీవిత అనుభవాలను పంచుకున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగా... తాను ఎన్నో ఇబ్బందులకు గురైనట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా తనను అరెస్ట్‌ చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు.. ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారో చెప్పాలని అడిగితే వారి నుంచి సమాధానం రాలేదని మొదలుపెట్టిన చంద్రబాబు... జైల్లో తనకు మంచం, కమోడ్ లేకుండా చేయాలని చూశారని అన్నారు. ఇదే సమయంలో జైల్లో ఉన్న తనను సీసీ కెమెరాలో చూస్తూ ఆనందపడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదే క్రమంలో... జైల్లోని తన సెల్ లోకి దోమలు రాకుండా కంట్రోల్ చేయడానికి తాను పోరాడినట్లు చెప్పిన ఆయన... జైల్లో డ్రోన్లు ఎగరేశారని.. తనను చంపాలని అనుకున్నారని తెలిపారు. ఇదే క్రమంలో... తనకు ట్యాబ్లెట్లు కూడా ఇవ్వకుండా చేశారని చెప్పుకొచ్చారు.

అయితే... తాను ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవించానని చెప్పిన చంద్రబాబు.. తాను ఏ తప్పు చేయలేదని జనం కూడా నమ్మారని అన్నారు. అందువల్లే... తాను సుమారు 53 రోజులు జైల్లో ఉంటే.. స్వదేశంతోపాటు విదేశాల్లోనూ జనం ఉద్యమించారని గుర్తు చేశారు. ఇంతగా నమ్మిన జనం కోసం జీవితాంతం పనిచేస్తానని.. అందుకు ఏమి చేస్తానో జూన్‌ 4 తర్వాత చూస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు.

Tags:    

Similar News