హాట్ టాపిక్ "రుషికొండ" భవనాలు... చంద్రబాబు కీలక నిర్ణయం!?
ఈ నేపథ్యంలో నూతన సీఎం చంద్రబాబు ఈ నిర్మాణాల విషయంలో సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన వేళ రుషికొండ నిర్మాణల వ్యవహారం ఎంత హాట్ టాపిక్ గా మారిందనే సంగతి తెలిసిందే. రుషికొండలో జగన్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన భవనాలపై రాజకీయంగా పెను దుమారం కొనసాగుతోంది. ఈ నిర్మాణాలు సొంత వినియోగం కోసం చేసారంటూ టీడీపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు స్థానిక టీడీపీ నేతలు వీటిని సందర్శించి ఫైరవుతున్నారు.
అవును... ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రుషికొండ నిర్మాణాలు ఎంత హాట్ టాపిక్ అనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... అవన్నీ పూర్తి ప్రభుత్వ భవనాలుగానే నిర్మాణం జరిగిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.. ఇవి తమ తమ సొంత ఇంటి నిర్మాణాలు కాదని నొక్కి చెబుతున్నారు. అయితే... ఈ సమయంలో ఈ భవనాల వినియోగంపై చంద్రబాబు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటినుంచీ రుషికొండ భవనాలపై టీడీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సుమారు రూ.500 కోట్లతో జగన్ సర్కార్ చేసిందని చెబుతున్న నిర్మాణాలను టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సందర్శించారు. ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చిన విలాసవంతమైన నిర్మాణాలు, ఫర్నీచర్, సౌకర్యాలు మొదలైన అంశాలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
మరోపక్క వైసీపీ ప్రభుత్వ హాయాంలో నిర్మించిన ఈ భవనాలను ప్రస్తుత ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ మాజీ మంత్రులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతన సీఎం చంద్రబాబు ఈ నిర్మాణాల విషయంలో సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా... ఈ భారీ భవనాలను అధికారిక కార్యక్రమాల కోసం వినియోగిస్తే పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారని అంటున్నారు.
దీంతో... వీటిని సద్వినియోగం చేసుకుంటూనే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గంపైన కొత్త ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఈ భవనాలను టాటా గ్రూపుకు అప్పగించే ప్రతిపాదన తెర మీదకు వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి టాటా గ్రూపు మూడు బ్రాండ్ల కింద హోటల్స్ ను నడుపుతోంది.
ఈ నేపథ్యంలో... హైదరాబాదులోని తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లాగా ఈ ప్యాలెస్ ను కూడా టాటా గ్రూపు నిర్వహణకు ఇవ్వటం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని.. ఫలితంగా వచ్చిన ఆదాయం మొత్తాన్ని అన్నా క్యాంటీన్ల నిర్వహణకు వినియోగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే... ఇది పూర్తిగా ఆ సంస్థకు అప్పగించాలా.. లేక, ప్రభుత్వ ఆధీనంలో ఉంచాలా అనే ప్రతిపాదనలూ జరుగుతున్నట్లు తెలుస్తుంది.
ఏది ఏమైనా.. ఈ రెండు ప్రతిపాదనలపై వచ్చే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని అంటున్నారు.